Read more!

భవిష్యత్తును శాసించే బాలలు...

భారత ప్రథమ ప్రధానమంత్రి పండిట్ జవహార్ లాల్ నెహ్రు గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈయన పుట్టిన రోజును బాలల దినోత్సవం పేరిట జరుపుకుంటారు. నిజానికి ఐక్యరాజ్య సమితి బాలల దినోత్సవాన్ని నవంబర్ 20వ తేదీన జరుపుకోవాల్సిందిగా ప్రకటించింది. కానీ భారతీయులు మాత్రం నవంబర్ 14న జవహార్ లాల్ నెహ్రూ జయంతి రోజునే జరుపుకుంటున్నాం. దీనికి కారణం జవహార్ లాల్ నెహ్రూ బాలబాలికల విద్యను ఎంతగానో ప్రోత్సహించారు.  తమ విద్యకు ఆయన అందించిన ప్రోత్సాహానికి పిల్లలు ఆయన్ను చాచా నెహ్రూ అని ముద్దుగా పిలుచుకుని తమ ప్రేమను చాటుకున్నారు.  నవంబర్ 14వ తేదీనే బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. పిల్లలకూ కొన్ని హక్కులున్నాయని, ఆ హక్కులకు అనుగుణంగా  వారు జీవించాలని బాలల దినోత్సవం నొక్కి చెబుతుంది. అంతే కాదు.. సమాజంలో పిల్లలకు విద్య అందడం నుండి వారి సంక్షేమం వరకు చాలా విషయాల గురించి ప్రభుత్వాలు చర్చిస్తాయి.

పసిడి నవ్వుల చాచాజీ..
పుట్టినరోజు ఈ రోజు
పిల్లల పండుగ ఈ నాడు

ఈ గేయం చాలామందికి గుర్తుండే ఉంటుంది. జవహార్ లాల్ నెహ్రూను పిల్లలు ముద్దుగా చాచాజీ అని పిలుస్తారు. దీనివెనుక కారణం.. భారత్  బ్రిటీషర్ల చేతుల్లో నలిగి స్వాతంత్ర్యం పొందిన తరువాత ఈ దేశాన్ని సరైన మా్ర్గంలో నడిపించే ఉద్దేశ్యంతో నెహ్రూ ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఈ నిర్ణయాల అనుగుణంగా ఆయన నిరంతరం వివిధ ప్రాంతాలను సందర్శించాల్సి వచ్చేది. ఆయనకు స్వతహాగా పిల్లలన్నా, గులాబీ పువ్వులన్నా ఎనలేని మక్కువ. ఈ కారణంగా ఆయన ఎక్కడికి వెళ్లినా పిల్లలను చాలా ఆప్యాయంగా, ప్రేమగా పలకరించేవాడు, వారిని దగ్గరకు తీసుకునేవాడు. దీంతో పిల్లలు ఆయన్ను చాచా నెహ్రూ అని పిలిచేవారు. నెహ్రూకు గులాబీలంటే మక్కువ అని తెలిసి గులాబీ పువ్వులతో ఆయన్ను చుట్టుముట్టేవారు. అలా పిల్లలకు ఆయన పట్ల ప్రేమాభిమానాలకు గుర్తుగానూ, పిల్లల విద్య కోసం ఆయన చేసిన కృషి ఫలితంగానూ ఆయన జయంతిని  బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

ఈరోజున ఏం చెయ్యచ్చు..

పిల్లలకు కూడా రాజ్యంగంలో కొన్ని హక్కులున్నాయని చదువుకుంటూనే ఉన్నాం. కానీ నిజానికి పిల్లలకున్న హక్కుల గురించి  తెలిసిన వారు చాలా తక్కువ.  బాలల దినోత్సవం రోజున ఈ హక్కుల గురించి చర్చించి పిల్లలు వాటిని ఉపయోగించుకునేలా చేయాలి.

చాలామంది పిల్లలకు విద్య, ఆహారం, స్వేచ్చ లభించడం లేదు. ఇటువంటి పిల్లలను గుర్తించి వారిని వారికి న్యాయం జరిగేలా చేయాలి.

పిల్లలలో లింగ సమానత్వం పాటించాలి. మగపిల్లాడు ఎక్కువ, ఆడపిల్ల తక్కువ అనే చాదస్తపు ఆలోచనలు వదిలి పిల్లలను సమానంగా పెంచాలి.

ఉరుకులు పరుగుల ఉద్యోగాల కాలంలో పిల్లలను పట్టించుకోవడం గురించి ఆలోచించాలి. వారికి తగినంత సమయం కేటాయించాలి. వారితో ప్రేమగా మాట్లాడాలి, ఆలోచనలు పంచుకోవాలి. తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లలతో స్నేహితుల మాదిరిగా ఉండాలి. అలా ఉంటే పిల్లలు ఉత్తమ పౌరులుగా అభివృద్ది పెంచుతారు. తల్లిదండ్రులతో ప్రతి విషయాన్ని పంచుకోగలుగుతారు.

బడి వయసు పిల్లలను బడికి వెళ్లేలా చేయడం, బాలకార్మిక వ్యవస్థను రూపుమాపడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలి.

నేటి బాలలే రేపటి పౌరులు అనే మాట గుర్తుంచుకుని పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషిస్తారు. కాబట్టి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల విషయంలో బాధ్యతగా ఉండాలి.

                                                    *నిశ్శబ్ద.