సరిలేరు నీకెవ్వరు స్టాలిన్.. చూసి నేర్చుకో జగన్..
posted on May 19, 2021 @ 12:39PM
అరవ రాజకీయం. పగలు, ప్రతీకారాలతో రగిలిపోయే రాష్ట్రం. డీఎంకే, అన్నాడీఎంకే. ఉప్పు-నిప్పు. పచ్చగడ్డి వేస్తే భగ్గు. జయలలిత వర్సెస్ కరుణానిధి. నువ్వా-నేనా అన్నట్టు పోరు. టర్మ్ టర్మ్‌కి అధికారం మార్పు. పవర్ మారిన ప్రతీసారీ.. ఏదో ఒక ప్రతీకార చర్య. సీఎం కరుణానిధి హయాంలో జయలలితను జైల్లో వేస్తే.. నెక్ట్స్ టర్మ్.. సరిగ్గా అదే సెల్‌లో కరుణానిధిని బంధించింది తలైవి. ఇలా పవర్ ప్లేతో ఫక్తు పాలిటిక్స్ చేయడంలో తమిళనాడు తర్వాతే ఎవరైనా. ఇదంతా గతం. ఇప్పుడు తరం మారింది. రాజకీయంలోనూ మార్పు వచ్చింది. తమిళనాట మునుపెన్నడూ చూడని మార్పు. నభూతో అన్నట్టుగా ఉంది ముఖ్యమంత్రి స్టాలిన్ పని తీరు.
తండ్రి కరుణానిధి ఒళ్లో కూర్చొని రాజకీయ ఓనమాలు నేర్చినా.. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పాలిటిక్స్‌ను రక్తి కట్టించి రాటు దేలినా.. అదంతా అధికారంలోకి వచ్చే వరకే. వన్స్ స్టెప్ ఇన్.. ఇక పాలిటిక్స్ క్లోజ్ అంటున్నారు స్టాలిన్. ఫోకస్ అంతా పాలనపైనే. సమయమంతా ప్రజా సేవకే.. అన్నట్టు వ్యవహరిస్తున్నారు స్టాలిన్. తాజాగా, ఆయన తీసుకున్న పలు నిర్ణయాలు.. యావత్ దేశాన్ని ఆకట్టుకున్నాయి. అది తమిళనాడేనా అని ఆశ్చర్యపోయేలా చేశాయి. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిగ్గు పడేలా చేశాయి. రాజకీయాల్లో కొత్త ఒరవడి తీసుకొచ్చాయి.
అనేక రాష్ట్రాల్లో మాదిరే తమిళనాడులోనూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే లాక్‌డౌన్ లాంటి చర్యలు మొదలయ్యాయి. కొవిడ్ కట్టడిపై స్టాలిన్ ప్రభుత్వం ఫుల్‌గా ఫోకస్ పెట్టింది. మరిన్ని సమర్థవంతమైన చర్యల కోసం.. సీఎం స్టాలిన్ నేతృత్వంలో 13 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ కూర్పే ఇప్పుడు తమిళ రాజకీయాలకు కొత్త నిర్వచనం తీసుకొచ్చింది. దేశ రాజకీయాలకు ఆదర్శంగా నిలిచింది.
ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? అందులో సభ్యులుగా ఎవరు ఉంటారు? ఇంకెవరు ఉంటారు.. అధికార పార్టీ సభ్యులేగా? మామూలుగానైతే ఎక్కడైనా ఇలానే ఉంటుంది? ఓ నెల క్రితం వరకూ తమిళనాడులోనూ ఇలానే ఉండేది. కానీ, పాత చింతకాయ పచ్చడి టైప్ పాలిటిక్స్‌కు సీఎం స్టాలిన్ స్వస్థి పలికారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏర్పాటైన కొవిడ్ ప్రత్యేక కమిటీలో ప్రతిపక్స ఎమ్మెల్యేలకే చోటిచ్చారు. ఏదో పేరుకు ఒకరో ఇద్దరో కాదు. మొత్తం 13 మంది సభ్యులు ఉంటే అందులో ఏకంగా 12 మంది ప్రతిపక్ష అన్నాడీఎంకే ఎమ్మెల్యేలే సభ్యులుగా ఉండటం విశేషం. తమిళనాట సరికొత్త పాలనకు శ్రీకారం.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో 12 మంది విపక్ష ఎమ్మెల్యేలు ఉండగా.. అధికార పార్టీ నుంచి ఒకే ఒక సభ్యుడు, డాక్టర్ ఎళిలన్‌కు మాత్రమే చోటు లభించింది. నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ.. తమిళనాడులో విజృంభిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు అవసరమైన సలహాలు, సూచనలను ప్రభుత్వానికి ఇవ్వడం కమిటీ కర్తవ్యం.
తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకే సభ్యులు ఎదురెదురు పడటమే ఓ ప్రళయం లాంటి సందర్భం. ఆ రెండు పార్టీల నేతలు కనీసం ఒకరి ముఖం మరొకరు చూడటానికి ఇష్టపడరు.. పలకరించుకోరు.. ఎప్పుడు ఎదుటివారి పని పడదామా అన్నట్టు ఉంటుంది అక్కడి నేతల తీరు. అలాంటిది.. డీఎంకే ప్రభుత్వ కమిటీలో.. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉండటం.. తూర్పున ఉదయించే సూరీడు.. పశ్చిమాన ఉదయించడమే అవుతుంది.
కరుణానిధి, జయలలితలా ప్రతీకార పాలిటిక్స్‌తో చెలరేగిపోకుండా.. సామరస్యపూర్వకంగా రాజకీయం నెరపుతూ.. అందరితో శెభాష్ అనిపించుకుంటున్నారు స్టాలిన్. తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే.. తమిళనాడులో జయలలితకు, అన్నాడీఎంకేకు బ్రాండ్ ఇమేజ్‌లుగా ఉన్న.. అమ్మ క్యాంటిన్‌లను యధావిధిగా కొనసాగిస్తానంటూ ప్రకటించి ఆదర్శంగా నిలిచారు. స్టాలిన్ నిర్ణయంపై తమిళ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో అధికార, ప్రతిపక్షాలు ఎప్పుడూ ఉప్పు, నిప్పులా ఉంటాయి. ఇప్పుడా ప్రతీకార రాజకీయాలకు స్టాలిన్ ముగింపు పలికారంటూ ప్రజలు కొనియాడుతున్నారు.
అధికారంలోకి రాగానే.. విజయగర్వంతో ప్రతిపక్షాన్ని తొక్కేయాలని చూస్తారు. పాత ప్రభుత్వ పథకాలను అడ్డంగా ఆపేస్తారు. కేసులు, కుట్రలతో రెచ్చిపోతారు. తమిళనాడులోనూ ఒకప్పుడు అలానే జరిగింది. స్టాలిన్ వచ్చాకే ఆ కుట్ర రాజకీయాలకు తెరపడింది. కానీ, ఆ కంపు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు అంటుకుంది. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. ఏపీ పాలిటిక్స్ మరింత దారుణంగా దిగజారాయి.
జగన్‌రెడ్డి సీఎం కాగానే.. పేదల ఆకలి తీర్చి.. కడుపు నిండా భోజనం పెట్టే.. అన్నా క్యాంటీన్లను అడ్డంగా మూసేశారు. ఎందరో పేదల కడుపు కొట్టారు. ఆ పేదల క్యాంటిన్లపై ఎన్టీఆర్ బొమ్మ ఉంటుందని.. వాటికి పసుపు రంగు ఉందని.. అందులో భోజనం చేసిన ప్రతీ పేదోడికి.. చంద్రబాబే గుర్తొస్తారనే ఒకే ఒక్క కడుపుమంటతో.. లక్షలాది మంది పేదల కడుపు కొడుతూ.. అన్నా క్యాంటీన్లు మూసేశారు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి. అదే తమిలనాడులో స్టాలిన్ అలా చేయలేదు. జయలలిత ఫోటోతో ఉండే.. అమ్మ క్యాంటీన్లను కొనసాగిస్తూ.. పేదలకు అండగా నిలిచారు. ముఖ్యమంత్రి అంటే అలా ఉండాలి. జగన్‌లా రాజకీయాల కోసం నిరుపేదల ఆకలి తీర్చే పథకాలను స్వస్తి పలకడం పాపపు పని కాక మరొకటి కానే కాదనేది విమర్శ.
కేవలం అన్నా క్యాంటీన్ల మూసివేతతోనే ఆగలేదు జగన్. ఎక్కడ చంద్రబాబు ఆంధ్రుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారోననే అక్కస్సుతో.. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని.. ప్రపంచ స్థాయి నగరాన్ని..పేక ముక్కలా కుప్పకూల్చారు. ఏపీ కేపిటల్‌తో మూడు ముక్కలాట ఆడుతున్నారు. పేదలకు కట్టించిన ఇళ్లు.. లక్షల సంఖ్యలో రెడీగా ఉన్నా.. కేవలం చంద్రబాబుకు పేరు వస్తుందనే ఏకైక కారణంతో ఆ చూడ చక్కని ఇళ్లన్నిటినీ వృధాగా వదిలేశారు. ఆ బహుళ అంతస్థుల భవనాలను.. పాడుబడిన గృహాలుగా మార్చేసి.. కసి తీర్చుకున్నారు.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇలా అడ్డగోలు నిర్ణయాలు తీసుకోలేదే. వైఎస్సార్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కొనసాగించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కంటిన్యూ చేశారు. వైఎస్‌కు పేరు వస్తుందని.. చంద్రబాబు వాటిని ఆపలేదు కదా. మరి, జగన్ ఎందుకు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావటం లేదని అంటున్నారు. కనీసం తమిళనాడు సీఎం స్టాలిన్‌ను చూసైనా నేర్చుకోవాలని.. పద్దతులు సరి చేసుకోవాలని.. సూచిస్తున్నారు. అయితే, 150 మందికి పైగా ఎమ్మెల్యేలతో.. అధికార గర్వంతో విర్రవీగుతున్న జగన్‌రెడ్డి చెవికి ఇలాంటి మంచి మాటలు వినిపిస్తాయా? సీఎం స్టాలిన్ లాంటి నేతలు జగన్‌రెడ్డి కంటికి కనిపిస్తారా? తమళనాడుకు మాయని మచ్చలా మారిన ప్రతీకార పాలిటిక్స్‌కు.. ముఖ్యమంత్రి కాగానే స్టాలిన్ ముగింపు పలికినట్టు.. ఏపీలోనూ జగన్మోహన్‌రెడ్డి క్లీన్ అండ్ ఫెయిర్ పాలిటిక్స్ చేయగలరా? కక్ష సాధింపు చర్యలు, కుట్ర పూరిత కేసులకు పుల్‌స్టాప్ పెట్టగలరా? స్టాలిన్ పాలనా శైలి.. జగన్‌కు కనువిప్పు కలిగిస్తుందా?