చిత్తూరుకు వంద సంవత్సరాలు
posted on Mar 26, 2011 @ 3:06PM
హైదరాబాద్: చిత్తూరు జిల్లా ఏర్పడి వందేళ్లు పూర్తయిన సందర్భంగా వేడుకలకు పెద్ద యెత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి రఘువీరా రెడ్డి శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఏప్రిల్ 1వ తేదీకి చిత్తూరు జిల్లా ఏర్పడి వందేళ్లు పూర్తవుతోందని, ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా వందేళ్ల ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన చెప్పారు. చిత్తూరు జిల్లా ముఖ్యమంత్రులను, రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి వంటివారిని అందించిందని ఆయన చెప్పారు. ఈ వేడుకలు మూడు రోజుల పాటు జరుగుతాయని ఆయన చెప్పారు. ఈ నెల 30వ తేదీన గవర్నర్ నరసింహన్ ఉత్సవాలను ప్రారంభిస్తారని చెప్పారు. ఏప్రిల్ 1వ తేదీన ముగింపు ఉత్సవాల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొంటాన్నున్నట్లు ఆయన తెలియచేసారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లాకు చెందినవారేనని, ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ జిల్లాకు చెందినవారేనని ఆయన చెప్పారు. ఉత్సవాలకు చంద్రబాబుతో పాటు తిరుపతి నుంచి శాసనసభకు ఎన్నికైన చిరంజీవిని కూడా ప్రభుత్వం ఆహ్వానిస్తుందని ఆయన చెప్పారు. మాజీ మంత్రులను, అధికారులను, కళాకారులను, తదితరులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించనున్నట్లు తెలిపారు.