ముస్లింలకి పౌరసత్వం ఇవ్వబడదు.. ఏదేమైనా రాజ్యసభలో బిల్లు పాస్ చెయ్యనున్న బీజేపీ
posted on Dec 11, 2019 @ 11:11AM
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పౌరసత్వ సవరణ బిల్లును మొదటి మెట్టు ఎక్కించడంలో మోదీ సర్కార్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు రాజ్య సభలోను బిల్లు పాస్ చేయించేందుకు వ్యూహాలు రచిస్తోంది. కేవలం ముస్లిమేతర మతాలకు చెందిన వారికి మాత్రమే భారత పౌరసత్వం వచ్చేలా బిల్లును సవరించడం పై పెద్ద ఎత్తున ప్రభుత్వం పై విమర్శలు వస్తున్నాయి. అటు ఈశాన్య రాష్ట్రాలు అగ్ని గుండంలా రగులుతున్నాయి. అయినా మోదీ సర్కార్ వెనకడుగు వేయటం లేదు. ఏదేమైనా బిల్లును పాస్ చేయించేందుకు సిద్ధమైంది.
లోక్ సభలో పౌరసత్వ సవరణ బిల్లు ఓటింగ్ కు అనుకూలంగా 311 ఓట్లు పడితే వ్యతిరేకంగా 80 ఓట్లు పడ్డాయి. మరి రాజ్య సభలో బిల్లు ఆమోదం పొందాలంటే 245 మంది సభ్యులున్న సభలో 123 మంది ఎంపీల మద్దతు అవసరం. కానీ ప్రస్తుతం రాజ్య సభలో 240 మంది సభ్యులే ఉన్నారు. అంటే 121 మంది బిల్లుకు జై కొడితే పాసైనట్లే అనుకోవాలి. ఇప్పుడున్న లెక్కల ప్రకారం చూస్తే రాజ్య సభలో బిల్లు పాస్ కావడం పెద్ద వింతలా అనిపించడం లేదు. ప్రస్తుతం రాజ్య సభలో బీజేపీకి సొంతంగా 83 మంది సభ్యుల బలం ఉంది. అదే ఎన్డీఏ బలం 106 గా ఉంది. అటు కాంగ్రెస్ బలం 46 , యూపీఏ బలం 62 గా ఉంది. ఇటు ఎన్డీయే లోనూ అటు యూపిఏలోనూ లేని పార్టీల సభ్యులు మొత్తం 44 మంది ఉన్నారు. వీరంతా పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. అన్నా డీఎంకే, బీజేడీ, శివసేన, వైసిపి, టిడిపితో పాటు ఇతర పార్టీలకు చెందిన ఎంపీలు 28 మంది ఉన్నారు. వీరంతా బిల్లుకు మద్దతు పలుకుతున్నారు. ఈ లెక్క ప్రకారం చూస్తే రాజ్య సభలో 134 మంది బిల్లుకు మద్దతు పలుకుతున్నట్లే.పౌరసత్వ సవరణ బిల్లును పాస్ చేసి బిజెపి తామిచ్చిన హామిని మరొకటి నిలబెట్టుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగానే రాజ్యసభలో బిల్లుకు ఎలాంటి అడ్డంకులు కలగకుండా ప్రభుత్వం పక్కాగా అడుగులు ముందుకు వేస్తోంది. రాజ్యసభలో ఇప్పుడున్న లెక్కల ప్రకారం చూస్తే సునాయాసంగా పౌరసత్వ సవరణ బిల్లు గట్టెక్కిస్తుంది. అయితే రాజ్యసభలో తమకు 122 మంది సభ్యులు బిల్లుకు మద్దతిస్తున్నట్లు ప్రభుత్వం చెపుతోంది. నిజానికి 121 మంది సభ్యులు బిల్లుకు మద్దతు పలికితే అది పాసైనట్లే. ఇటు వైపు నుంచి చూసినా రాజ్యసభ లోనూ బీజేపీకి అంతా ఫేవర్ గానే కనిపిస్తుంది.