ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం దీపావళి కానుక

 

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళి కానుకగా ఉద్యోగులకు ఒక డీఏ ఇవ్వాలని నిర్ణయించామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రులతో ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. నవంబర్ 1 నుంచి డీఏ జమ చేస్తామని ఇందుకు నెలకు రూ.160 కోట్లు ఖర్చు అవుతాయని తెలిపారు. ఆర్థిక పరిస్థితుల వల్ల ఇబ్బందులు ఉన్నా డీఏ ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. 

పోలీసులకు ఈఎల్‌.. ఒక ఇన్‌స్టాల్‌ మెంట్‌ రూ.105 కోట్లు ఇస్తాం. మరో రూ.105 కోట్లు జనవరిలో ఇస్తాం. 60 రోజుల్లోపు ఉద్యోగుల హెల్త్‌కు సంబంధించిన వ్యవస్థను స్ట్రీమ్‌లైన్‌ చేస్తాం. ఆర్టీసీ ఉద్యోగులకు ఒక ప్రమోషన్‌ పెండింగ్‌లో ఉందని సీఎం పేర్కొన్నారు .సీపీఎస్‌ అంశంపై చర్చించి పరిష్కరిస్తామని తెలిపారు. 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ రిటైర్మెంట్ వరకు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. చైల్డ్ కేర్ లీవ్స్ వినియోగంలో వయోపరిమితి లేదని స్ఫష్టం చేశారు. ఉద్యోగ సంఘాల భవనాలకు చెందిన ప్రాపర్టీ టాక్స్ మాఫీ చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు
 

సర్పంచ్‌ల ప్రమాణ స్వీకారోత్సవంలో రభస

  నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ల ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా డీజేలో పెట్టిన పాటకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా  చెన్నారావుపేట గ్రామపంచాయతీలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ బలపరచిన కంది శ్వేత కృష్ణచైతన్య రెడ్డి ఎన్నికైంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్ధి ఉప సర్పంచ్ బొంత శ్రీనివాస్ ఎన్నికయ్యారు.  ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు డీజేలో పాట పెట్టారు. ఇంతలో కాంగ్రెస్ కార్యకర్త అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాట మాట పెరిగి కుర్చీలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో కాంగ్రెస్ కార్యకర్త వనపర్తి శోభన్ తలకు గాయమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలను పంపించారు. అనంతరం చెన్నారావుపేట ఎంపీడీవో వెంకట శివానంద్ సర్పంచ్ మిగతా వార్డుల సభ్యులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించి ప్రమాణ చేయించారు.

ఢిల్లీ హైకోర్టులో పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్లపై విచారణ

  సామాజిక మాధ్యమాల్లో తమ ఫోటోలు, వీడియోలను అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాలకు ఉపయో గిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ నటులు పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ దాఖలు చేసిన వ్యక్తిత్వ హక్కుల పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్లను జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా ధర్మాసనం విచారించింది. సోషల్ మీడియా వేదికలపై తమ చిత్రాలు, వీడియోలను మార్ఫింగ్ చేసి అవమా నకరమైన పోస్టులు పెడుతు న్నారని, వాటి ద్వారా తమ ప్రతిష్ఠకు భంగం కలుగు తోందని పిటిషన్లలో పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు.  ఈ విధమైన చర్యలు తమ వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘిస్తు న్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈపిటిషన్లపై పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ తన వాదనలు కోర్టు కు వినిపించారు. తప్పుడు వార్తలు, మార్ఫింగ్ చేసిన ఫోటోలు, అవమానకరమైన వీడియోలతో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోందని ఆయన కోర్టుకు వివరించారు.ఈ వ్యవహారంలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఎక్స్ (ట్విట్టర్), గూగుల్ సంస్థ లను ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై స్పందించిన ప్రతివాదులు ఇప్పటికే కొన్ని వివాదాస్పద లింకులను తొలగించామని కోర్టుకు తెలిపారు.  అయితే, తొలగించబడిన లింకులపై తుది ఆదేశాలు జారీ చేసే ముందు సంబంధిత లింకులను వినియోగించిన ఖాతాదారుల వాదనలు కూడా వినాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోర్టు అభిప్రాయపడింది. అభిమానుల ఖాతాల నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టుల విషయంలో ప్రత్యేకంగా స్పష్టమైన నిరాకరణ (డిస్‌క్లైమర్) ఉండాలని కోర్టు సూచిం చింది.ఈ అంశంపై గూగుల్ సంస్థ తమ ఖాతాదారులకు స్పష్టమైన సమాచారం ఇవ్వాలని, అవసరమైతే సంబంధిత ఖాతాలను నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అలాగే, వివాదాస్పద పోస్టులకు సంబంధించిన ఐపీ లాగిన్ వివరాలను మూడు వారాల లోపు కోర్టుకు సమ ర్పించాలని ప్రతివాదులకు సూచించింది. వాదప్రతివాదనలు పూర్తి అయినా తరువాత కోర్టు తదుపరి విచారణను మే 12కు వాయిదా వేసింది.

అమరావతిలో "ఆవకాయ్" ఉత్సవాలు : మంత్రి కందుల

  అమరావతిలో జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ్ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి కందుల దుర్గేశ్ ప్రకటించారు. ఈ వేడుకల్లో తెలుగు సినిమా సాహిత్యం, కవిత్వం, సంగీతం, నృత్యం వంటి కార్యక్రమాలు జరగనున్నాయి. పున్నమి ఘాట్, ద్వీపంలో ఈ ఉత్సవ ఏర్పాట్లు చేయునున్నట్టు తెలిపారు. అంతేకాకుండా వచ్చే ఉగాది నంది అవార్డులు, నంది నాటకోత్సవాలను నిర్వహించాలని ఆలోచిస్తున్నట్టు మంత్రి తెలిపారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఏపీలో షూటింగ్‌ చేసుకునే సినిమాలకు మరింత ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు.  అలాగే ఉగాది నాటికి నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని, దీనికి సీఎం చంద్రబాబు కూడా సానుకూలంగా ఉన్నారని మంత్రి కందుల దుర్గేష్‌ తెలిపారు. టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలో  ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించనుందని  మూవీ టికెట్‌ రేట్లు, ఏపీలో షూటింగ్‌ చేసే సినిమాలు, హై బడ్జెట్‌ చిత్రాల టికెట్‌ ధరలపై చర్చించనున్నారు. అధికారుల సమావేశం అనంతరం సినీ ప్రముఖులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని, దానికి సంబంధించిన తేదీలను త్వరలో వెల్లడిస్తామని మంత్రి తెలిపారు.  

ఐపీఎస్ అధికారి అమ్మిరెడ్డికి నోటీసులు

  ఐపీఎస్ అధికారి అమ్మిరెడ్డికి ఏపీ శాసనమండలి ప్రివిలేజ్ నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర విద్యా, ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌కు కించపరిచే విధంగా ట్వీట్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నోటీసులు పంపినట్లు మండలి వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నేపధ్యంలో మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు సమావేశం కానున్న హక్కుల కమీటి ముందు హాజరు కావాలని ఆదేశించింది.  అమ్మిరెడ్డి ఇచ్చే సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనుంది. గతంలో అమ్మిరెడ్డి గుంటూరు అర్బన్ ఎస్పీగా విధులు నిర్వర్తించిన సమయంలో ఈ వివాదాస్పద ట్వీట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై అందిన ఫిర్యాదును పరిశీలించిన శాసనమండలి, ఈ అంశాన్ని హక్కుల కమిటీకి (ప్రివిలేజెస్ కమిటీ) నివేదించింది.

సోనియా, రాహుల్‌కు హైకోర్టు నోటీసులు

  నేషనల్ హెరాల్డ్ కేసులో  కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసుకు అనుమతి ఇవ్వాలంటూ ఈడీ దాఖలు చేసుకున్న అప్పీల్‌ఫై సమాధానం ఇవ్వాలని సోనియా, రాహుల్ గాంధీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణన జనవరికి వాయిదా వేసింది. కాగా నేషనల్ హెరాల్డ్  మనీలాండరింగ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు ఇతరులపై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ ను ఇటీవల రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది.  ప్రైవేటు వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పీఎంఎల్‌ఏ కింద చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని కోర్టు అభిప్రాయపడింది. అదేవిధంగా కేసులో వేసిన ఛార్జ్‌షీటు కూడా చట్టపరంగా నిలవదని డిసెంబర్ 16న న్యాయమూర్తి ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఈడీ అధికారులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. 

మేడ్చల్ లో విద్యార్థి మిస్సింగ్.. బతికున్నాడా లేదా అంటూ తల్లిదండ్రుల ఆందోళన

మేడ్చల్ లోని ఓ రెసిడెన్షియల్ స్కూల్ లో విద్యార్థి మిస్సింగ్ ఘటన కలకలం రేపుతోంది.  ఆ స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతున్న కార్తీక్ అనే 14 ఏళ్ల విద్యార్థి గత కొన్ని రోజులుగా కనిపించడం లేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినా అతడి ఆచూకీ గత ఎనిమిది రోజులుగా లభించకపోవడంతో ఆ విద్యార్థి తల్లి దండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   ఈ నేప థ్యంలో కుటుంబ సభ్యులు స్కూల్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలించినప్పటికీ బాలుడి ఆచూకీ లభించలేదు.  తమ కుమారుడి మిస్సింగ్‌కు స్కూల్ యాజమాన్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. స్కూల్ ఆవరణలో చలి మంట వేసుకున్న కారణంగా వార్డెన్ తమ కుమారుడిని చితకబాదాడని, ఆ దాడి కారణంగానే కార్తీక్ భయంతో స్కూల్ నుంచి వెళ్లిపోయి ఉంటాడనీ వారంటున్నారు. ఈ ఘటనపై స్కూల్ యాజ మాన్యం సరిగా స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. అసలింతకీ తమ కుమారుడు బతికి ఉన్నాడా? లేదా అన్న అనుమానాన్ని కూడా వారు వ్యక్తం చేస్తున్నారు.   ఇలా ఉండగా.. కార్తీక్ ఆచూకీ కోసం మేడ్చల్ పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. స్కూల్ పరిసరాలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. 

ఇండోనేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం- 15 మంది దుర్మరణం

ఇక్కడా అక్కడా అన్న తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రమాదాలు బెంబేలెత్తిస్తు న్నాయి.  రోడ్డు, రైలు విమాన అన్న తేడా లేకుండా ఈ ప్రమాదాలు పెద్ద సంఖ్యలో ప్రయాణీకుల ఉసురు తీస్తున్నాయి. సాంకేతిక సమస్య, మానవ తప్పిదం కారణమేమైతేనేం ప్రయాణం అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఇండోనేసియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మృత్యువాత పడ్డారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమౌతోంది.  ఇండోనేషియాలోని సెంట్రల్ జావా ప్రాంతంలో ని సెమరాంగ్ నగరం  టోల్ గేట్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఘోర ప్రమాదానికి గురైంది.  సోమవారం (డిసెంబర్ 22) తెల్లవారుజామున  ఈ ప్రమాదం జరిగింది. బస్సు అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది.    క్రాప్యాక్ టోల్ ఎగ్జిట్ కూడలి వద్దకు రాగానే బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి డివైడర్‌ని బలంగా ఢీకొని పల్టీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు బస్సు అద్దాలు పగిలి, డోర్లు మూసుకుపోయాయి. దీంతో బస్సులోకి వెళ్లి క్షతగాత్రులను బయటకు తీసుకురావడం సమస్యగా మారింది. స్థానికుల సహకారంలో ఎలాగో బస్సు డోర్లను తెరిచి లోపలకు వెళ్లిన పోలీసులు ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో పలువురి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

అండర్ -19 ఆసియా కప్ ఫైనల్.. పాక్ చేతిలో భారత్ చిత్తు

అండర్ 19 ఆసియాకప్ టోర్నీలో ఓటమి అనేదే లేకుండా ఫైనల్ కు చేరిన టీమ్ ఇండియా జట్టు ఫైనల్ లో చతికిల పడింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఘోర ఓటమిని మూటగట్టుకుంది.  ఆదివారం (డిసెంబర్ 22)  ఏకపక్షంగా జరిగిన అండర్ -19 ఆసియా కప్ ఫైనల్ లో భారత జట్టు ఏకంగా 191 పరుగుల తేడాతో చిరకాల ప్రత్యర్థి, దాయాది జట్టు అయిన పాకిస్థాన్ చేతిలో  ఓడిపోయింది.   అండర్‌-19 ఆసియా కప్‌ టైటిల్‌ ఫైట్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన  పాకిస్థాన్ నిర్ణీత  50 ఓవర్లలో 8 వికెట్ల నష్టపోయి   347 పరుగుల భారీ స్కోరు చేసింది. పాకిస్థాన్ ఓపెనర్‌ సమీర్‌ మిన్హాస్‌  113 బంతుల్లో 172 పరుగులు చేశాడు.  అలాగే పాక్ బ్యాటర్ అహ్మద్‌ హుస్సేన్‌  56  పరుగులు సాధించాడు. భారత బౌలర్లలో  దీపేష్‌ దేవేంద్రన్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. హనిల్‌, ఖిలన్‌ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.  భారీ చేదన కోసం బ్యాటింక్ చేపట్టిన భారత్ 26. 2 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని చవి చూసింది.  భారత బ్యాటర్లలో 36 పరుగులు చేసిన దీపేష్ టాప్ స్కోరర్.  కెప్టెన్‌ ఆయుష్‌ మాత్రే (2), వైభవ్‌ సూర్యవంశీ (26) ఇలా మిగిలిన బ్యాటర్లంతా విఫలమయ్యారు.   పాక్‌ పేసర్ల షార్ట్‌ పిచ్‌ బంతులకు  భారత యువ బ్యాటర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది.  పాకిస్థాన్ బౌలర్లలో అలీ రెజా నాలుగు వికెట్ల సాధించి రాణంచాడు.  సుభాన్‌, ఎహ్‌సాన్‌, సయ్యమ్‌ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. పాక్‌ ఆటగాళ్లతో  నో హ్యాండ్‌ షేక్‌  విధానాన్ని ఈ మ్యాచ్ లో కూడా ఇండియన్ క్రికెటర్లు పాటించారు.   కాగా ఈ మ్యాచ్ లో పాక్ బౌలర్ అలీ రెజా అద్భుతంగా బౌలింగ్ చేసి రాణించినప్పటికీ, అతడి ప్రవర్తన మాత్రం అతిగా ఉంది. ధాటిగా ఆడే క్రమంలో ఔటై పెవిలియన్ కు వెడుతున్న వైభవ్ సూర్యవంశీని రెచ్చగొట్టేలా అలి రోజా సంబరాలు చేసుకున్నాడు. ఈ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ కూడా తన నోటికి పని చెప్పాడు. అలాగే అంతకు ముందు  భారత జట్టు కెప్టెన్  ఆయుష్‌ అవునప్పుడు కూడా  అలీ రెజా రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించాడు. దీంతో డగౌట్‌కు వెళ్తున్న ఆయుష్‌ ఆగ్రహంతో వెనక్కి వచ్చి నోటికి పని చెప్పాడు.  ఆసియా క్రికెట్‌ మండలి  ఏసీసీ  చీఫ్‌, పాకిస్థాన్‌ మంత్రి అయిన మొహిసిన్‌ నఖ్వీ విజేతలకు పతకాలు, ట్రోఫీ ప్రదానం చేశారు. అయితే, భారత్‌కు చెందిన ప్రతినిధులు ఎవరూ ఈ కార్యక్రమంలో కనిపించలేదు. రన్నరప్‌ చెక్‌ను అఫ్ఘానిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు చైర్మన్‌ మిర్వాసి అష్రఫ్‌ చేతుల మీదుగా భారత కెప్టెన్‌ ఆయుష్‌ అందుకొన్నాడు. కాగా, పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో.. నఖ్వీ నుంచి భారత సీనియర్‌ జట్టు ఆసియా కప్‌ను అందుకొనేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే.

ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల భారీ ఆయుధ డంప్.. గుర్తించి ధ్వంసం చేసిన భద్రతా దళాలు

ఛత్తీస్‌గఢ్ ని మావోయిస్టుల భారీ ఆయుధ డంప్ ను పోలీసులు ధ్వంసం చేశారు. రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావం అధికంగా ఉన్న సుక్మా జిల్లాలో వారికి చెందిన భారీ ఆయుధాల కర్మాగారాన్ని గుర్తించిన పోలీసులు, భద్రతా బలగాలు దానికి ధ్వంసం చేశారు. సుక్మీ జిల్లా మీనా గట్టా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు రహస్యంగా నిర్వహిస్తున్న అక్రమ ఆయుధ తయారీ కేంద్రాన్ని గురించి అందిన సమాచారం మేరకు సీఆర్పీఎఫ్, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్ లో ఈ ఆయుధ డంప్ బయటపడింది. ఈ ఆయుధ డంప్ ను మావోయిస్టులు భద్రత దళాలపై దాడికి ఉపయోగిస్తారని భద్రతా దళాలు తెలిపాయి. ఈ డంప్ ధ్వంసంతో మావోయిస్టు కార్యకలాపాలకు భారీ ఆటంకం తప్పదని తెలిపారు.   ఈ ఆయుధ డంప్ లో  ఆయుధాల తయారీ సామగ్రి, సింగిల్ షాట్ రైఫిల్స్, డిటోనేటర్లు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా బలగాలు తెలిపాయి.  భద్రతా దళా లను లక్ష్యంగా చేసుకుని ఐఈడీలు, బాంబులు తయారు చేసేందుకు అవసరమైన మందుగుండు సామాగ్రిని మావోయిస్టులు అక్కడ నిల్వ ఉంచారన్నారు. ఆ ప్రాంతంలో ఇంకా నక్సల్స్ దాక్కుని ఉండే అవకాశం ఉందన్న అనుమానంతో ఆ ప్రాంతంలో అడవులను అణువణువూ క్షుణ్ణంగా గాలిస్తున్నట్లు తెలిపిన భద్రతా బలగాలు  నిర్దిష్టగడువులోగా మావోయిస్టు రహిత దేశంగా భారత్ ఉండాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు.