అన్నల్లో ఏంటీ గందరగోళం?
posted on Sep 20, 2025 9:13AM
ఎల్లకాలమూ సింహం మాత్రమే వేటాడదు. అప్పుడప్పుడూ సింహాన్ని వేటగాడు తరిమి తరిమి కొడుతుంటాడు. దీంతో ఆ సింహం వెనకడుగు వేసి అలసి సొలసి లొంగిపోయేలా కనిపిస్తుంది. వేట నుంచి తప్పుకుందామని కొంత సేపు. లేదు నేనింకా మృగరాజునే.. నన్నెవడ్రా ఆపేదన్న ఆలోచన కూడా చేస్తుంటుంది. ఈ రెండు ఆలోచనల దోబూచులాటలో.. పడ్డ సింహం అవస్థ ఆ వేటగాడికి కూడా కాసేపు ఏం చేయాలో అర్ధం కాదు. సరిగ్గా అలాంటి దృశ్యమే కనిపిస్తోంది అడవిలోని.. అన్నల విషయంలో.
కావాలంటే చూడండీ.. మొన్న నక్సల్ నేత అభయ్ పేరిట ఇక ఈ ఉద్యమం మేం నడపలేం అన్న ఆడియో క్లిప్పింగ్ విడుదలైందా? ఇప్పుడు చూస్తే అదే అన్నల నాయకుడు జగన్ పేరిట మరో లేఖ విడుదలైంది. అన్నలు అలాంటి డెసిషన్ ఏమీ తీసుకోలేదు. ఇప్పటికీ మేం అదే ఊపులో.. ఉద్యమంలో.. ఉన్నాము. ఇప్పటికిప్పుడు మా ఉద్యమానికొచ్చిన లోటేం లేదు. తగ్గేదే లే అన్నది ఆయన లేఖ సారాంశం. సోనూ అలియాస్ అభయ్ లా ఎవరైనా లొంగిపోవాలనుకుంటే.. వారు ఎంచక్కా పార్టీ పర్మిషన్ తీసుకుని వెళ్లిపోవచ్చు. ఇక్కడెవరూ వార్ని ఆపడం లేదని కూడా జగన్ తన లేఖలో పేర్కొన్నారు.
ఇటు చూస్తే 2026 మార్చినాటికల్లా అడవుల్లో అన్నల్ని ఏరి పారేస్తామంటోంది కేంద్రం. దానికి తోడు ఆపరేషన్ కగార్ ద్వారా సగం అడవులను ఖాళీ చేసేశారు. మొన్నా మధ్య నంబాల అనే అతి పెద్ద మావోయిస్టు వట వృక్షాన్ని నేలకూల్చారు. యువ కమాండర్ హిడ్మా ఎలా ఉన్నాడో తెలీడం లేదు. ఇంకో పక్క చూస్తే.. అసలు మావోయిస్టు పార్టీలో తెలుగు వారి ప్రాబల్యం బాగా తగ్గిపోయింది. అసలు అన్నల్లో చేరుతున్న వారెవరైనా ఉన్నారంటే.. అడవుల్లోని ఆదివాసీలే. వారికంటే ఇటు మృగ వేట అటు పోలీసుల వేట కు పెద్ద తేడా తెలీదు. ఈ దిశగా నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఒకప్పుట్లో అన్నలంటే బీటెక్, ఎంటెక్ చదివే వారు, యూనివర్శిటీల నుంచి ఎక్కువగా వెళ్లేవారు. నంబాల అదే కోవలోకి వస్తారు. ఇప్పుడు అలాంటి డిగ్రీ హోల్డర్స్ ఎవరూ లేరక్కడ. ఎంచక్కా ల్యాప్ ట్యాప్ నే తమ ఆఫీసు చేసుకుని.. ఐదు రోజుల డ్యూటీ ఆపై పబ్బుల వెంబడి తిరిగి తాగి తందనాలాడుతూ డాలర్ల వేటలో పీక లోతు మునిగిపోయి కనిపిస్తున్నారు. ప్రెజంట్ అడవుల్లో ఉన్నదల్లా వయసుడిగిన బ్యాచీయే. వీరంతా కలసి.. ఉద్యమం నడపాలా వద్దా? అన్న రెండు కోణాల ఆలోచన చేస్తున్నట్టు బయట పడుతోంది. అందులో భాగంగానే ఈ భిన్న పార్శ్వాలు వెలుగులోకి వస్తున్నట్టు అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.