విదేశాలల్లోనూ అంగరంగ వైభవంగా బంగారు బతుకమ్మ వేడుకలు.....
posted on Oct 5, 2019 @ 10:36AM
దసరా వచ్చిందంటే చాలు ముందుగా మనకు గుర్తోచ్చేది బతుకమ్మ.తెలంగాణ ప్రజలు వైభవంగా జరుపుకుంటూ పెద్ద వేడుకగా చేసుకుంటారు.తెలంగాణ సాంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే బతుకమ్మ వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలు ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్ డమ్ ఆధ్వర్యంలోనూ లండన్ లో చేనేత బతుకమ్మ దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు యూకే నలుమూలల నుండి పన్నెండు వందలకు పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ మహోన్నత కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా భారత హైకమిషన్ ప్రతినిధి రాహుల్, స్థానిక హౌన్సలో మేయర్ టోని లౌకీలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూతనిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న నేపధ్యంలో అదే స్ఫూర్తితో రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారి కృషికి తమ వంతు బాధ్యతగా చేనేతకు చేయూత నిస్తూ ఈ సంవత్సరం కూడా వేడుకలనూ చేనేత బతుకమ్మ మరియు దసరాగా జరుపుకున్నామని సంస్థ వ్యవస్ధాపకుడు అనిల్ కూర్మాచలం తెలిపారు.
ఇక తమ పిలుపు మేరకు హాజరైన ప్రవాసులు చేనేత బట్టలు ధరించి పాల్గొనడం తమకెంతో సంతోషాన్ని మరియు స్ఫూర్తిని ఇచ్చిందని వ్యక్తం చేస్తున్నారు. ఈవెంట్స్ ఇన్ చార్జ్ రత్నాకర్ కుడుదుల తెలిపారు. కల్చరల్ ఇన్ చార్జ్ సత్య చిలుముల మాట్లాడుతూ దసరా పండుగ సందర్భంగా స్వదేశం నుండి తెచ్చిన శమీ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన దసరా అలయ్ బలయ్ కార్యక్రమంలో చేనేత శాలువాలను ఒకరికొకరు పరస్పరం వేసుకొని జమ్మీన్ ఇచ్చిపుచ్చుకుని శుభాకాంక్షలు తెలుపుకుని చేనేతకు చేయూతగా వీలైనన్ని సందర్భాల్లో చేనేత బట్టలు ధరిస్తామని ప్రతిజ్ఞ చేశారు.జమ్మి ఆకులు పంచుకుంటూ లండన్ పట్టణానికి అలాయి బలాయిలా తెలంగాణ స్నేహ మాధుర్యాన్ని ప్రత్యక్షంగా రుచి చూపించారని పలువురు ప్రశంసించారు. అలాగే తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ దసరా పండుగ సందర్భంగా మహిళలందరు భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్దంగా గౌరీ దేవికి పూజలు జరిపి బతుకమ్మ ఆట పాటలతో కోలాటాల నృత్యాలతో చప్పట్లు కలుపుతూ రంగురంగుల బతుకమ్మలతో సందడి చేశారు. బతుకమ్మల మధ్య ఏర్పాటు చేసిన కాకతీయ కళాతోరణం వేడుకలకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అతిథులందరి ప్రశంసలందుకుంది. ప్రతి సంవత్సరం తెలంగాణ ప్రత్యేకతను చాటిచెప్పేలా వినూత్నంగా ఇలా ఏదో ఒక ప్రతిమను ఏర్పాటు చేస్తున్నామని గత ఏడాది చార్మినార్ ఏర్పాటు చేసామని కార్యదర్శి మల్లారెడ్డి తెలిపారు.
విదేశాల్లో స్థిరపడ్డ కానీ తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పాటలు పాడటం అందరినీ ఆకట్టుకుంది. చిన్నారులు సైతం ఆటలలో పాల్గొనడమే కాకుండా, చిన్న చిన్న బతుకమ్మలతో సంబరాలకు కొత్త అందాన్ని తెచ్చారు. రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్, జోగినపల్లి గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్రజలంతా పాల్గొనాలనే, ప్రవాసులంతా ఎంపీ సంతోష్ గారు చేపట్టిన విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రకటించటమే కాకుండా తమ వంతు బాధ్యతగా ముందుకు తీసుకెళ్లి ప్రజలలో అవగాహన కల్పిస్తామని ప్రతిజ్ఞ చేస్తూ భారీ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు హాజరైన ముఖ్య అతిధులు మరియు ప్రవాసులంతా ఐ ప్లజ్ టూ సపోర్ట్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే సెల్ఫీ స్టాండ్ తో ఫోటోలు దిగి తమ మద్దతును తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారత హై కమిషనర్ ప్రతినిధి రాహుల్ తో పాటు ప్రవాస సంఘాల ప్రతి నిధులు పాల్గొన్నారు. చేనేత పేరుతో బతుకమ్మ వేడుకలు నిర్వహించడం వినూత్నంగా ఉందని వీరి ప్రయత్నం ఫలించి చేనేత కుటుంబాలకు మేలు జరగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు.మన దేశ ప్రజలు విదేశాలల్లో మన పండుగలను పూర్తిగా జరుపుకోలేకపోతున్నారనే అసంతృప్తిని వైదోలగించి ఇలాంటివాటిని ప్రోత్సహించడం వల్ల భారతీయులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.