హిట్లర్, ఇందిర బాటలో జగన్..! నియంతలకు మించి ఉక్కుపాదం!
posted on Aug 28, 2021 @ 1:38PM
ఆంధ్ర ప్రదేశ్’లో పత్రికా స్వేచ్చ ఉన్నట్లే ఉంటుంది కానీ, ఉండదు. అదొక ఎండమావి. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పత్రికా స్వేచ్చ అన్న మాట వినడం కూడా ఇష్టం ఉండదో ఏమో, ఆయన ఏకంగా మీడియాపై యుద్దమే ప్రకటించారు. యుద్దానికి సిద్దం కండని అధికారాలకు పిలుపు నిచ్చారు. జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం అంతా ఒక్కటై పత్రికల మీద యుద్ధం చేయాలని కల్లెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. “ మీరు యుద్దం చేయవలసింది రాజకీయ పార్టీలు , నాయకు మీద కాదు, పత్రికల మీద, కత్తులు తీయండి” అంటూ పిలుపు నిచ్చారు. ముఖ్యంగా జిల్లా కల్లెక్టర్లు, ఎస్పీలు ప్రత్యేకంగా మీడియాపై యుద్దానికి సిద్ధంకావాలని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పిలుపు నిచ్చారు.
ఆలస్యంగా వెలుగు చూసిన కల్లెక్టర్స్ కాన్ఫరెన్స్’లో ఆయన ప్రసంగం వీడియో వింటే, రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు, ఘోరాలకు పత్రికలు, మీడియా అది కూడా.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 కారణమనే భావనలో ముఖ్యమంత్రి ఉన్నారనిపిస్తుంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, ఏ విధంగా అయితే, అయిన దానికి కాని దానికి, ఆ రెండు పత్రికలు అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతిని టార్గెట్ చేశారో, ఆయన అడుగు జాడల్లో, అదే అరాచక మార్గంలో నడుస్తున్న అయన కుమారుడు, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కూడా అవే పలుకులు పలుకుతున్నారు. అయితే, వైఎస్ ఎప్పుడు ఇలా బొమికలు మెడలో వేసుకోలేదు. మీడియా మీద యుద్దానికి అధికారులను ఉసిగొల్పలేదు. అయితే, జగన్మోహన్ రెడ్డి తీరు చూస్తుంటే, ఆయన తండ్రిని మించి పోయారు అనిపిస్తుంది. నియంతలకే నియంత స్థాయికి ఎదిగారా, అన్న అనుమానం కూడా కలుగుతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
కల్లెక్టర్ల కాన్ఫరెన్స్’లో ఆయన చేసిన ప్రసంగంలో, రాష్ట్రంలో పెరిగిపోతున్ననేరాలు ఘోరాలు, ముఖ్యంగా మహిళలు, కాలేజీ అమ్మాయిలు, వృద్దులు ఒకరని కాదు, పసి కందుల మొదలు పండు ముసలి వారి వరకు అందరిపైనా సాగుతున్న లైంగిక నేరాలు, అరాచకాలు, అకృత్యాల గురింఛి మాట్లాడారు. అయితే అవన్నీ, ‘దురదృష్టకర’ సంఘటనలు అన్న చిన్నా మాటతో తేల్చేసారు. ఒక విధంగా ఎలాంటి ఘటనల పట్ల ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ఎలాంటి చింతా లేదన్నట్లుగా మాట్లాడారు. బహుశా ముఖ్యమంత్రి దృష్టిలో ఇవేవీ నేరాలు కాదో ఏమో, అందుకే ఆయన నేరాలాను చిన్నగా చేసి చూపించే ప్రయత్నం. అమ్మాయిలతో నడి రోడ్డు మీద అసభ్యంగా ప్రవర్తించడం ఈవ్ టీజింగ్, నేరం కాదనే చక్కని సందేశాన్ని కూడా ముఖ్యమంత్రి ఇచ్చారు. మరో వంక నేరస్తులను వదిలేసి, జరుగుతున్న వాస్తవాలను జనంలోకి తీసుకుపోతున్న మీడియాపై మండిపడుతున్నారు.
కల్లెక్టర్ల కాన్ఫరెన్స్’లో ముఖ్యమంత్రి, “రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఎంతగా అప్రమత్తంగా ఉన్నా, కొన్ని దురదృష్టకర సంఘటనలు జరుగుతున్నాయి, అధికార, పోలీసు యంత్రాంగం మంచిగా స్పందిస్తోంది, అయినా స్వార్ధపర శక్తులు వ్యతిరేక ప్రచారం సాగిస్తున్నాయి. బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఆడపిల్లల కుటుంబాల గౌరవానికి నష్టం జరుగుతుందని తెలిసినా రాజకీయం చేసే ప్రయత్నం జరుగుతోంది. ఒక ఈవ్ టీజింగ్ లాంటి కేసులో, పోలీసు కానిస్టేబుల్’ను సస్పెండ్ చేసినా, సోషల్ మీడియా, పత్రికలు, టీవీలలో ఆ కుటుంబ గౌరవాన్ని బజారున పడేసే విధంగా ప్రచారం జరుగుతోంది. కాబట్టి, మనం ముఖ్యంగా కల్లెక్టర్లు, ఎస్పీలు జిల్లాలో జరుగతున్న సంఘటల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండవల్సినవసరం వుంది” అంటూ చక్కటి సందేశం ఇచ్చారు. అయినా, అందులో అపశ్రుతులు, అసత్యాలు ఉన్నా, అధికారులను అప్రమత్తం చేయడం వరకు కొంత బాగుందని అనుకావచ్చును. ఆ తర్వాత అయన నోటి నుంచి జాలువారిన అక్షర ముత్యాలు నియంత నిజరూపాన్ని చూపించింది. హిట్లరు నుంచి ఇందిరా గాంధీ వరకు నియంతలు ఎవరికీ పత్రికా స్వేచ్చ అంటే అసలు రుచించదు. ఇప్పడు ఆ జాబితాలో జగన్ రెడ్డి కూడా చేరారు.
పత్రికా స్వేచ్చ పట్ల ఆయనకు అంతటి వ్యతిరేకత ఎందుకో ఏమో కానీ, ప్రభుత్వ యంత్రాంగం, ముఖ్యంగా కల్లెక్టర్లు, ఎస్పీలు మీడియా మీద యుద్ధం చేయాలని పిలుపు నిచ్చారు. “మీరు యుద్ధం చేయవలసింది, రాజకీయ పార్టీలు, నాయకుల మీద కాదు, తమకు నచ్చిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసేందుకు అన్నిటికీ తెగించిన మీడియాలోని ఒక వర్గం మీద, ఈనాడు, ఆంధ్ర జ్యోతి, టీవీ 5 మీద యుద్దం చేయండి” అని పిలుపు నిచ్చారు.
అయితే, జగన్ రెడ్డి గమనించవలసిన విషయం ఏమంటే, పత్రికా స్వేచ్ఛను చంపే ప్రయత్నం చేసిన, మహా నాయకులు, మహా నియంతలే మట్టి కరిచి పోయారు. పత్రికా స్వేచ్ఛను హతమార్చడం ఎవరికీ అయ్యే పనికాదని చరిత్ర చెపుతోంది. అందుకు జగన్ రెడ్డి మినహాయింపు కాదు. నిజానికి, జగన్ రెడ్డి పాలనలో వైట్ కాలర్ (ఆర్థిక) నేరాలు మొదలు, మర్డర్లు, మాన భంగాల వరకు అన్నీ రకాల నేరాలు పెరిగి పోయాయి. ముఖ్యమంత్రి సొంత బాబాయ్ మర్దరై పోయారు. ఏళ్ళు గడుస్తున్నాయి కానీ, హంతకులు ఎవరో తేలడం లేదు. సో.. ముఖ్యమంత్రి, ప్రభుత్వ యంత్రాంగం యుద్ధం చేయవలసింది, మీడియా మీద కాదు, అధికార పార్టీ అండ చూసుకుని చెలరేగిపోతున్న నేరస్థుల మీద..అంటున్నారు సామాన్యులు. వింటున్నారా ..