మెగాకుటుంబం మళ్ళీ ఒక్కటవ్వబోతోందా?
posted on Mar 22, 2015 6:54AM
చిరంజీవి, పవన్ కళ్యాణ్ అన్నదమ్ములిద్దరూ కూడా సినీరంగంలో అత్యున్నత స్థాయికి చేరుకొన్నప్పుడు రాజకీయాలలోకి ప్రవేశించారు. కానీ వారిరువురు రాజకీయాలలో రాణించలేకపొతున్నారనే సంగతి అందరికీ స్పష్టంగా కనబడుతూనే ఉంది. అందుకే చిరంజీవి మళ్ళీ సినీపరిశ్రమకు వెళ్ళిపోయి తన 150వ సినిమాపై దృష్టి పెట్టారు. పవన్ కళ్యాణ్ కూడా అప్పుడప్పుడు జనాల ముందుకు వచ్చి ఏదో ఆవేశంతో మాట్లాడివెళ్ళిపోతున్నారు తప్ప సినీపరిశ్రమ వదిలిపెట్టే ఉద్దేశ్యం కనబడటం లేదు. కానీ వారిరువురు ప్రత్యర్ధ పార్టీలయిన కాంగ్రెస్, బీజేపీలను భుజాలకెత్తుకోవడంతో వారి అభిమానులలో చాలా గందరగోళం ఏర్పడి రెండు గ్రూపులుగా చీలిపోవలసి వచ్చింది. కానీ అన్నదమ్ములిద్దరూ రాజకీయాలకు దూరంగా ఉంటూ మళ్ళీ సినిమాలు చేస్తున్నప్పుడు, వారి అభిమానులు అందరూ కూడా ఒక్కటిగా కలిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బహుశః అందుకే చిరంజీవి అభిమాన సంఘాలు ఈరోజు హైదరాబాద్ లో సమావేశమవుతున్నాయి. ఒకప్పటి రాజకీయ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ, ప్రజలు వ్యతిరేకిస్తున్న ఆ పార్టీలో ఇంకా కొనసాగడమా లేక తనకు అచ్చిరాని రాజకీయాలు వదిలిపెట్టడమా లేకపోతే తమ్ముడు పవన్ కళ్యాణ్ తో చేతులు కలిపి వచ్చే ఎన్నికల సమయానికి రాష్ట్రంలో జనసేన పార్టీని ప్రత్యామ్నాయ శక్తిగా తీర్చిదిద్దడమా? అనే సందిగ్ధంలో చిరంజీవి ఉన్నట్లు తెలుస్తోంది. తన అభిమానుల కోరిక మేరకు ఆయన ఏదో ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. కనుక ఈరోజు హైదరాబాద్ లో జరుగబోయే చిరంజీవి అభిమానుల సంఘాల సమావేశం చాలా కీలకమయినదేనని భావించవచ్చును.