గాంధీ హాస్పిటల్ కు సీఎం కేసీఆర్..
posted on May 19, 2021 @ 11:55AM
తెలంగాణలో కొవిడ్ హాస్పిటల్ గా ఉన్న గాంధీకి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లనున్నారు. అక్కడి పరిస్థితులను ఆయన స్వయంగా పర్యవేక్షించనున్నారు. రోగులకు అందిస్తున్న చికిత్స, మందుల అందుబాటు, ఆక్సిజన్ సరఫరాపై గాంధీ హాస్పిటల్ అధికారులతో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ ను తొలగించిన తర్వాత ఖాళీ అయిన వైద్యారోగ్య శాఖ బాధ్యతలను ప్రస్తుతం సీఎం కేసీఆరే చూస్తున్నారు. వైద్య శాఖను చూస్తున్న కేసీఆర్ తొలిసారిగా గాంధీకి వెళ్తున్నారు.
ఇప్పటి వరకు సీఎంగా కేసీఆర్ గాంధీ వైపే వెళ్లలేదు. ప్రస్తుతం గాంధీలో ఆక్సిజన్, వెంటిలేటర్ల సమస్య ఉండటం, కరోనా ఆస్పత్రిగా మార్చిన అనంతరం సౌకర్యాలు లేవంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన టూర్ ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ నాలుగైదుసార్లు గాంధీకి వెళ్లారు. వాస్తవానికి గాంధీలో చికిత్సలపై ఇటీవల సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో గాంధీలో ట్రీట్మెంట్కు చేరాలంటూ సెటైర్లు వేశాయి ప్రతిపక్షాలు.
గాంధీ హాస్పిటల్ లో కరోనా మరణాలు ఎక్కువగా ఉంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. రోగులకు కనీసం సౌకర్యాలు కల్పించడం లేదంటూ సోషల్ మీడియాలో వీడియోలతో సహా పోస్టులు పెడుతున్నారు. సిబ్బందికి, రోగులకు, రోగుల సహాయకులకు భోజనాలు కూడా పెట్టడం లేదంటూ శనివారం నుంచి కాంగ్రెస్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సీఎం కేసీఆర్… వైద్యారోగ్య శాఖ మంత్రిగా గాంధీ ఆస్పత్రి పరిశీలనకు వెళ్తున్నారు. గతంలో గవర్నర్ నరసింహన్ పలుమార్లు గాంధీని పరిశీలించారు. కానీ పరిస్థితులేమీ మారలేదు. ఆ తర్వాత గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గాంధీపై పలుమార్లు వివరాలు తీసుకున్నా స్వయంగా వెళ్లి పరిశీలించలేదు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ వెళ్తుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.