సీఎం ను నిలదీసిన బాబు
posted on Nov 3, 2011 9:08AM
అనంతపురం: అనంతపురం జిల్లాలో తొలి రోజు రైతు పోరు బాట పేర పాదయాత్ర పూర్తి చేసిన అనంతరం మీడియా ప్రతినిధులతో చంద్రబాబు మాట్లాడారు."రెండు సార్లు అనంతపురం జిల్లాకు వచ్చావు.. ఏనాడైనా ఇక్కడ ఎండిపోతున్న పొలం మొఖం చూశావా'' అంటూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ఆయన నిలదీశారు. రైతుల కష్టాలు తెలుసా అని ప్రశ్నించారు. ప్రభుత్వం రైతు సమస్యలను పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన సూచించారు. కాంగ్రెస్ ఏడేళ్ల పాలనలో రాష్ట్రంలో 16వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అసమర్థ విధానాల వల్లే పెట్టుబడులు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. నాసిరకం విత్తనాలను రైతులకు అంటగడుతూ వంచిస్తున్నారన్నారు. రైతు సమస్యలపై జాతీయస్థాయి ఉద్యమానికి టీడీపీ ప్రయత్నిస్తోందన్నారు.
కాగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై సరైన సమయంలో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. కోట్లాది రూపాయల ఫోక్స్‌వ్యాగన్ కుంభకోణంలో నిందితుడైన బొత్స సత్యనారాయణకు కాంగ్రెస్ పార్టీ పదోన్నతి కల్పించిందని చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయనవల్లే ఆ ఫ్యాక్టరీ పుణెకు తరలిపోయిందని విమర్శించారు.