పార్లమెంట్‌లో కరోనా కలకలం.. వైసీపీ ఎంపీలకు పాజిటివ్
posted on Sep 14, 2020 @ 11:34AM
నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. సమావేశాలకు హాజరవుతున్న సభ్యులు, సిబ్బంది అందరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన వారిని మాత్రమే పార్లమెంట్ లోకి అనుమతిస్తున్నారు.
కాగా, పార్లమెంట్ సభ్యులకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు ఎంపీలకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, అరకు ఎంపీ మాధవిలకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఎంపీ రెడ్డప్పకు ఎలాంటి లక్షణాలు లేకుండానే కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఐసోలేషన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. ఇక, గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఎంపీ మాధవి.. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో రెండు వారాల పాటు ఢిల్లీలోనే చికిత్స తీసుకోనున్నారు.
కాకినాడ ఎంపీ వంగ గీతా సైతం ఇటీవల కరోనా బారినపడిన విషయం తెలిసిందే. గత శనివారం ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది.
కాగా, ఢిల్లీ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటి వరకు 24 మంది ఎంపీలకు, 8 మంది కేంద్రమంత్రులకు కరోనా పాజిటివ్ గా తేలింది. అయితే సమావేశాల మధ్యలో ఎవరికైనా వైరస్ సోకితే మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.