తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌...తొలి రోజు భారీ పెట్టుబడుల వెల్లువ

 

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి   వివిధ రంగాల నిపుణులు పారిశ్రామిక వేత్తలు, వివిధ కంపెనీల ప్రతినిధులతో విడివిడిగా చర్చలు జరిపారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత  కైలాష్ సత్యార్థితో, బాలల హక్కులు, విద్య, మరియు యువత సాధికారత అంశాలపై చర్చించారు. కొరియా ప్రతినిధులతో సమావేశమై, ఎలక్ట్రానిక్స్ మరియు గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులపై చర్చించారు. ట్రంప్ మీడియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు, 

అమెజాన్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు.  అమెజాన్ సంస్థ తెలంగాణలో లాజిస్టిక్స్ మరియు రిటైల్ రంగాల్లో విస్తరణపై ఆసక్తి చూపింది. ఐకీయా సంస్థ ప్రతినిధులతో సమావేశమై, టెక్స్టైల్ మరియు ఫర్నిచర్ తయారీ రంగాల్లో MSME భాగస్వామ్యంపై చర్చించారు.   వియత్నాం‌కు చెందిన ప్రముఖ సంస్థ VINGroup ప్రతినిధులతో సమావేశమై, ఎలక్ట్రిక్ వాహనాలు మరియు హెల్త్‌కేర్ రంగాల్లో పెట్టుబడులపై చర్చించారు.

 ఎలక్ట్రానిక్స్ రంగ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో ఫ్యూచర్ సిటీలో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్ స్థాపనపై చర్చించారు. SIDBI, వరల్డ్ బ్యాంక్, వెస్ట్రన్ యూనియన్ ప్రతినిధులతో సమావేశమై, స్టార్టప్ ఫండింగ్ మరియు MSME ఫైనాన్స్ అంశాలపై చర్చించారు.  మాన్యుఫాక్చరింగ్, లాజిస్టిక్స్ మరియు వేర్‌హౌజింగ్ రంగ ప్రతినిధులతో భేటీ అయ్యారు.యూనివర్సిటీ ఆఫ్ లండన్‌తో ఉన్నత విద్యా భాగస్వామ్య MoU కుదిరింది. వంతార కన్జర్వేటరీ ప్రాజెక్ట్‌పై MoU సంతకాలు జరిగాయి.  చివరగా  ఆసియాన్ దేశాల రాయబారులు, వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. 

ఫస్ట్ రోజు భారీగా ఎంవోయూలు కుదిరాయి. వివిధ కంపెనీలతో రూ.1.88 లక్షల కోట్ల మేర ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకుంది. వివిధ కంపెనీలతో రూ.1.88 లక్షల కోట్ల మేర ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకుంది. డీప్‌ టెక్నాలజీ రంగంలో రూ.75 వేల కోట్లు, గ్రీన్‌ ఎనర్జీ రంగంలో రూ.27 వేల కోట్లు, పునరుత్పాదక రంగంలో రూ.39,700 కోట్లు, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగాల్లో రూ.19,350 కోట్లు, ఏవియేషన్‌ రంగంలో జీఎంఆర్‌ గ్రూప్‌తో రూ.15 వేల కోట్ల మేర ఒప్పందాలు కుదిరినట్లు ప్రభుత్వం వెల్లడించింది.


 

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ

  హైదరాబాద్ రవీంద్రభారతి ప్రాంగణంలో గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హరియాణా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్‌బాబు, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచందర్‌రావు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. 7.2 అడుగుల బాలు కాంస్య విగ్రహాన్ని తూర్పుగోదావరి జిల్లాలో తయారు చేయించారు. విగ్రహావిష్కరణలో భాగంగా రవీంద్ర భారతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బాలసుబ్రహ్మణ్యంకు ఇష్టమైన 20 సాంగ్స్‌తో ఇవాళ సాయంత్రం 50 మందితో సంగీత కచేరీ ఏర్పాటు చేశారు.  

వారానికి నాలుగు పనిదినాలు.. మూడు వీక్లీ ఆఫ్‌లపై చర్చ!

జపాన్, స్పెయిన్, జర్మనీలాంటి దేశాల్లో వారానికి నాలుగు రోజుల పని దినాలపై ప్రయోగాలు చేస్తున్నారు. మరి ఇండియాలో మూడు రోజుల వీక్లీ ఆఫ్ ల పరిస్థితి ఏంటి? ఈ విషయంలో కొత్త లేబర్ కోడ్స్ ఏం చెబుతున్నాయి? లేబర్ కోడ్స్ సూచిస్తున్న మేరకు ఆ దిశగా నిబంధనల అమలు సాధ్యమేనా? అన్న చర్చ నడుస్తోంది. ప్రతీ ఉద్యోగికి జీతం పడే రోజు ఎంత ముఖ్యమో.. వీక్లీ ఆఫ్ కూడా అంతే ముఖ్యం. వారం మొత్తం గొడ్డులా పని చేసిన ఉద్యోగులు వీక్లీ ఆఫ్ అదేనండీ వారాంతపు సెలవు  కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు. చాలా వరకు ప్రభుత్వ, కార్పొరేట్ ఆఫీసుల్లో వారానికి రెండు వీక్లీ ఆఫ్ లు ఉంటాయి. ఐదు రోజులు కష్టపడ్డ ఉద్యోగులు రెండు రోజులు సెలవు  తీసుకుంటారు. కొంతమంది ఉద్యోగులు వారానికి నాలుగు రోజుల పని దినాలు.. మూడు వీక్లీ ఆఫ్ లు ఉంటే బాగుండును అనుకుంటున్నారు. జపాన్, స్పెయిన్, జర్మనీలాంటి దేశాల్లో వారానికి నాలుగు రోజుల పని దినాలపై ప్రయోగాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే  ఇండియాలో మూడు రోజుల వీక్లీ ఆఫ్ లపై  చర్చ మొదలైంది. డిసెంబర్ 12వ తేదీన మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ తనఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టులో వారానికి నాలుగు రోజుల పని దినాలపై చర్చించింది.  మిత్ బస్టర్  పేరిట ఆ పోస్టు పెట్టింది. వారానికి నాలుగు రోజుల పని దినాలపై ఉన్న అపోహలకు ఫుల్ స్టాప్ పెట్టింది. కొత్త లేబర్ కోడ్ ప్రకారం వారానికి నాలుగు రోజులు వీక్లీ ఆఫ్ లు కావాలంటే.. మిగిలిప  నాలుగు రోజులూ  రోజూ 12 గంటల పాటు పని చేయాల్సి ఉంటుంది. అప్పుడే  మూడు రోజుల పాటు పెయిడ్ హాలిడేస్ వస్తాయి. 12 గంటల్లో ఇంటర్వెల్ కూడా ఉంటుంది. వారానికి పని గంటలు 48 గంటలుగానే కొనసాగుతాయి. రోజులో సాధారణ పని గంటల కంటే ఎక్కువ పని చేస్తే జీతాన్ని డబుల్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది.  2025, నవంబర్ 21వ తేదీన భారత ప్రభుత్వం 29 పాత లేబర్ లాస్‌ను తొలగించింది. కొత్తగా నాలుగు లేబర్ కోడ్స్‌  తీసుకుని వచ్చింది. కోడ్ ఆన్ వేజెస్ 2019, ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ 2020, సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020, ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండీషన్ కోడ్ 2020లను అందుబాటులోకి తెచ్చింది. పలు రకాల ఉద్యోగుల వర్క్‌ప్లేస్ రైట్స్‌ను కాపాడ్డానికి ఈ కొత్త లేబర్ కోడ్స్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది.

జీహెచ్‌ఎంసీ డివిజన్ల పునర్విభజనపై హైకోర్టులో పిటిషన్‌

  జీహెచ్‌ఎంసీ డివిజన్ల పెంపు వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరింది. డివిజన్ల పెంపును సవాల్ చేస్తూ వినయ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బి.విజయ్ సేనరెడ్డి విచారణ చేపట్టారు. డివిజన్ల పునర్విభజనలో అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని వినయ్‌కుమార్‌ పిటిషన్‌లో తెలిపారు.   డివిజన్‌పై తన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్‌ కోరారు. అనంతరం పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. మరోవైపు రేపు బల్ధియా ప్రత్యేక కౌన్సిల్ ప్రత్యేక సమావేశం కానుంది. ఈ సమావేశంలో కార్పొరేటర్ల అభిప్రాయాన్ని తీసుకోనున్నారు.   ఇప్పటి వరకు 1,328 అభ్యంతరాలు వచ్చాయిని  జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌ తెలిపారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్, జోనల్, సర్కిల్ ఆఫీసుల్లో అభ్యంతరాలు స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ 17వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు.   

శ్రీవారికి విరాళాలిచ్చేభ‌క్తుల‌కు టీటీడీ అందించే సౌకర్యాలేంటో తెలుసా?

తిరుమల వెంక‌టేశ్వ‌ర స్వామివారికి రూ. 1లక్ష నుంచి.. రూ.1కోటి విరాళం ఇచ్చే భక్తులకు టీటీడీ కొన్ని ప్రత్యేక సౌకర్యాలు అందజేస్తున్నది.   తిరుమల శ్రీవారి సేవలో భాగంగా విరాళాలు అందించే భక్తులకు, టీటీడీ ప్రత్యేక దర్శన,వసతి, ప్రసాదం వంటి పలు అవకాశాలను కల్పిస్తోంది. విరాళం మొత్తాన్ని బ‌ట్టి భక్తులకు అందే సౌకర్యాలు, అవకాశాలు ఉంటాయి.   1లక్ష రూపాయల నుంచి   5 లక్షల రూపాయల వరకూ విరాళం ఇచ్చే భక్తులు, ఆ విరాళానికి సంబంధించిన నగదు ధృవీకరణ రశీదు,  ఆదాయపు పన్ను మినహాయింపు ధ్రువీకరణ పత్రం,1 రోజు ఐదుగురికి సుపథం దర్శనం, అలాగే వంద రూపాయల టారిఫ్ ఒక రోజు వసతి కల్పించడంతో పాటు, ఆరు చిన్న లడ్డూలు, ఒక దుపట్టా, ఒక బ్లౌజ్ పీస్ టీటీడీ ఇస్తుంది.   అలాగే ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకూ విరాళం ఇచ్చే భక్తులకు నగదు ధృవీకరణ రశీదు, ఆదాయపు పన్ను మినహాయింపు ధృవీకరణ, ఒక ఏడాదిలో 3 రోజులు  ఐదుగురికి   సుపథం దర్శనం,  వంద రూపాయల టారిఫ్ తో 3 రోజుల వసతి కల్పించడంతో పాటు, 10 చిన్న లడ్డూలు, 5 మహాప్రసాదాలు,  ఒక దుపట్టా, 1 బ్లౌజ్ పీస్ ఇస్తారు. ఇక 10లక్షల రూపాయల నుంచి  పాతిక లక్షల రూపాయల వరకూ విరాళం  ఇచ్చే వారికి నగదు ధృవీకరణ రశీదు,  ఆదాయపు పన్ను మినహాయింపు ధృవీకరణ, ఏడాదిలో మూడు రోజులు ఐదుగురికి విఐపి బ్రేక్ దర్శనం,   అలాగే వెయ్యిరూపాయల టారిఫ్ తో  3 రోజుల వసతి కల్పించడంతో పాటు,  20 చిన్న లడ్డూలు, 10 మహాప్రసాదాలు, ఒక దుపట్టా, ఒక బ్లౌజ్ పీస్ తో పాటు  50 గ్రాముల శ్రీవారి వెండి నాణెం టీటీడీ అంద జేస్తుంది.  అలాగే పాతిక లక్షల నుంచి  50 లక్షల రూపాయల వరకూ విరాళం ఇచ్చే భక్తులకు నగదు ధృవీకరణ, పన్ను మినహాయింపు ధృవీకరణతో పాటు ,  ఏడాదిలో ఒక రోజు  ఐదుగురికి  మందికి సుపథం దర్శనం, 3 రోజులు ఐదుగురికి విఐపి బ్రేక్ దర్శనం,  1500  రూపాయల టారిఫ్ తో   3 రోజుల వసతి కల్పించడంతో పాటు, 4 పెద్ద లడ్డూలు, 5 చిన్న లడ్డూలు, 10 మహాప్రసాదాలు, 5 గ్రాముల బంగారు డాలర్ + 50 గ్రాముల వెండి నాణెం, ఒక దుపట్టా, ఒక  బ్లౌజ్ పీస్ టీటీడీ అందిస్తుంది.  ఇక పోతే.. 50 లక్షల నుంచి  75 లక్షల రూపాయల విరాళం ఇచ్చే భక్తులకు  నగదు ధృవీకరణ + పన్ను మినహాయింపు ధృవీకరణ, ఒక రోజు సుప్రభాత సేవ, 5 గురికి రెండు రోజులు  సుపథం దర్శనం, ఐదుగురికి, మూడు రోజులు విఐపి బ్రేక్ దర్శనం, అలాగే ఐదుగురికి రూ.2000 టారిఫ్‌తో మూడు రోజుల వసతి, 10 చిన్న లడ్డూలు, పది పెద్ద లడ్డూలు, పది మహా ప్రసాదాలతో పాటు 5 గ్రాముల బంగారు డాలర్, 50 గ్రాముల వెండి నాణెం, ఒక దుపట్టా, ఒక బ్లౌజ్ పీస్ అందిస్తుంది. ఇక 75 లక్షల నుంచి కోటి రూపాయల వరకూ విరాళం ఇచ్చే భక్తులకు  నగదు ధృవీకరణ, పన్ను మినహాయింపు, రెండు రోజులు సుప్రభాత సేవ-, ఐదుగురికిమందికి, 3 రోజులు సుపథం దర్శనం- ఐదుగురికి 3 రోజులు విఐపి బ్రేక్ దర్శనం, అలాగే ఐదుగురికి  రూ.2500 టారిఫ్‌తో 3 రోజుల వసతి,  8 పెద్ద లడ్డూలు, 15 చిన్న లడ్డూలు, 10 మహాప్రసాదాలు, 5 గ్రాముల బంగారు డాలర్ + 50 గ్రాముల వెండి నాణెంతో  పాటు, ఒక దుపట్టా, ఒక బ్లౌజ్ పీస్ అందజేస్తుంది. కోటి రూపాయలు అంత కన్నా  ఎక్కువ విరాళం ఇచ్చే భక్తులకు నగదు ధృవీకరణ రశీదు, పన్నుమినహాయింపు దృవీకరణ,  ఏడాదిలో 3 రోజులు ఐదుగురికి సుప్రభాత సేవ, వీఐపీ బ్రేక్ దర్శనం, వసతి, లడ్డూ ప్రసాదాలు, బంగారు డాలర్, వెండి నాణెం, దుపట్టా, జాకెట్ పీస్ సహా పలు అదనపు సౌకర్యాలను టీటీడీ కల్పిస్తుంది.  

నూతన సీఐసీగా రాజ్‌కుమార్ ప్రమాణ స్వీకారం

  నూతన చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా మాజీ ఐఏఎస్ రాజ్‌కుమార్ గోయల్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. రాజ్‌కుమార్‌తో పాటు మరో 8 మందిని సమాచార కమిషనర్లుగా సిఫార్సు చేశారు. 9 ఏళ్ల తర్వాత కమిషన్ పూర్తిస్థాయి సామర్థ్యంలో పనిచేయనుంది.  ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్​, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్​ సహా పలువురు హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కమిటీ రాజ్‌కుమార్‌ గోయల్‌ పేరును ప్రతిపాదించింది.  రాజ్‌కుమార్‌ గోయల్ 1990 బ్యాచ్​ అరుణాచల్ ప్రదేశ్-గోవా-మిజోరం-కేంద్రపాలిత ప్రాంతాల క్యాడర్‌కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి. ఆయన ఆగస్టు 31న కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖలోని న్యాయ విభాగ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. హోం శాఖలో కార్యదర్శి (సరిహద్దు నిర్వహణ)గా కూడా పనిచేశారు. కేంద్రంతో పాటు జమ్మూ కశ్మీర్​లోనూ కీలక పదవులను నిర్వహించారు.

సిడ్నీలో ఉగ్రఘాతుకం.. నిందితులు పాక్ కు చెందిన తండ్రీకొడుకులు

అస్ట్రేలియా సిడ్నీలోని బోండీబీచ్ లో జరిగిన నరమేథం ఉగ్రదాడేనని తేలింది. ఐసీస్ తో సంబంధాలున్న పాక్ జాతీయులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు.  యూదులు లక్ష్యం వారు హనూకా వేడుకలు జరుపుకుంటున్న సమయంలో పాకిస్థాన్ జాతీయులైన తండ్రీ కొడుకులు తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారని తేలింది. కాల్పులకు తెగబడ్డవారిని   నవీద్ అక్రమ్, అతడి తండ్రి సాజిద్ అక్రమ్ గా రక్షణ బలగాలు గుర్తించాయి. వీరిరువురూ పాక్ నుంచి వచ్చిన వారేనని వెల్లడించాయి. భద్రతాదళాల కాల్పుల్లో నవీద్ ఘటనాస్థలంలోనే మృతిచెందాడు. ఓ హంటింగ్ క్లబ్‌లో సభ్యుడైన అతడి తండ్రి సాజిద్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. సాజిద్ పేరిట 2015 నుంచి గన్ లైసెన్స్ ఉందని తేలింది. సాజిద్ వద్ద ఉన్న ఆరు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  ఈ తండ్రీకొడుకులు జరిపిన దాడిలో16 మంది మరణించగా, పోలీసులతో సహా పలువురు గాయపడ్డారు.  ఇలా ఉండగా నిందితుల్లో ఒకరు చాలా కాలంగా ఆస్ట్రేలియా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ ఏజెన్సీ నిఘాలో ఉన్నట్లు చెబుతున్నారు.  కాల్పుల ఘటన తరువాత జరిపిన సోదాలలో వీరి కారులో  ఐసీస్ నల్లజెండాలు లభ్యమయ్యాయి. కాగా వీరిని ఓ సామాన్యుడు ప్రాణాలకు తెగించి అడ్డుకున్నాడు. ఆ క్రమంలో అతడు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాలకు తెగించి నిందితులను అడ్డుకున్న వ్యక్తిని 43 ఏళ్ల అహ్మద్ గా గుర్తించారు,  ప్రాణాలకు తెగించి మరీ నిందితుడితో పోరాడిన అహ్మద్‌ రియల్ హీరోగా అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.  ఇక పోతే   కాల్పులకు తెగబడిన నిందితులు ఇద్దరూ చాలా ఏళ్లుగా సిడ్నీలో నివాసం ఉంటున్నా వారి మూలాలు పాకిస్తాన్‌లో ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.  విచారణలో భాగంగా పోలీసులు ఆదివారం డిసెంబర్ 14) రాత్రి వారి నివాసాల్లో సోదాలు చేశారు. ఈ సందర్భంగా  నవీద్ అక్రమ్ లైసెన్స్ పొందిన ఆయుధాలను విక్రయిస్తుంటాడని తేలింది.  

టోలిచౌక్‌లో ఓ యువకుడి దారుణ హత్య

ఘర్షణ ఆపడానికి వెళ్లిన యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన హైదరాబాద్ టోలీచౌక్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం (డిసెంబర్ 14) రాత్రి జరగింది. వివరాలిలా ఉన్నాయి.  పరమౌంట్‌ కాలనీలో ఆదివారం రాత్రి సమయంలో టోలిచౌక్‌ కుంట విరాట్‌నగర్‌కు చెందిన ఇర్ఫాన్‌ తన తమ్ముడు అదనాన్‌  బిలాల్‌ లమధ్య గొడవ జరుగుతున్నట్లు  తెలుసుని ఆ గొడవ ఆపేందుకు అక్కడకు వెళ్లాడు.  అయితే చినికి చినికి   గాలి వాన అయినట్లుగా ఆ గొడవ కాస్తా పెద్దదైంది.  బిలాల్ ఒక్కసారిగా ఇర్ఫాన్‌పై  కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఇర్ఫాన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఇర్ఫాన్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యం లోనే మరణించాడు.  సమాచారం అందుకున్న  టోలిచౌక్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు బిలాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి కేసు నమోదు చేశారు, గొడవకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఘటనతో పరమౌంట్‌ కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. గొడవ ఆపడానికి వెళ్లిన కొడుకు తిరిగి రాని లోకానికి వెళ్లిపోవడంతో  అతడి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

సఫారీలను చిత్తు చేసిన టీమ్ ఇండియా

సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా అలవోక విజయాన్ని అందుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన సఫారీ సేన.. టీమ్ ఇండియా బౌలర్ల ధాటికి కేవలం 117 పరుగులకే ఆలౌటైంది.  118 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమ్ ఇండియా   15.5 ఓవర్లలోనే చేధించింది. ఈ విజయంలో  5 టీ ట్వంటీల సిరీస్ లో టీమ్ ఇండియా  2-1 ఆధిపత్యంలోకి దూసుకెళ్లింది. ధర్మశాల వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ 20లో భారత బౌలర్లు చెలరేగారు. తొలుత టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న టీమిండియా.. అసాధారణ ప్రదర్శన చేసింది. అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్‌దీప్ యాదవ్, హర్షిత్ రాణా విజృంభించి సౌతాఫ్రికాను స్వల్ప స్కోరుకే కట్టడి చేశారు. ఆ తరువాత  ఛేదనలొ భారత్ మూడు వికెట్లు కోల్పోయి 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఈ ఓటమిపై  సౌతాఫ్రికా కెప్టెన్ మార్క్‌రమ్ మాట్లాడుతూ..  బ్యాటింగ్‌కు కఠినమైన పరిస్థితులు ఉన్నాయన్నాడు. భారత బౌలర్లు సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేశారు. తాము వరుసగా ఐదు వికెట్లు కోల్పో యామన్న మార్కరమ్,  భారత బౌలర్లకు కచ్చితంగా క్రెడిట్ ఇవ్వాలన్నాడు. బ్యాటింగ్ వైఫల్యమే తమ  ఓటమికి కారణమన్న మార్కరమ్..  భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదురైతే.. వాటిని ఎదుర్కో వడానికి.. తిరిగి ప్రత్యర్థులపై ఒత్తిడి తీసుకురావడానికి కావాల్సిన మార్గాలు కనుగొనాలని అభిప్రాయపడ్డాడు.   టీమ్ ఇండియా బౌలర్లు తమకు పరుగులు చేసే అవకాశమే ఇవ్వలేదనీ,  తాను ఇన్నింగ్స్‌ను చివరి వరకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించానని,  తాను ఇంకాస్త దూకుడు పెంచి 140-150 పరుగుల స్కోరు జట్టుకు అందించి ఉంటే.. మ్యాచ్ రసవత్తరంగా జరిగేదన్నాడు. డెత్ ఓవర్లలో తాను ఔటైన బంతి భారీ షాట్ కొట్టగలిగేదేనని, ఇలాంటి పరిస్థితుల్లో టార్గెట్ చేయాలనుకునే బౌలర్‌పై మాత్రమే విరుచుకుపడాలని తెలిపాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన ప్రొటీస్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లకు 117 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్ల ధాటికి సఫారీల బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. ఛేదనకు దిగిన టీమిండియా 15.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. దీంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1తో ముందంజలో ఉంది.

ఏ టేల్ ఆఫ్ టూ స్టేట్స్ పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు

ప్రముఖ జర్నలిస్టు ఐ.వెంకట్రావు రాసిన ఏ టేల్ ఆఫ్ టూ స్టేట్స్  పుస్తకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆదివారం (డసెంబర్ 14) ఆవిష్కరించారు. ఇదే పుస్తకాన్ని 'విలీనం -విభజన' పేరిట ఎన్.అనురాధ తెలుగులోకి  అనువదించారు.  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విలీనం, విభజన  అంశాలతో పాటు రెండు రాష్ట్రాలకు చెందిన  22 మంది ముఖ్యమంత్రుల పాలనా కాలాన్ని కూడా ఈ పుస్తకంలో ప్రస్తావించారు. పరిశోధకులకు, భవిష్యత్ తరాలకు ఈ పుస్తకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా పేర్కొన్నారు. అలాగే ఏ టేల్ ఆఫ్ టూ స్టేట్స్ ను తెలుగులోని విలీనం- విభజన పేరిట అనువదించిన అనూరాధను అభినందించారు.  

కరీంనగర్ లో పునుగుపిల్లి

తిరుమల శేషాచలం కొండల్లో ఎక్కువగా కనిపించే అరుదైన పునుగుపిల్లి తెలంగాణలోని కరీంనగర్ లో దర్శనమిచ్చింది. సాధారణంగా దట్టమైన అడవుల్లో మాత్రమే కనిపించే ఈ అరుదైన క్షీరజం మైదాన ప్రాంతంలో కనిపించడం విస్మయం గొలిపింది. కరీంనగర్ లోని హిందుపురి కాలనీలో ఆదివారం (డిసెంబర్ 14) ఓ వ్యక్తి ఇంట్లో పునుగుపల్లి కనిపించింది. వెంటనే ఆ ఇంటి యజమాని అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అటవీశాఖ సిబ్బంది అక్కడకు చేరుకుని ఈ పునుగుపిల్లిని క్షేమంగా పట్టుకుని డీర్ పార్క్ కు తరలించి వైద్యం అందించారు. అది పూర్తిగా కోలుకున్న తరువాత  దానిని అటవీ ప్రాంతంలో విడిచి పెట్టనున్నారు.  ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల శేషాచలం కొండల్లో మాత్రమే అధికంగా కనిపించే పునుగుపిల్లి   తైలాన్ని తిరుమల శ్రీవారి అభిషేక సేవలో ఉపయోగిస్తారు.  అలాగే ఈ పునుగు పిల్లి విసర్జన నుంచి సేకరించిన గింజలతో తయారుచేసే  కోపి లువాక్' కాఫీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా ప్రసిద్ధి చెందింది.