Read more!

ఢిల్లీలో కేసీఆర్ రహస్య ఎజెండా? ఆయనను రహస్యంగా కలిసిందెవరు? 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన రాజకీయ, మీడియా వర్గాల్లో ఆసక్తిని రేకేతిస్తోంది. సెప్టెంబర్ 1 తేదీన ఢిల్లీ వెళ్ళిన కేసీఆర్, 2వ తేదీన దేశ రాజధానిలో నిర్మిస్తున్న టీఆర్ఎస్ కార్యాలయ భవన నిర్మాణ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. హరీష్ రావు మినహా ముఖ్యనేతలు.మంత్రులు భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొబ్బరికాయలు కొట్టారు. తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సుమారు 50 నిముషాలకు పైగా సమావేశమయ్యారు. మూడవ రోజు సెప్టెంబర్ 3వ తేదీన  కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో సమావేశ మయ్యారు. 

నిజానికి ముఖ్యమంత్రి భూమి పూజ జరిగిన తర్వాత రాష్ట్రానికి తిరిగి రావలసి ఉంది, కానీ,రాలేదు.ఆయన తమ ఢిల్లీ యాత్రను మరి కొన్నిపొడిగించుకున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ( సోమవారం)కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షేకావత్‌తో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు సమర్పించి హామీలు పుచ్చుకున్నారు. హైదరాబాద్ – విజయవాడ రోడ్డును ఆరులైన్ల రోడ్డుగా విస్తరించడంతో పాటుగా  రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి సంబదించి ఐదు విజ్ఞాపన పత్రాలను కేంద్ర మంత్రికి సమర్పించారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయిస్తామని గడ్కరీ, హామీ ఇచ్చారని, అధికారవర్గాలు తెలిపారు.  అలాగే, కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్‌ పై కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షేకావత్‌తో సుమారు 40 నిముషాలకు పైగా చర్చించారు. ఈ సందర్భంగా గెజిట్‌పై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూనే గెజిట్’ లోని అంశాల అమలుకు పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.కృష్ణా ట్రైబ్యునల్‌ ఏర్పాటుపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆవిధంగా, కేంద్రంతో తమకు ఎలాంటి విబేధాలు లేవనే చక్కటి స్నేహ సంకేతాలు పంపించారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన కేవలం పార్టీ కార్యాలయ భూమిపుజలో పాల్గొనడం, ప్రదాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా ఇతర కేంద్ర మంత్రులను కలవటమేనా లేక ఇందులో ఇంకేదైనా రాజకీయ రహస్య కోణం దాగి ఉందా అంటే, ఉందనే అంటున్నారు, రాజకీయ పండితులు. దేశ రాజదానిలో పార్టీ కార్యాలయం భూమిపూజతో పాటుగా కేసీఆర్, భవిష్యత్ రాజకీయ వ్యూహాలకు అంకురార్పణ కూడా కానిచ్చారని. అంటున్నారు. నిజానికి, ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ప్రధాన లక్ష్యం, భూమిపూజ,మంత్రులతో భేటీలు కాదని, జాతీయ రాజకీయాల్లో తమకంటూ ఒక భూమికను ఏర్పరచుకునే లక్ష్యంతోనే, ఆయన ఢిల్లీలో కాలు పెట్టారని అంటున్నారు. ప్రధాని మోడీ, అమిత్ షా సహా ఇతర కేంద్ర మంత్రులను బహిరంగంగా కలిసిన కేసీఆర్, ఇంకెవరినీ కలవ లేదా? అంటే కలిశారు. కాంగ్రెస్, కాంగ్రెస్ రెబెల్ (జీ23), నాయకులతో పాటుగా అందుబాటులో ఉన్న బీజేపీయేతర జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకులుతో ముఖ్యమంత్రి కలిసి రాజకీయ చర్చలు జరిపారని, ప్రతిపక్ష పార్టీల ఐక్యత గురించి, వివిధ కోణాల్లో చర్చించారని  విశ్వసనీయ వర్గాల సమాచారం.

ముఖ్యంగా, ముఖ్యమంత్రి జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యాన్మాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే, పాత ఆలోచనను కొత్త రూపంలో ముందుకు తీసుకుపోయేందుకు ఢిల్లీ పర్యటనను ఉపయోగించుకున్నారని సన్నిహిత వర్గాల సమాచారం. కేంద్రంలో మరో మారు బీజేపీ అధికారంలోకి వస్తే, ప్రాంతీయ పార్టీల మనుగడ మరింత ప్రశ్నార్ధకం అవుతుందని, ప్రాంతీయ పార్టీల నాయకులకు సవివరంగా వివరించి, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ఆవశ్యకతను నొక్కి చెప్పినట్లు సమాచారం.నిజానికి కేసీఆర్ జాతీయ స్థాయిలో బీజేపీతో సన్నిహితంగా మెలిగినట్లు కనిపించినా, అది కేవలం అవసరార్ధం బ్రాహ్మణార్ధం తంతు మాత్రమే అంటున్నారు. ఈ విషయం బీజేపీ నాయకులకు కూడా తెలుసు. అయితే నువ్వొకందుకు పోస్తే నేనొకందుకు తాగుతున్నాను అన్నట్లుగా, రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయి. బీజేపీ వ్యతిరేక శక్తులను ముఖ్యంగా ప్రాతీయ పార్టీలను ఏకం చేసి, ఫెడరల్ ఏర్పాటు చేయాలనేదే కేసీఆర్ ఢిల్లీ పర్యటన లక్ష్య్యంగా పరిశీలకులు భావిస్తున్నారు. 

అంతే కాదు. ఇటు పార్టీని, అటు కుటుంబ వారసత్వాన్ని నిలుపుకోవాలంటే, కేసీఅర్ ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీ చేయక తప్పని అనివార్య పరిస్థితిని ఎదుర్కుంటున్నారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా, 2023 ఎన్నికల తర్వాత అధికార మార్పిడి అనివార్యంగా కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో ఢిల్లీలో తనకో కుర్చీ అవసరం, ఆ కోణంలో కూడా ముఖ్యమంత్రి జాతీయ రాజకీయాలపై కన్నేశారని, అందులో భాగంగానే ఢిల్లీ యాత్రను చూడాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.