ప్రభుత్వ కార్యక్రమంలో ఎన్నికల ప్రచారమా! కేసీఆర్ పై విపక్షాల ఫైర్
posted on Oct 31, 2020 @ 10:05PM
తెలంగాణ ముఖ్యమంత్రికి చట్టాలు వర్తించవా? కేసీఆర్ ఏది చేసినా నడుస్తుందా? ఎన్నికల కోడ్ ను ఆయన పట్టించుకోరా?. తెలంగాణలోని విపక్షాలు ఇప్పుడు ఇవే ఆరోపణలు చేస్తున్నాయి. జనగామ జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతు వేదికను ప్రారంభించి ప్రసంగించారు. ఇంతవరకు బాగానే ఉన్న ఆ సభలో ఆయన దుబ్బాక ఉప ఎన్నికపై మాట్లాడటం ఇప్పుడు వివాదామవుతోంది. ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి హోదాలో పాల్గొంటూ ఉప ఎన్నికపై మాట్లాడటాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. ఎన్నికల చట్టాలను ముఖ్యమంత్రి గౌరవించకపోవడం దారుణమంటూ ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో ఫైరవుతున్నారు.
మూడు రోజుల్లో దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక జరగనుంది. ఉప ఎన్నిక ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం దుబ్బాకలో రాజకయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. అధికార పార్టీకి గెలుపు కష్టమనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. టీఆర్ఎస్ ఎదురీదుతుందని చర్చ జరుగుతున్నా సీఎం కేసీఆర్ దుబ్బాక ఉప ఎన్నికపై ఎక్కడా స్పందించలేదు. అయితే ప్రచారం మరికొన్ని గంటల్లో ముగుస్తుందనగా మాత్రం ఆయన స్పందించారు. కేసీఆర్ దుబ్బాక ఉపఎన్నికపై మాట్లాడటంలో తప్పు లేదు కాని.. ప్రభుత్వ కార్యక్రమాన్ని అందుకు వేదికగా చేసుకోవడమే విపక్షాల ఆరోపణలకు కారణమవుతోంది.
జనగామ జిల్లాలో జరిగిన సభలో మాట్లాడిన కేసీఆర్ .. దుబ్బాకలో విపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. బీజేపీని ఆయన ఎక్కువగా టార్గెట్ చేశారు. ప్రభుత్వం ఇస్తున్న అసరా పెన్షన్లలో కేంద్రంపై ఎక్కువ డబ్బులు ఇస్తుందని ప్రజలకు కమలం నేతలు అబద్దాలు చెబుతున్నారని ఫైరయయ్యారు. రాష్ట్రంలో 38 లక్షల మందికి 2 వేల రూపాయల పెన్షన్ ఇస్తుంటే.. అందులో కేవలం 7 లక్షల మందికి మాత్రమే అది కూడా కేవలం 2 వందల రూపాయలు మాత్రమే కేంద్రం ఇస్తుందని చెప్పారు. బీజేపీ నేతలు చెబుతున్నట్లు పెన్షన్ కోసం కేంద్రమే ఎక్కువ నిధులు ఇస్తున్నట్లు నిరూపిస్తే నిమిషంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు కేసీఆర్. పెన్షన్ విషయంలో బీజేపీ నేతల ప్రచారంపై కేసీఆర్ స్పందించడం బాగానే ఉన్నా అందుకు ప్రెస్ మీట్ పెడితే సరిపోతుందని, ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో మాట్లాడటం ఎందుకనే విమర్శలు వస్తున్నాయి.
మరోవైపు దుబ్బాకలో రోజురోజుకు టీఆర్ఎస్ పరిస్థితి దిగజారిపోతుందని, ఇంటలిజెన్స్ తాజా సర్వేలో మరింత షాకింగ్ విషయాలు తెలిశాయని బీజేపీ నేతలు అంటున్నారు. అందుకే జనగామ సభలో దుబ్బాక గురించి మాట్లాడారని, మనమే గెలుస్తున్నామంటూ చెబుతూ నిరాశలో ఉన్న కేడర్ లో జోష్ నింపే ప్రయత్నం చేశారంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమంలో దుబ్బాక ఉప ఎన్నికపై మాట్లాడటాన్ని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామంటున్నారు బీజేపీ నేతలు. పెన్షన్ డబ్బుల్లో కేంద్రం వాటా ఉందన్న విషయాన్ని మాత్రమే తాము ప్రజలకు చెబుతున్నామని, ఓటమి భయంతోనే కేసీఆర్ తమపై అబాండాలు వేస్తున్నారని విమర్శిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తర్వాత కేసీఆరే రాజీనామా చేయాల్సి వస్తుందేమోనని బీజేపీ నేతలు జోస్యం చెబుతున్నారు.