తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని మోదీ భేటీలో కీలక అంశాలపై చర్చ...
posted on Oct 5, 2019 @ 10:59AM
ప్రధాని మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం ప్రాజెక్టులకు నిధుల సాధన అంశాలకు మోదీ వద్ద కేసీఆర్ ప్రస్తావించారు. ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం కేసీఆర్ సాయంత్రం నాలుగున్నర గంటలకు సమావేశం మొదలైంది. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం ప్రధాన ఎజెండాగా ఈ సమావేశంలో ఉన్నట్టు సమాచారం. గోదావరి జలాలను కృష్ణాకు తరలించాలనే ఉద్దేశంతో ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి, కె.సి.ఆర్ మద్య రెండు సార్లు చర్చలు జరిగాయి.
పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి డ్యాం సేఫ్టీ బిల్, నదీ జలాల యాజమాన్యం బిల్లులు రెండూ వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదం పొందే అవకాశముంది. ఈ రెండు బిల్లులు ఆమోదం పొందినట్లయితే మొత్తం నదీ జలాలతో పాటు దేశంలో ఉన్నటువంటి ఆనకట్టలన్నీ కూడా కేంద్రం పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్రాలు నిర్ణయం తీసుకునే అవకాశం లేకుండా పోయే అవకాశం ఉంటుంది. అందుకే మోదీ సహకారంతో ఈ కృష్ణా, గోదావరి జలాల అనుసంధానానికి నిర్ణయం తీసుకోవాల్సుంటుంది.
ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అరవై, డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యే అవకాశముంది కాబట్టి కేంద్రం కొంత సహకరిస్తే మేలు జరుగుతుందని మోదీకి కేసీఆర్ వివరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై కూడా కొన్ని ప్రస్తావనకు తీసుకురాబోతున్నారు. ఇటీవల తెలంగాణలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు, వాటిపై రాష్ట్రపతి ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. వాటి ప్రస్థావన కుడా ప్రధాని దృష్టికి తీసుకువెళ్ళే అవకాశముంది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ ను కుదించడం జరిగింది, ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కొంత ఆర్థిక సహాయం చేయాలి అన్న అభిప్రాయాన్ని మోదీ ముందు ఉంచబోతున్నారు.