ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా?
posted on May 5, 2021 @ 1:17PM
మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఈటలకు మద్దతుగా విపక్ష నేతలు కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు. తన అవినీతికి సహకరించడం లేదనే తొలగించారని ఆరోపిస్తున్నారు. అవినీతి ఆరోపణలు ఉన్న ఇతర మంత్రులనుతొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. రాజేందర్ కు మద్దతుగా బీసీ సంఘాలు రోడ్డెక్కుతున్నాయి. ఈటలను పదవి నుంచి అవమానకరంగా తొలగించారంటూ కేసీఆర్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నాయి.
తనపై వస్తున్న భూకబ్జా ఆరోపణలు, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంపై సీరియస్ గానే స్పందిస్తున్నారు ఈటల రాజేందర్. మూడు రోజులుగా హుజురాబాద్ లో ఉన్న ఈటన తన అనుచరులు, బీసీ సంఘాలు, కలిసి వచ్చే నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హాట్ కామెంట్స్ చేస్తున్నారు రాజేందర్. కేసీఆర్ ను టార్గెట్ పక్కా ప్లాన్ ప్రకారమే తనపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేసులు, అరెస్టులకు భయపడేది లేదన్న ఈటల.. టీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే పదవి తనకు అవసరం లేదని చెప్పారు. తన నియోజకవర్గ ప్రజలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. ఎమ్మెల్యే పదవికి రాజేందర్ రాజీనామా చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
అయితే తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారిన మాజీ మంత్రి ఈటల వివాదంలో మరో కొత్త నినాదం తెరపైకి వచ్చింది. గజ్వేల్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ కూడా రాజీనామా చేయాలని ఈటల మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఇటు హుజురాబాద్‌లో ఈటల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని తెలిపారు. ఇద్దరూ కలిసి పోటీ చేస్తే అసలు ఓనర్ ఎవరో తెలుస్తుందని... ఎవరు గెలిస్తే వారే నిజమైన ఓనర్లని అన్నారు. ఉద్యమంలో కేసీఆర్, ఈటల ఇద్దరిదీ ఒకే స్థాయి అని చెప్పుకొచ్చారు. కాగా తమ నేతపై మంత్రులు చేసిన వ్యాఖ్యలపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఈటలకు లేదని మద్దతుదారులు స్పష్టం చేశారు. దీంతో ఈటల అనుచరుల డిమాండ్ ప్రకారం గజ్వేల్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేస్తారా అన్నది ఆసక్తిగా మారింది.
ఉద్యమ సమయంలో చాలా సార్లు కేసీఆర్ రాజీనామా చేశారు. విపక్షాల సవాల్ చేసిన వెంటనే స్పందించి తన పదవికి రాజీనామా చేసి.. ఉప ఎన్నికల్లో మళ్లీ గెలిచారు. ఈ నేపథ్యంలో ఈటల వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణలు, ఈటల అనుచరుల డిమాండ్ మేరకు కేసీఆర్ .. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అన్న దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.