పాయకరావుపేటలో క్రైస్తవ డేరా బాబా.. ఇవిగో లీలలు
posted on Feb 5, 2022 @ 4:57PM
ఉద్యోగంలో ఏముందీ.. నెలకింత జీతం తప్ప. ఉద్యోగానికి రాజీనామా ప్రజల బలహీనతలు సొమ్ము చేసుకునే ఉద్యమాన్ని మొదలుపెట్టి చూడు... ఎంత లాభదాయకంగా ఉంటుందో.. అనుకున్నాడో ఏమో కానీ.. ఓ పాస్టర్ తెరచాటు లీలలు బయటపడ్డాయి. భక్తి పేరిట మోసానికి గురవుతున్న అమాయక క్రైస్తవుల మనోభావాలు మాత్రం తీవ్రస్థాయిలో దెబ్బ తింటున్నాయి.
విశాఖ జిల్లా పాయకరావుపేటలోని శ్రీరంపురంలో ప్రేమదాసు అలియాస్ అంబటి అనిల్ అనే వ్యక్తి ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ పేరుతో ఓ ప్రార్ధనా మందిరం ఏర్పాటు చేశాడు. అక్కడికి వచ్చేవారికి మత భోధనలు చేస్తూనే.. యూట్యూబ్ చానల్ ద్వారా కూడా క్రైస్తవ బోధనలు చేస్తున్నాడు. గతంలో రైల్వేలో టీసీగా పనిచేసి కొంతకాలం క్రితం పాస్టర్ అవతారమెత్తాడు అనిల్. అమాయక ప్రజల నుంచి భారీగా వసూళ్లు చేస్తినట్లు తెలుస్తోంది. దేవుని రాజ్య కానుక - పేద వారికి సహాయం పేరుతో బాధితుల నుంచి దాదాపు రూ.100 కోట్ల దాకా వసూళ్లకు పాల్పడినట్లు చెబుతున్నారు.
రాజేశ్వరి అనే స్థానిక మహిళ అలియాస్ లిల్లీతో పాటు ప్రశాంత్, సంతోష్ అనే అనుచరులతో కలిసి దేవునిసేవ పేరుతో జనాల దగ్గర కోట్లలో డబ్బు వసూలు చేశారు. ఆ డబ్బుతో శ్రీరంపురంలో పెద్ద భవనాన్ని కూడా నిర్మించారు. ప్రేమస్వరూపీ మినిస్ట్రీస్ పేరిట పుస్తకాలు ముద్రించి పంచేవాడు. దేవుడి కటాక్షం కలిగిస్తానంటూ మహిళలు, యువతులను వంచించి ఆ భవనంలో బందీలుగా చేశాడు. అక్కడ వారితో వెట్టిచాకిరీ చేయించడం, లైంగికంగా వేధిస్తూ చిత్రహింసలకు గురిచేసేవాడన్న ఫిర్యాదులున్నాయి. ఓ యువతి ఇటీవల తప్పించుకొని ఆ మాయగాడిపై ఫిర్యాదు చేయడంతో ఈ ప్రేమదాసు లీలలు ప్రపంచానికి తెలిసొచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన పాయకరావుపేట పోలీసులు అతడిపై ఐపీసీ సెక్షన్ 376, 344, 354, 506, 493, 374, 312, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. అనిల్ సొంతపేరుతో లావాదేవీలు నిర్వహించేవాడు కాదని.. సంతోష్ అనే బినామీ అకౌంట్ తో అకౌంట్ ఓపెన్ చేసి నిర్వహించినట్లు పోలీసులు ధ్రువీకరించారు. బాధితులు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా కేసు తారుమారు చేసేందుకు అనిల్ యత్నించినట్లు చెబుతున్నారు. నకిలీ పాస్టర్ పై చర్యలు తీసుకొని తమకు రక్షణ కల్పించాలని బాధితులు పోలీసులకు మొరపెట్టుకున్నారు.
డేరా బాబాను తలపిస్తున్న ఈ ప్రేమదాసు లీలలు ఒక్కొక్కటిగా బయటకు రావడంతో ప్రజలంతా విస్తుపోతున్నారు.