ఇప్పటివరకు ఒక లెక్క... ఎన్ కౌంటర్ తర్వాత మరో లెక్క... ఖైదీల్లో ఒక్కసారిగా మార్పు

దిశ నిందితుల ఎన్ కౌంటర్ తర్వాత చర్లపల్లి, చంచల్ గూడ జైళ్లలోని ఖైదీల్లో అనూహ్య మార్పు వచ్చిందంటున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఏదో ఒక గొడవ, కొట్లాటతో రభస రభస చేసే ఖైదీలు దిశ నిందితుల ఎన్ కౌంటర్ తర్వాత సైలెంట్ అయిపోయారట. నిత్యం కూర బాగోలేదనో... అన్నం బాగోలేదనో... జైలు అధికారులతో, సిబ్బందితో వాగ్వాదానికి దిగే ఖైదీలు ఇప్పుడు పెట్టింది తింటూ బుద్ధిగా ఉంటున్నారని అంటున్నారు. అధికారులు, జైలు సిబ్బంది ఏ పని చెప్పినా ఎదురు చెప్పకుండా చేస్తున్నారట. ఇప్పటివరకు ఒక లెక్క... దిశ నిందితుల ఎన్ కౌంటర్ తర్వాత మరో లెక్క అన్నట్లుగా ఖైదీల్లో ఊహించని మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. రిమాండ్ ఖైదీలు, ఘనారా నేరగాళ్లు, కరుడుగట్టిన నేరస్థుల ప్రవర్తన... దిశ నిందితుల ఎన్ కౌంటర్ కు ముందు ఒకలా ఉంటే... ఎన్ కౌంటర్ తర్వాత మరోలా ఉందంటున్నారు. మొన్నటివరకు ప్రతి చిన్న దానికీ జైలు సిబ్బందిని సతాయించడం... చెప్పిన పని చేయకుండా ఎదురు తిరగడం, తోటి ఖైదీలతో గొడవ, కొట్లాటలకు దిగేవాళ్ల ప్రవర్తన పూర్తిగా మారిపోయిందని చెబుతున్నారు. మెనూ ప్రకారం పెట్టింది తింటూ... చెప్పింది చేస్తున్నారని అంటున్నారు. ఒకవేళ ఎదురు తిరిగితే దిశ నిందితులకు పట్టిన గతే మనకూ పడుతుందని ఖైదీలు భయపడుతున్నట్లు జైలు వర్గాలు చెబుతున్నాయి.

కొంతమంది ఖైదీల ప్రవర్తనను చూస్తే ఒక్కోసారి తామే భయపడతామని, అలాంటిది ఒక్కసారిగా మార్పు రావడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు జైలు సిబ్బంది. ఖైదీల్లో అనూహ్యంగా వచ్చిన మార్పుతో జైల్లో వాతావరణం కూల్ గా మారిపోయిందని చెబుతున్నారు. ఇక, కరుడుగట్టిన నేరాలు చేసి జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలైతే... కుక్కిన పేనుల్లా ఉంటున్నారని అధికారులు అంటున్నారు. తోటి ఖైదీలను భయపెట్టడం, వారి చేత పనులు చేయించుకోవడంలాంటి పనులు మానేసినట్లు చెబుతున్నారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్... ఘరానా నేరగాళ్ల వెన్నులో వణుకు పుట్టిస్తోందని, అందుకే ఆకస్మిక మార్పు వచ్చిందని అంటున్నారు. ఏదేమైనా ఖైదీల్లో అనూహ్యంగా మార్పు రావడంతో జైలు అధికారులు, సిబ్బంది ఆశ్చర్యపోతున్నారు.
 

Teluguone gnews banner