మార్పు అవసరం.. మనకోసం.. అందరి కోసం కూడా

అంతర్గతంగా వచ్చే మార్పే జీవితాన్ని సమూలంగా మార్చేస్తుంది. అందరితో కలిసిపోయి, ఆడుతూ పాడుతూ చిన్నపిల్లల్లా జీవితం గడపాలని చాలామంది జీవితానుభవం కలిగినవారికి ఉంటుంది. అది మనసు వరకే. ఆలోచనల్లోనే. ప్రవర్తనలోకి రాదు. కొద్ది కొద్ది మార్పులు కూడా ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. మనకే అనిపిస్తూ ఉంటుంది. మనం ఇంకొంచెం మెరుగ్గా వాళ్లతో ప్రవర్తించి ఉండాల్సిందని. కాని ఎందుకో అంతకు మించి సాగలేకపోయాం. అదేమంత కష్టం కాదు. అయినా, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే లాగా ఉండిపోయాం.

ఎన్నో పుస్తకాలు చదువుతాం. వీలైతే పెద్దవాళ్ల మాటలు సభల్లో వింటాం. గొప్ప గొప్ప చలనచిత్రాలు చూస్తాం. ఇంట్లోనే అనుకోని ఒక సందర్భం ఎదురుపడినప్పుడు పదేళ్ల క్రితం ఎలా ప్రవర్తించామో ఇప్పుడూ అలానే ప్రవర్తిస్తుంటాం. శరీరంలో మార్పులు కనిపిస్తుంటాయి. కాని, మనసులో పెద్దగా మార్పులు రావు.

మనసులో మార్పు ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. అంతర్గతంగా వచ్చే మార్పే జీవితాన్ని సమూలంగా మార్చేస్తుంది.
మారకుండా ఉండే ఏ పరిస్థితీ మానవ జీవితంలో లేదు. అసలు ప్రకృతిలోనే లేదు. మార్పు నిత్యసత్యం. ఈ సత్యం తెలుసుకున్న మనిషి అందరికీ అనుకూలంగా ఉంటాడు.

ఒకరిద్దరికి మించి, మన ప్రవర్తనలో మార్పు ఉండాలి అన్నారంటే, మనల్ని మనం పరిశీలించుకోవాలి.    అద్దం ముందు పెట్టుకుని మన శరీరాన్నే కాదు, మనసును సైతం అన్ని కోణాల్లోంచీ శోధించాలి.
మన ప్రవర్తన సరిగ్గా లేనప్పుడే, ఎదుటివాళ్లను ఎవరిని చూసినా ఏదో వంక పెట్టాలని అనిపిస్తుంది. వాళ్లెవరూ సరిగ్గాలేరని అనిపిస్తుంది. ఒక్కక్షణం చాలు. మనం మారితే... ప్రపంచం మారిపోతుంది!ధర్మరాజు దృష్టి కోణంలో అందరూ మంచివారే. దుర్యోధనుడి దృష్టి కోణంలో అందరూ చెడ్డవారే. చూపు మార్చుకుని, ప్రవర్తనలో ఆ మంచి విషయాలను అభ్యాసం చెయ్యాలి.

మారిన మనిషిని చూస్తే, ప్రతి ఒక్కరికీ విస్మయమే. ఎందుకంటే మార్పు కష్టం. మార్పును అంగీకరించి తన ప్రవర్తన మార్చుకుని ఎదుటివాళ్లకు అనుకూలంగా ఉండాలంటే, అతడెంతో సంయమనంతో ఉండాలి. పాత అలవాట్లను అధిగమించాలి. ముఖ్యంగా జీవితాన్ని యథాతథంగా స్వీకరించాలి.

శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధ సందర్భంగా అర్జునుడిలో పెను మార్పులు తీసుకొచ్చాడు. లోకకల్యాణ కారకమైన భగవద్గీతనే  అందించాడు. దైవం తలచుకుంటే మార్పును ఇవ్వడమే కాదు, కొత్త జన్మనే ప్రసాదించగలడు.

ముఖ్యంగా మన ప్రవర్తనను అద్భుతంగా నియంత్రించగలిగేది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత రవ్వంత కూడా తెలియని మనుషులూ మంచివారుగా మెలగవచ్ఛు మంచివారుగా ఉండాలంటే వారు హృదయంతో జీవించాలి. ఆ హృదయంలో ఆత్మ ఆసీనురాలై ఉంది. ఆత్మను స్పృశిస్తే ఆధ్యాత్మికత పెల్లుబుకుతుంది.
అన్ని వైపుల నుంచి దివ్యమైన ఆలోచనలు రావాలి’ అని రుగ్వేదం చెబుతోంది.
సహజంగా మన లోపల పుట్టే ఆలోచనలన్నీ సానుకూలంగా ఉండవు సరికదా- మంచిగానూ ఉండవు. కొన్ని మనసులు ఆలోచించినట్లు శత్రువులైనా ఆలోచించరు. అందుకే మనకు దివ్యమైన భావాలు కావాలి.

ఎక్కడ అగ్ని ఉందో, అక్కడే నీటిని చల్లాలి. పుట్టే చెడ్డ ఆలోచనలను వెనువెంటనే మంచి ఆలోచనలతో ఖండించాలి. మాటలో, ప్రవర్తనలో సైతం గొప్పదనాన్ని, దివ్యత్వాన్ని ప్రకటించాలి. త్వరగా మనలో రావాల్సినంత మార్పు రాకపోతే అంత నష్టం జరిగిపోయినట్లే. కాలం తిరిగి రాదు. చింతించి లాభం లేదు. సమస్యను గుర్తించిన మరుక్షణమే మనసును మార్చుకొని ముందుకెళ్లాలి.

వాళ్లవాళ్ల ప్రవర్తనలో మార్పుల వల్లనే సంఘ సంస్కర్తలు, దేశభక్తులు, శాస్త్రవేత్తలు, యోగులు, జ్ఞానులు... చరిత్రలో నిలిచిపోయారు. వేల సంవత్సరాల నుంచి భూమిలో నిక్షిప్తమై పడిఉన్న బొగ్గుముక్కే ఒక రోజు వజ్రంగా సాక్షాత్కరిస్తుంది. ఇది శాస్త్రీయ పద్ధతిలో కనిపించే ఒక సత్యం. మనం మారదాం.. మన కోసం, అందరి కోసం!

Teluguone gnews banner

వడదెబ్బ కొట్టని పానీయం రసాల

పెరుగు మీద తేరుకున్న నీళ్ళు, పాలు కలగలిపి ఆరోగ్యకరమైన “రసాల” అనే పానీయాన్ని “భీముడు” తయారు చేశాడని “భావప్రకాశ” వైద్య గ్రంథంలో ఉంది. అరణ్యవాసంలో ఉన్నప్పుడు, పాండవుల దగ్గరకు శ్రీ కృష్ణుడు వస్తే, భీముడు స్వయంగా దీన్ని తయారు చేసి వడ్డించాడట! ఇది దప్పికని పోగొట్టి వడదెబ్బ తగలకు౦డా చేస్తుంది కాబట్టి, ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన వారికి ఇచ్చే పానీయం ఇది. తన ఆశ్రమాన్ని సందర్శించటానికి శ్రీరాముడు వచ్చినప్పుడు భరద్వాజ మహర్షి  రాముని గౌరవార్థం ఇచ్చిన వి౦దులో రసాల కూడా ఉంది. భావ ప్రకాశ  వైద్య గ్రంథంలో దీన్ని ఎలా తయారు చేసుకొవాలో వివరంగా ఇచ్చారు ఎండలోకి వెళ్లబోయే ముందు దీన్ని తాగండి చక్కగా “చిలికిన  మజ్జిగ” ఒక గ్లాసునిండా తీసుకోండి. అందులో ఒక “నిమ్మకాయ రసం”, తగినంత “ఉప్పు”, “పంచదార”, చిటికెడంత “తినేసోడాఉప్పు” కలిపి తాగి అప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్లండి వడదెబ్బకొట్టకుండా ఉంటుంది. మరీ ఎక్కువ ఎండ తగిలిందనుకొంటే తిరిగి వచ్చిన  తరువాత ఇంకోసారి త్రాగండి. ఎండలో ప్రయాణాలు చేయవలసి వస్తే, ఒక సీసానిండా దీన్ని తయారు చేసుకొని వెంట తిసుకెళ్లండి. మాటిమాటికీ తాగుతూ ఉంటే వడదెబ్బ కొట్టదు.

శివుడు నీల కంఠుడవడానికి కారణం ఇదే

“మంచుకొండల్లో పాలు తోడుకోవు. అందుకని, అక్కడ పెరుగుగానీ, దాన్ని చిలికిన మజ్జిగ గానీ దొరికే అవకాశలు ఉండవు. ఈ కారణంగా, కైలాసంలో ఉండే పరమ శివుడికి, మజ్జిగ తాగే అల వాటు లేకపోవటాన ఆయన నీలకంఠుడయ్యాడు.  “ పాల సముద్రంలో నివసించే విష్ణుమూర్తికి మజ్జిగ ఎటు తిరిగీ దొరకదు కాబట్టే, ఆయన నల్లని వాడయ్యాడు.“స్వర్గంలో ‘సుర’ తప్ప మజ్జిగ దొరకవు కాబట్టి, ఇంద్రుడు బలహీనుడు అయ్యాడు.     “మజ్జిగతాగే అలవాటే గనక ఉ౦టే, చ౦ద్రుడుకి క్షయ వ్యాధి, వినాయకుడికి పెద్ద పొట్ట, కుబేరుడికి కుష్టురోగం, అగ్నికి కాల్చే గుణం ఇవన్నీ వచ్చేవే కాదు”  యోగ రత్నాకరం అనే వైద్యగ్ర౦థ౦లో ఈ చమత్కార విశ్లేషణ కనిపిస్తు౦ది.  మజ్జిగ తాగేవాడికి ఏ వ్యాధులూ కలగవనీ, వచ్చిన వ్యాధులు తగ్గి, తిరిగి తలెత్తకు౦డా ఉంటాయనీ, “విషదోషాలు”, “దుర్బలత్వం”, “చర్మరోగాలు”, “క్షయ”, “కొవ్వు”, “అమిత వేడి” తగ్గిపోతాయనీ, శరీరానికి మంచి వర్చస్సు కలుగుతుందనీ దీని భావం. అక్కడ దేవతల కోసం అమృతాన్నీ, ఇక్కడ మానవుల కోసం మజ్జిగనీ భగవంతుడు సృష్టి౦చాడట! వేసవి కాలాన్ని మనం మజ్జిగతోనే ఎక్కువగా గడిపేందుకు ప్రయత్నించాలి. తోడుపెట్టినందు వలన పాలలో ఉండే పోషక విలువలన్నీ మజ్జిగలోనూ పదిలంగా ఉండటంతో పాటు, అదనంగా “లాక్టో బాసిల్లై” అనే “మంచి బాక్టీరియా” మనకు  దొరుకుతుంది. పాలలో ఈ ఉపయోగకారక బాక్టీరియా ఉండదు.  అందుకని, వయసు పెరుగు తున్నకోద్దీ మజ్జిగ అవసరం పెరుగుతుంది. ప్రిజ్జులో పెడితే మజ్జిగలోని ఈ బాక్టీరియా నిరర్థకం అవుతుంది. అందుకని అతి చల్లని మజ్జిగ తాగకూడదు. చిలికినందువలన మజ్జిగకు తేలికగా అరిగే గుణం వస్తుంది. అ౦దుకని పెరుగుకన్నా మజ్జిగ మంచిది.  

ప్రాచీన గుళ్లకు నాగబంధాలుంటాయా

పురాణ ఇతి హాస లలో నాగ బంధానికి విశిష్ట స్థానం ఉంది. నాగబంధమ్ వేసేప్పుడు తాంత్రికులు మాత్రమే వేస్తారు. మంత్రం తంత్రం యంత్రం క్రియ ముద్ర జ్ఞానం ఈ ఆరింటితో నాగ బంధం వేస్తారు. గోల్కొండ నవాబుల హయాంలో కూడా నిధి నిక్షేపాలు ఉన్న గుళ్లకు నాగ  బంధం వేసే వారట. హైదరాబాద్ శాలి బండ సమీపంలోని గాజి బండాలో వెలిసిన కంచి కామాక్షి దేవాలయానికి నాగ బంధం వేసినట్లు అర్థం చేసుకోవాలి . గర్భ గుడి గడపలో నాగ బంధం ఉన్నట్లు దేవాలయం వారసులు ఇటీవలి కాలంలో గుర్తించారు. గడపకు పసుపు కుంకుమ రాసే సమయంలో నాగ బంధం ముద్రలు గుర్తించారు. వెంటనే వాటి మీద  రెడ్ పెయింట్ వేసి స్పష్టంగా కనపడేటట్లు చేసారు. ఈ విషయాన్ని తమ పూర్వికులు చెప్పలేదని 50 ఏళ్ల శ్రీనివాస చారి తెలిపారు. అయితే మా తాత నరసింహా చారి మేనత్త ఈశ్వరమ్మ మాత్రం నాగ సర్పం పక్కనే నిదరించేదని ఓ కథనం ప్రచారంలో ఉంది. ఒంటరిగా దేవాలయలో ఉండే ఈ శతా ధిక వయోవృద్దురాలు రాత్రి పడుకున్న తర్వాత అతి పెద్ద నాగ సర్పం ఈశ్వర మ్మ పక్కనే వచ్చి నిదరించేదట. అది భూమి మీద పాకుతూ దేవాలయం పై కప్పు మీదికి వెళ్లిపోయేదని చెబుతారు. అమ్మవారి వీపు భాగం లో పెద్ద పుట్ట ఉండేదని ప్రతీతి. పుట్టకు సంబంధించిన ఆనవాళ్లు ఇప్పటికీ  ఉన్నాయి. నాగు పాము పెద్దగా ఉండటం చురుకుగా లేకపోవడం బట్టి వయసు మీద పడినట్లు అర్థం చేసుకున్నామని మా తాత నర్సింహా చారి చిన్నప్పుడు చెప్పినట్లు శ్రీనివాసా చారి గుర్తు చేసుకున్నారు. క్షీర సాగర మధనంలో రాహు కేతువుల శరీర భాగాలు విడిపోతాయి ఆ సమయం లో సర్పములు రాహు కేతువులకు  సర్పములు సాయం చేసాయి అప్పుడు రాహు, కేతువులు ఇచ్చిన వరం మూలంగానే నాగ  బంధానికి ఆ పవర్ వచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. గోల్కొండ నవాబుల హయాంలో నాగ బంధం వేసినట్లు ఇది చారిత్రక ఆధారం  దొరికినట్టయ్యింది. పార్వతి సతుడికి సర్పం ఆభరణం. కాబట్టి కంచి కామాక్షి దేవాలయంలో సర్పాలు న డ యాడినట్టు రుజువు లు ఉన్నాయి.

జ్ఞానోదయానికే ప్రశ్న పుడుతుంది

పాండవుల తరువాత భారతదేశాన్ని ఎక్కువ కాలాన్ని పరిపాలించిన మహారాజు పరీక్షిత్తు. ఇతను అర్జునుడి మనవడు, అభిమన్యుని కుమారుడు. ఇతని తల్లి ఉత్తర. తల్లి గర్భంలో ఉన్నప్పుడే అశ్వత్థామ ఇతనిపై బ్రహ్మ శిరోనామకాస్త్రము ప్రయోగించెను. దాని మూలంగా కలిగిన బాధనోర్వలేక ఉత్తర శ్రీకృష్ణుని ప్రార్థించెను. ఆతని కరుణ వలన బాధ నివారణమై శిశువుగా ఉన్న పరీక్షిత్తు బ్రతికెను. ఇతడు ఉత్తరుని కూతురు ఇరావతిని వివాహము చేసుకొన్నాడు. ఇతని కుమారుడు జనమేజయుడు. పరీక్షిత్తుకు మరణం గూర్చి ముందే తెలుసు. ప్రతీవారికి మరణం గూర్చి తెలియాలనే ఉద్దేశ్యంతో పరీక్షిత్తు శుక మహర్షిని ప్రశ్న అడిగాడు.జ్ఞానోదయానికే శుక మహర్షి అంతే ఓపికగా సమాధానం చెబుతాడు.    జీవుడు బ్రహ్మజ్ఞానంతో పరబ్రహ్మ స్వరూపాన్ని ఆరాధిస్తే, ప్రకృతి కల్పించే మాయాబంధం నుంచి తప్పించి, అజ్ఞానానికి వశం కాకుండా కాపాడమని చేసే నిరంతర జ్ఞానసాధనే రుక్మిణి- అగ్నిద్యోతనుడి చేత సందేశం పంపడంలోని అంతరార్థం. ఆ సందర్భంలో ఆమె ‘భువన సుందరా’ అని సంబోధించింది. ఇక్కడ భువనమంటే సకల చరాచర జగత్తు. వాటన్నింటిలో సుందరుడు అంటే ఆనందం కలిగించేవాడు. సహజమైన ఆనందం దూరమైతే అవ్యక్తానందాన్ని అలౌకిక ఆనందాన్ని కలిగించేవాడు భగవంతుడొక్కడే. అందుకే అలా సందేశం పంపింది.  తెలియనితనం వల్ల మాత్రమే ప్రశ్న పుట్టదు. దానికి వచ్చే జవాబుతో ఎందరికో జ్ఞానోదయం కలుగుతుందనే ఉద్దేశంతోనూ ప్రశ్న పుడుతుంది. పుట్టిన ప్రతి ప్రశ్న వెనకా కచ్చితంగా ఒక నిజం ఉండి తీరుతుంది. ఆ నిజం వల్ల జీవనగమనం దిశ ఎటువైపు సాగాలనే నిర్ణయం తీసుకునే అవకాశం ఏర్పడుతుంది.ప్రశ్న చిన్నదే కావచ్చు. దానికి వచ్చే సమాధానం మాత్రం విస్తృత జ్ఞాన సంపదకు ఆలవాలమైనదై ఉండవచ్చు. అలాంటి ప్రశ్న ఉంటే ఆ క్షణానికి జవాబు లేకపోయినా దానికోసం తప్పకుండా వెతుకులాట మొదలవుతుంది. వేదాలు, శాస్త్రాలు, ఇతిహాస-పురాణాల్లో ఆ ప్రశ్నలకు సరైన జవాబులు దొరుకుతాయి. స్వయంభువులైన దేవతలు, జ్ఞానసంపద కలిగిన మహానుభావులు, తపశ్శక్తి సంపన్నులైన ఋషులు, మునులు, సర్వసంగ పరిత్యాగులు, సకల విషయాలూ తెలిసిన పండితులు వంటివారి ముఖతః లేఖినుల నుంచి వెలువడినవి అవి. కాబట్టి తిరుగులేనివి, నమ్మదగినవి అయిఉంటాయి. ‘మరణం ఆసన్నమైనప్పుడు పురుషులు వినదగింది ఏది?’ అనేది భాగవతంలో శుక మహర్షిని పరీక్షిత్తు అడిగిన ప్రశ్న. పరీక్షిత్తుకు మరణం వచ్చే సమయం నిర్ణయమైపోయింది. దానికిగాను తీసుకోవలసిన చర్యగా ఏడురోజుల్లో భాగవతం వినాలనే విషయం తెలుసు. ఆ పనిమీదే ఉన్నాడు కూడా. అలాంటప్పుడు ఆయన ఆ ప్రశ్న అడగడంలో ఆంతర్యం ఏమిటి? ఈ ప్రశ్న వెనక ఉద్దేశం- ‘ప్రతివారికీ మరణం తప్పదు’ అని లోకానికి చెప్పడమే. పరీక్షిత్తుకు తెలిసినట్లు ఇతరులకు మరణం వచ్చేది ఎప్పుడో తెలిసేది ఎలా? ఒకవేళ తెలిసినా అప్పటికప్పుడు పైనచెప్పిన విధంగా జాగ్రత్తలు తీసుకోవడం ఎలా సాధ్యమవుతుంది? వీటికి జవాబు లోకులకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే పరీక్షిత్తు ఆ ప్రశ్న అడిగాడు. అందులోనూ అంత కష్టకాలంలో. ఆ ప్రశ్నలకు శుక మహర్షి కచ్చితంగా, నిర్మొహమాటంగా సమాధానం చెప్పాడు. దేహం విడిచే కాలం సమీపించినప్పుడు- భయాన్ని, అన్ని విషయాల పట్ల మమకారాన్ని తెంచుకోవాలి. ఎలాంటి ఆలోచన వచ్చినా చెదరని మనసు కలిగి ఉండాలి. ఏకాంత ప్రదేశంలో నిశ్చింతగా ఉండాలి. బ్రహ్మ ప్రతిపాదితమైన ఓంకారాన్ని మననం చేసుకోవాలి. ప్రాణాయామంతో మనసును నిగ్రహించుకుని భగవన్నామ స్మరణ చేసుకోవాలి అంటూ అనేక సూచనలు చేశాడు శుకమహర్షి.వాటితోపాటు మరికొన్ని జాగ్రత్తలూ చెప్పాడు. ‘ఇంద్రియాలు, బుద్ధి, ఆలోచనలు, మనోమయ వ్యవహారాలు, జీవన గమన రీతులు లాంటివన్నీ ఒక పూర్ణ రూపంపై నిలిపి సదా దాన్నే మననం (జపించడం) చేయాలి. ఆ పూర్ణరూపును ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. చింతన చేస్తున్నప్పుడు అన్యవిషయ భాషణం, ఆలోచన, ప్రస్తావన వంటివేవీ దరి చేరనీయరాదు. అలా జరగాలంటే సాధన కావాలి. ఆ సాధన ఏ ఒక్క క్షణమో, ఒక్కసారో లేదా ఒక కోణంలోనో చేస్తే చాలదు. అది నిరంతరాయమైన ప్రక్రియ కావాలి. అప్పుడు పొందేది బ్రహ్మానంద స్థితి. ఆ స్థితి పొందినవారికి ఇతర విషయాలపట్ల ధ్యానం, ధ్యాస, ఆసక్తి లాంటివి ఉండవు’ అని వివరించాడు. వీటన్నింటి ఆంతర్యం సదా భగవధ్యానం చేస్తూండమని. భాగవతం రాసింది విష్ణ్వంశ సంభూతుడైన వ్యాసుడు. అందులో ఎన్నో ప్రశ్నలు కనిపిస్తాయి. వాటికి సూటిగా కొన్ని, మార్మికంగా కొన్ని, అంతర్గత రూపంలో కొన్ని, లౌక్యంతో కూడినవి కొన్ని జవాబులూ దొరుకుతాయి. ప్రథమ స్కంధం నుంచి ద్వాదశ స్కంధం వరకు అనేక సందర్భాల్లో, అనేక రూపాలు కోణాల్లో, ఈ ప్రశ్నలు సంఘటనలు, కథలు, బోధనల రూపంలో అడుగడుగునా తారసపడతాయి. అందుకే భాగవతం ఒక కావ్యం కాదు, జ్ఞాన భాండాగారం.  

శ్రీకృష్ణుణ్ని జీవిత కథే దశమ స్కందం

శ్రీకృష్ణుణ్ని జీవితంలో ముఖ్య ఘట్టాలు దశమస్కందంలో సోదాహరణంగా వివరించారు. పోతన భాగవతంలో దశమస్కందానికి విశేష ప్రాధాన్యత ఉంది.   భాగవతంలో ఆయువుపట్టు దశమస్కంధం. దాన్ని పూర్వోత్తర భాగాల పేరిట రెండుగా విభజించారు. పూర్వ భాగాన్ని రుక్మిణీ కల్యాణం దగ్గర పూర్తి చేస్తారు. భాగవతంలో రుక్మిణీ కల్యాణానికి ఉన్న విశేష ప్రాధాన్యమే అందుకు కారణం. ఈ ఘట్టం చదివినా, విన్నా కలిగే ఫలితం ‘ఇది’ అని చెప్పడానికి మాటలు చాలవు. ఇందులో పాఠకులకు లౌకిక, వేదాంతపరమైన రెండు అర్థాలు గోచరమవుతాయి. ప్రేమ, అనురాగం, మమకారం, ఆదరణ లాంటి సున్నిత విషయాలు అంతర్గతంగా ఉన్నాయి.తన జీవన సహచరుడు ఎలా ఉండాలో కచ్చితంగా నిర్ణయించుకునే శక్తి స్త్రీలకే ఉంటుందని దమయంతి వంటి అనేక పురాణ పాత్రల వల్ల తేటతెల్లమవుతుంది. ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకునే విషయంలో మొగమాటాన్ని కాస్త సడలించి, తెగింపు జోడిస్తే ఆశించిన విజయాలు కలుగుతాయని ఆ వనితలు నిరూపించారు. రుక్మిణీ కల్యాణ ఘట్టంలో పై విషయాలు మరింత స్పష్టంగా గోచరమవుతాయి.రుక్మిణీదేవి శ్రీకృష్ణుణ్ని వలచింది. ఆ వలపును పండించుకోవడానికి ఆమె చూపిన తెగువ అన్ని కాలాల ప్రేమికులకూ ఆదర్శప్రాయం. త్వరగా నిర్ణయం తీసుకోవడం, అంతలోనే ఒక నిశ్చయానికి రావడం, వచ్చిన వెంటనే అమలు పరచకుండా ‘ఎందుకైనా మంచిది’ అంటూ మళ్ళీ మరోసారి ముందు వెనకలుగా ఆలోచించడం పురుషుడి లక్షణం. దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది స్త్రీల లక్షణం. ఒక పట్టాన నిర్ణయానికి రారు. వచ్చిన తరవాత వెనుతిరిగి చూడరు. వారు తీసుకునే నిర్ణయంలోని గాఢత, స్పష్టత అలాంటిది.ఆ ఘట్టంలో ఆమె కృష్ణుడికి పంపిన సందేశంలో ‘ముకుందా! గుణవతి, స్థిరచిత్త అయిన ఏ స్త్రీ అయినా గుణం, రూపం, శీలం, విద్య, వయసు, ధనం, తేజస్సుల చేత శ్రేష్ఠుడైనవాడినే భర్తగా కోరుకుంటుంది. అందులో నీకు నీవే సాటి అయిన నిన్ను తప్ప ఇతరులను నేను కోరుకోకపోవడంలో తప్పులేదని నా భావన’ అని పేర్కొంది.  రుక్మిణి అనే పదానికి ‘ప్రకృతి’ అనేది ఒక అర్థం. ప్రకృతి పురుషుడి ఆలంబన వల్ల, పురుషుడు ప్రకృతి ప్రేరణ వల్ల ఒకరికొకరు రాణిస్తారు. కృష్ణుడు పూర్ణ (పురాణ) పురుషుడు, రుక్మిణి ప్రకృతి. వారు ఒకర్నొకరు చూసుకోకపోయినా గుణాలు వినడం వల్లనే గాఢంగా ప్రేమించుకుని పెళ్ళి చేసుకోవాలనే గాఢవాంఛ కలవారయ్యారు. సాధకుడు భగవంతుణ్ని చేరాలని ఎంత గాఢంగా ప్రయత్నిస్తే అతడి ఇష్టాన్ని కాదనలేక భగవంతుడు అతడికి అంత తొందరగా వశమైపోతాడనేది దీని భావం. జీవులతో పరమాత్మకు గల సంబంధం అంత గాఢమైంది.రుక్మిణి సాధకుడిలోని జీవ చైతన్యానికి సంకేతం. కృష్ణుడు పరమాత్మ తత్వానికి ప్రతీక. జీవతత్త్వం, పరమాత్మ తత్త్వం ఒకదాన్ని మరొకటి విడిచి వేరుగా ఉండనివని, రెండింటికీ అనుసంధానంగా ఉండేది ఒక్క ప్రేమ తత్త్వమేననీ రుక్మిణీ కృష్ణుల పరిణయాసక్తికి అర్థం.  

మనో వైకల్యం

ఒక రాజ్యం లో ఒక రాజు ఉండేవాడు అతనికి ఒక కాలు, ఒక కన్ను మాత్రమే వున్నాయి. కానీ ఆ రాజు చాలా తెలివైనవాడు మరియు ధైర్య వంతుడు కాబట్టి ఆ రాజ్యంలోని ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఒకసారి రాజుకు తన  బొమ్మను గీయించాలని  ఎందుకో  ఆలోచన వచ్చింది. అప్పుడా రాజు దేశ విదేశాల నుండి చిత్రకారులను పిలిపించాడు. ఒకరికి మించిన ఒకరు చిత్ర కారులు రాజసభ ముందు హాజరు అయ్యారు. రాజు అందరికి నమస్కరించి వారందరికి తన అందమైన  బొమ్మను గీయాలని కోరాడు దానిని రాజదర్బార్ లో  ఏర్పాటు చేయాలనుకున్నట్లు చెప్పాడు. చిత్రకారులందరూ  ఆలోచించడం మొదలు పెట్టారు, రాజు మొదటి నుంచి వికలాంగుడు కదా, అలాంటప్పుడు అతని చిత్రాన్ని అందంగా గీయడం ఎలా ? ఇది సాధ్యం కానే కాదు మరియు చిత్రం అందంగా లేకపోతే రాజుకు కోపం వచ్చి శిక్షిస్తారు అని అలోచించి అక్కడున్న చిత్రకారులు  అందరూ కూడబలుక్కొని రాజు బొమ్మను గీయడానికి  నిరాకరించారు. అంతే కాకుండా రాజు అంగ వైకల్యాన్ని ప్రస్తావిస్తూ పుట్టుకతో రాని అందం బొమ్మలో ఎలా వస్తుంది, కుంటి రాజు గుడ్డి కన్ను అయినా ఈ రాజుకు అందంగా కనబడాలనే కోరిక ఏమిటో, ఇలా చిత్రకారులని పిలిచి ఇబ్బంది పెట్టేకన్నా తనను వైకల్యంతో పుట్టించిన దేవుణ్ణి అడగాల్సింది అంటూ వారిలో వారు గుసగుసలు పోతూ పైకి అచేతనంగా మా వల్ల కాదు ప్రభూ అంటూ పక్కకు తప్పుకున్నారు, కానీ ఆ చిత్రకారుల సమూహంలోని ఒక యువ చిత్రకారుడు మాత్రం తాను రాజు గారి బొమ్మను అత్యంత అద్భుతంగా గీస్తానని,  వెనుక నుండి చేయి పైకెత్తి, రాజా నేను మీ బొమ్మను చాలా  అందంగా గీయగలను మీకు చాలా నచ్చుతుంది అన్నాడు. అది విన్న మిగతా చిత్రకారులు ఈ పిల్లకాకి చిత్రకారునికి రాజు చేతిలో శిక్ష ఖాయం అనుకుని లోలోపల సంతసిస్తూ, పైకి అతన్ని చాటుగా వారిస్తూ ఏమి జరుగునో అని కుతూహలంతో చూస్తున్నారు, అప్పుడు చిత్రకారుడు రాజు ఆదేశాలతో చిత్రాన్ని గీయడంలో నిమగ్నమయ్యాడు . కొంత సేపటి తరువాత ఒక చిత్రాన్ని గీశాడు. రాజు ఆ  చిత్రాన్ని చూసి  చాలా సంతోషపడ్డాడు. కానీ చిత్రకారులందరూ ఆశ్చర్యపోతూ ఎలా గీశాడా అని ఉత్సుకతతో వారి వేలిని వారి దంతాల క్రింద నొక్కి పెట్టి యువకుడు గీసిన చిత్రాన్ని చూస్తూనే, ఆ యువకుని సమయస్ఫూర్తికి తెలివితేటలకు ఆశ్చర్యంతో మ్రాన్పడిపోయారు. ఆ చిత్రకారుడు ఆ చిత్రాన్ని  రాజు గుర్రంపై ఒక కాలు పూర్తిగా కనిపించే విధంగా కూర్చున్నాడు, మరియు ఇంకో కాలు గుర్రానికి అవతలి వైపు ఉంది, మరియు రాజుగారి జులపాల జుట్టు గాలికి ఎగురుతూ రాజు కంటిపైన కప్పబడినట్లు  ఉంది! పక్కన చెట్లన్నీ రాజుకు వ్యతిరేక దిశలో గాలికి వంగి పోతున్నట్టు భ్రమించేలా గీశాడు, రాజు అతని తెలివికి చాలా సంతోషించాడు. ఆ చిత్రకారుడు రాజు యొక్క అంగవైకల్యాన్ని ఎంత తెలివిగా ఒక అందమైన చిత్రంగా గీశాడు. అతని అద్భుతమైన పనితీరును రాజు ఎంతగానో మెచ్చుకుని అతనికి చాలా బహుమతులు మరియు ధనాన్ని  ఇచ్చాడు. కాబట్టి మనం కూడా ఎదుటి వారి  లోపాలను చూడకుండా, వారి యొక్క విశేషతల పైన, వారి మంచితనంపైన  దృష్టి పెట్టాలి. ఈ రోజుల్లో చాలా మంది  ప్రజలు ఎదుటివారి లోపాలను చాలా త్వరగా వెతుకుతారు, మనలో ఎన్ని లోపాలు వున్నా  ఇతరుల లోపాలువెతకడంలో ఎప్పుడూ అత్యంత శ్రద్ధ చూపుతారు. వాళ్ళు ఇలాంటి వారు, అలాంటివారు  అని ప్రచారం చేస్తారు, కానీ వారిలోని గొప్పతనాన్ని మాత్రం పట్టించుకోరు, ప్రతికూల పరిస్థితులలో కూడా మనం సానుకూలంగా ఆలోచించాలి,  మరియు మనకున్న సానుకూల ఆలోచన విధానమే మన సమస్యలన్నింటి నుండి మనల్ని రక్షిస్తుంది..

ఇష్టంతో చేస్తే పని కష్టం కాదు!

ఒక మహారాజు వేటకు వెళ్లి తిరిగి రాజ్యం చేరడం  ఆలస్యం  అవడంతో  దారిలో  ఒక చీరలు  నేసే వారి ఇంట్లో ఆ రాత్రికి  సేద తీరుతాడు  వచ్చింది రాజు అని తెలియక వాళ్ళు అతిథి  మర్యాదలు  చేసారు.అలసిపోయిన  రాజు ఉదయం లేవడం  కాస్త ఆలస్యం  అవడంతో ఆ ఇంటి వాళ్ళు వారి పనుల్లో  వారు ఉన్నారు . రాజు లేవగానే చీర నేసే అతన్ని చూసాడు.  అతడి  చేతికి ఒక తాడు  కట్టి ఉండడం గమనించాడు రాజు వెంటనే ఎందుకు ఈ తాడు అని అడగగా  ఆ వ్యక్తి రాజు అడిగే  ప్రశ్నలన్నిటికీ సమాధానం పని చేస్తూనే  ఇవ్వడం మొదలు పెట్టాడు ఉయ్యాలలో బాబు నిదుర పోతున్నాడు  బాబు కదిలినప్పుడల్లా  ఈ తాడు లాగితే  బాబు నిదుర పోతాడు  అని చెప్పాడు . అతనికి దగ్గరలో  ఒక కట్టె కనిపించింది రాజుకి. అదేందుకు  అని అడిగాడు రాజు .బయట నా భార్య ధాన్యాలను  ఎండబెట్టి  వెళ్ళింది పక్షులేవైనా  వస్తే  ఈ కట్టె కు కట్టిన  నల్లగుడ్డ  ఊపితే  అవి వెళ్లిపోతాయి  అని బదులిచ్చాడు  ఆ వ్యక్తి .ఆ వ్యక్తి నడుముకి గంటలు కట్టుకుని  ఉండడం గమనించాడు రాజు అదెందుకు అని అడిగాడు.అందుకు ఆ వ్యక్తి ఇంట్లో ఎలుకలు  బెడద  ఎక్కువగా ఉంది. అవి  వచ్చినప్పుడు ఈ గంటలు మోగిస్తే వెళ్లిపోతాయి అన్నాడు. ఆ ఇంటి కిటికీలో ఓ నలుగురు  వ్యక్తులు  కనిపించారు రాజుకి.వాళ్ళు ఎవరు అని అడిగారు ? పని చేస్తున్నది నా చేతులే కదండి  నా నోరు ఏ పని చేయట్లేదు  అందుకు నాకు వచ్చిన  కొన్ని పాటలు  వాళ్లకు నేర్పిస్తాను  వాళ్ళు నేర్చుకుంటారు  అని చెప్పాడు . రాజు మళ్ళీ సందేహంగా  ఆలా వాళ్ళు బయట ఉండి నేర్చుకోటం  ఎందుకు ఇంటి లోపలకు రావొచ్చుగా  అని అడిగారు అందుకు ఆ వ్యక్తి నేర్చుకుంటున్నది నోటితోనే...  కాళ్ళు ఊరకనే  ఉంటాయి కదండి!  పాట  నేర్చుకుంటూ  వాళ్ళు కుండలు  తయారు  చేయడానికి మట్టిని  తొక్కుతుంటారు  అని బదులిచ్చాడు . రాజుకి  చాల ఆశ్చర్యం  వేసింది ఒక మనిషి ఒకే సమయంలో ఇన్ని పనులు  చేయగలడా  అని !! అందుకు ఆ చీరలు నేసే వ్యక్తి ఇలా అన్నాడు.ఇంతే కాదండి నా భార్య కాస్త చదువుకున్నది  తాను బయట పనులకు వెళ్లి వస్తుంది వెళ్లే ముందు పలకలో  ఓ పది పదాలు  రాసిపెట్టి  వెళ్తుంది. అన్ని అయ్యాక  అవి నేర్చుకుంటుంటాను  అని బదులిచ్చాడు . రాజుకి నిజంగా చాలా ఆశ్చర్యం  వేసింది ఒక మనిషి ఇష్టపడి చేస్తే ఏ పని కష్టం కాదు అని . సోమరిగా తిరిగేస్తున్న  వ్యక్తులకు ఇటువంటి వారి పరిచయం చాలు ఏదైనా సాధించాలి  అనే పట్టుదల రావటానికి. నేర్చుకోవాలి అనే జిజ్ఞాస, సమయాన్ని సద్వినియోగం చేసుకునే ఆలోచన ఉంటే మనిషికి ఏదైనా సాధ్యమే.

శ్రీరామ రక్ష.. సర్వ జగద్రక్ష

బంటురీతిఁ గొలు వీయవయ్య రామ తుంటవింటివాని మొదలైన మదా దులఁ బట్టి నేలఁ గూలఁజేయు నిజ రోమాంచమనే ఘనకంచుకము రామభక్తుడనే ముద్రబిళ్లయు రామనామ మనే వరఖడ్గము వి రాజిల్లనయ్య త్యాగరాజునికే  రా..మ.. అంటే కేవలం రెండు అక్షరాలు కాదు.. అదో మహాశక్తి మంత్రం. ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముడిని కీర్తిస్తూ భక్తజనం పండుగ జరుపుకునే శుభ తరుణం శ్రీరామనవమి. శ్రీరామ నవమి  రోజున ప్రధానంగా మూడు ఘట్టాలు నిర్వహిస్తారు. శ్రీరామ జననం, సీతారాముల కల్యాణం, శ్రీరామ పట్టాభిషేకం. మన సనాతన ధర్మం, పురాణాలు, జ్యోతిషశాస్త్రం ప్రకారం మహా విష్ణువు ప్రతి అవతారానికి ఒక్కో గ్రహం ప్రామాణికంగా ఉంటుంది.  ఉదాహరణకు.. నారసింహ అవతారం కుజగ్రహాన్ని సూచిస్తుంది. కృష్ణావతారం చంద్రగ్రహాన్ని సూచిస్తుంది. వామన అవతారం గురుగ్రహం; అలాగే, శ్రీరామ అవతారం నవగ్రహాలకు అధిపతి అయిన సూర్యభగవానుడిని సూచిస్తుంది. రామాయణం, జ్యోతిషశాస్త్రం ప్రకారం.. శ్రీరాముడు త్రేతాయుగంలోని గురువారం రోజున చైత్ర శుక్ల నవమినందు కర్కాటక లగ్నంలో జన్మించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముని అవతారంలో రాముడు సూర్యవంశంలో జన్మించడం.. ఆయన జాతకంలో సూర్యుడు మేషంలో ఉచ్ఛక్షేత్రంలో ఉండటం.. ఇవన్నీ ధర్మస్థాపన కోసం రామావతారం ప్రాధాన్యతను తెలుపుతున్నాయి. మనిషి జీవితంలో ఎలా నడుచుకోవాలి? ఎలా ప్రవర్తించాలి? ఎలా ఉండాలనే అంశాలు రామాయణం ద్వారా  తెలుసుకుంటారు. శ్రీరామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలన, ఉత్తమ రాజు లక్షణం, ఉత్తమ సోదరుడి  కర్తవ్యం.. ఇలా అనేక విషయాలన్నీ రామ అవతారంలో చూసి నేర్చుకోవాల్సిన గొప్ప సుగుణాలు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన శ్రీరాముడిని సనాతన ధర్మంలో పూజించడం వల్ల విజయాలు కలుగుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి.  శ్రీరామనవమి రోజు ఏ వ్రతం చేసినా ఫలించదని, కేవలం శ్రీరామవ్రతం మాత్రమే ఫలిస్తుందని, ఈ వ్రతానికి మించినది లేదని పెద్దల వాక్కు. రామాయణంలో రామచంద్రమూర్తికి వశిష్ట మహర్షి పేరు పెట్టారు. రామాయణం ప్రకారం.. రామ రహస్యోపనిషత్తు ప్రకారం రామ నామానికి అనేక రకాలైన అర్థాలు ఉన్నాయి. అందులో రమంతే యోగినో యత్ర రామ అని ఒక అర్థం. అనగా.. యోగీశ్వరులు ఏ భగవంతుని యందు ఆస్వాదన చెందుతారో అతనే రాముడు అని అర్థం; రామ అనే దానికి అర్థం రాక్షస యేన మరణం యాంతి -రామ. అంటే ఎవరిచే రాక్షసులు మరణించెదురో అతడే రాముడు అని. శ్రీరామ నవమి రోజు రామనామస్మరణం చేయడం అనేక రెట్ల పుణ్యఫలం. రామ నామమును తారకమంత్రమని, తారకమంత్రమంటే తేలికగా దాటించేది అని అర్థం. ఏ మంత్రము చెప్పినా దానిముందు ఓం అని.. తర్వాత నమః అని కచ్చితంగా వాడాలి. కానీ రామ నామానికి రామ అనే మంత్రానికి ఇవి వాడాల్సిన అవసరం లేదు. శ్రీరామ, శ్రీరామ అనుకుంటూనే విష్ణులోకాన్ని పొందవచ్చని పురాణాలు తెలుపుతున్నాయి. పూర్వం శివుడు పార్వతీదేవికి శ్రీరామ నామ గొప్పతానాన్ని తెలియజేస్తూ.. శ్రీరామ రామరామేతి  రమే రామే మనోరమే  సహస్ర నామ తత్తుల్యం  రామ నామ వరాననే  అనే శ్లోకాన్ని పార్వతీదేవికి తెలియజేశాడు. విష్ణు సహస్రనామం పారాయణం తర్వాత ఈ శ్లోకంతోనే దాన్ని ముగిస్తారు. శ్రీరామ.. శ్రీరామ.. శ్రీరామ అని మూడు సార్లు అంటే ఇందులోనే వెయ్యి నామాలు ఉన్నాయని.. సకలదేవతలూ ఇందులోనే ఉన్నారని శివుడు పార్వతికి తెలియజేసినట్టు పురాణాలు చెబుతున్నాయి. శ్రీరామ నవమి పండుగ ఉగాది పండుగ తరువాత వచ్చే అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగ. ఉగాదితో నూతన సంవత్సరం ఆరంభం అయితే శ్రీరామనవమి పండుగ ఉగాది పండుగ తరువాత వచ్చే అత్యంత పర్వదినం. రామయ్య జన్మించిన అభిజిత్ ముహూర్తం అంటే.. ఐదు గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉండగా, చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథినాడు మధ్యాహ్నం వేళ రాముడు జన్మించాడు. దశరథ రాముడు, సకల కళా గుణాభిరాముడు అయిన శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల సమయంలో అంటే మిట్టమధ్యాహ్నాం త్రేతాయుగంలో జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి.  ఒకే బాణం, ఒకే భార్య అనేది శ్రీరాముడి సుగుణం. రామబాణానికి ఉన్న శక్తి అటువంటిది. ‘నవమి’ శ్రీరాముడి జీవితంలో ముఖ్య ఘట్టాలన్నీ నవమి రోజునే జరిగాయి. నవ అంటే తొమ్మిది. సాధారణంగా సామాన్యులు నవమి అంటే భయపడతారు. కానీ శ్రీరాముడికి నవమితోనే ఆయన జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు జరిగాయి. శ్రీమహా విష్ణువు ఏడో అవతారంగా శ్రీరాముడిని భావిస్తారు. శ్రీరామాయణం ఆది కావ్యం. మధురమైన కథ. ఎన్నిసార్లు రామాయణం చదివినా, విన్నా కొత్తగా అనిపిస్తుంది. రామాయణం చదువుతున్నప్పుడు ఆ వ్యక్తులందరూ సజీవంగా కదులుతున్నట్లు అనిపించే అద్భుతరచన. శ్రీరామాయణం ఇతిహాసం. యథార్థమైన గాథ. రామచంద్రమూర్తి అవతారం పరమసత్యం. రామ స్పర్శలేని విషయం ఉండదు. ఏదైనా రాస్తే ‘శ్రీరామా’ అని రాసి మొదలు పెడతాం. చంటి పిల్లాడికి స్నానం చేయిస్తే, పాత్రలో మిగిలిన నీళ్లతో ‘శ్రీరామరక్ష.. నూరేళ్ల ఆయుష్షు’ అని తల్లి అంటుంది. గోరుముద్దలు తినిపిస్తూ రామకథ చెబుతుంది. ఇంట్లో ఎవరైనా వృద్ధిలోకి రావాలనుకుంటే రామచంద్రమూర్తి అంతటి వాడివి కావాలని ఆశీర్వదిస్తారు. ఎవరైనా అసూయతో ప్రవర్తిస్తే ‘శూర్పణఖ’ బుద్ధి అంటారు. అహంకారంతో ప్రవర్తిస్తే, ‘రావణ అహంకారం పనికిరాదు’ అంటారు. ఎక్కువగా నిద్రపోతే ‘కుంభకర్ణుడిలా ఆ నిద్ర ఏంటి’ అంటారు. ఇలా సమాజం నుంచి విడదీయరాని బంధం శ్రీరామాయణంతో ఏర్పడింది. ఈ ప్రపంచంలో మంచి గుణములు కలిగిన మానవుడు ఎవరు? అని నారద మహర్షిని వాల్మీకి మహర్షి ప్రశ్న వేసినప్పుడు ‘పదహారు గుణములు కలిగిన పరిపూర్ణమైన మానవుడు రామచంద్రమూర్తి’ అని నిర్ధారించాడు. మనుష్య జీవితంతో శ్రీరాముడి జీవితం మమేకమైపోయింది. ఆయన మానవుడిగా పుట్టాడు.. మానవుడిగా పెరిగాడు.. మానవుడు పడిన కష్టాలను పడ్డాడు. మానవుడిగానే అవతారం పరిసమాప్తి చేశాడు. ఆయన సత్యముతో లోకాలను, ధర్మంతో సమస్తాన్ని, శుశ్రూషలతో గురువులను, దాన గుణముతో దీనులను గెలిచాడు. అలాగే, తన పౌరుష పరాక్రమములతో శత్రువులను గెలిచాడు. పరిపూర్ణమైన మానవ అవతారమే రామావతారం. 

కరుణ వీర రస సమన్వయం శ్రీరామ తత్వం

శ్రీరామకథను మూడు దృక్కోణాలతో దర్శించి, ఆరాధించడం భారతీయ సంప్రదాయం. ఒకటి - ధార్మిక దృష్టి, రెండు- ఉపాసనాదృష్టి, మూడు తాత్త్విక దృష్టి.ఈ మూడింటి భావాలతో శ్రీరాముని అవతార కార్యం నడిచింది.  మానవ జీవన సరళిని మహోన్నతంగా మలచే 'ధార్మికత', మంత్రమయ భక్తి భావనతో పునీతులను చేసే 'ఉపాసనారీతి', పరమార్ధ తత్త్వాన్ని పట్టిచ్చే 'తాత్త్వికత'లు శ్రీరామునిలో మూర్తీభవించాయి. రమణీయమైన ఒక దివ్యత్వం రాముడై, లోకాలకు "భద్రా"న్ని (క్షేమాన్ని) కలిగించడం చేత “రామభద్రు"డై, ప్రసన్న గుణాలతో ఆనందశాంతులను అందించడంచేత “రామ చంద్రు”డై పరిపూర్ణతత్త్వం “రామ, రామభద్ర, రామచంద్ర" స్వరూపమయ్యింది.  వ్యక్తి సాధించవలసిన అనేక ధర్మాల్లో ఒక్కొక్క సందర్భంలో పరస్పర ఘర్షణ ఏర్పడుతుంది. ఒక ధర్మాన్ని నిలిపేటప్పుడు, మరో ధర్మం దెబ్బతినే పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో ఒకదాన్ని మరోదానితో ఎలా సమన్వయించాలి, దేనికి ఎంత ప్రాధాన్యమివ్వాలి? అనేది 'సూక్ష్మధర్మం'. అది తెలియడమే ధర్మసూక్ష్మం.ఆ సూక్ష్మజ్ఞానమే రాముడి వ్యక్తిత్వం.  పాలనా ధర్మరక్షణ, వ్యక్తిగత కుటుంబ ధర్మనిర్వహణ... రెండింటికీ పొంతన కుదరనప్పుడు దేనికీ విఘాతం కలగకుండా కాపాడిన రాముడు... దశరథ రామునిగా, సీతా రామునిగా, అయోధ్య రామునిగా విజయశీల వ్యక్తిత్వాన్ని ప్రతిష్ఠించాడు.  శ్రీరాముడు కౌమారదశనుండే తన రక్షణ స్వభావాన్ని ప్రకటించాడు. అధర్మాన్ని శిక్షించడంలో కాఠిన్యం, ధర్మ రక్షణలో కారుణ్యం...  ఈ రెండింటి పొందిక శ్రీరాముడిలోని కరుణ వీర రస సమన్వయం. ప్రసన్న, ప్రతాపమూర్తిమత్వం.  యువరాజయ్యే అర్హత కలిగిన వయస్సులోనే శ్రీరాముని దివ్యగుణాలకు అయోధ్య వాసులు ఆకర్షితులుయ్యారు. ఆరాధించారు. ఆ దశలోనే రామచంద్రుడు వారి బాగోగులను గమనించడం, తండ్రి తనయులను ఆదరించినట్లుగా మన్నించడం... ఇవన్నీ ఉత్తమ పాలక స్వభావాలను స్పష్టం చేశాయి. ఒకవైపు పూర్వీకులనుండి అనుసరిస్తున్న పటిష్టమైన ధర్మపరంపరకు రాముని ప్రత్యేకత తోడయ్యింది.  ముఖ్యంగా రామకథను పరిశీలిస్తుంటే అయోధ్యతో రామునకు, రామునితో అయోధ్యకు ఉన్న ప్రగాఢాత్మీయబంధం సుందరంగా గోచరిస్తుంది.  బాల్యం నుండి రాముని పట్ల అయోధ్యకు ప్రేమ. యుక్తవయసు రాగానే వ్యవహారంగా దశరథుడు పాలకుడైనా, ప్రజల మనసుకు మాత్రం రాముడే ప్రభువు. అది గమనించే దశరథుడు యువరాజ పట్టాభిషేకానికి నిర్ణయించుకున్నాడు.  జగద్రక్షణకై, వనవాసం నెపంతో రాముడు రాజ్యాన్ని త్యజించాడు. ఆ సమయంలో అయోధ్య కన్నీరు మున్నీరయ్యింది. రాముని వదలలేక అయోధ్యలో అనేక మంది ఆయన వెంటవెళ్లారు. వెళ్లే అవకాశం లేనివారు కేవలం శరీరాలే అక్కడ మిగిలినట్లయ్యారు. చిత్రమేమిటంటే - అయోధ్యలోని మానవులే కాదు పశు పక్ష్యాదులు, వృక్షలతాదులు కూడా దుఃఖించాయట.  "దూడలు పాలు తాగడం లేదు. అవి పాలు తాగలేదని కూడా గోవులు గమనించలేదు. అప్పుడే తొలి బిడ్డను ప్రసవించిన తల్లి, తన ప్రథమ మాతృత్వపు మాధుర్యాన్ని కూడా అనుభవించడం లేదు. అన్నం పెట్టమని పిల్లలు అడగడం లేదు. తినమని పెద్దలు చెప్పడం లేదు" అని వర్ణించాడు వాల్మీకి. రామునితో వెళ్ళిన వారిని కూడా, రాముడు విడిచి వెళ్ళాక, వారు చేసేదేమీ లేక వెనుదిరిగారు. వెనక్కివచ్చిన వారితో ఇంటి వారంతా "రాముని వదలి, రాముడులేని రాజ్యంలో ఏం సాధిద్దామని వచ్చారు?" అని వాపోయారు.   “అయోధ్యలో చరితార్థుడైన సత్పురుషుడు లక్ష్మణుడు మాత్రమే. అతడొక్కడే రామునితో వెళ్లాడు. రాముని వదలనివారే సత్పురుషులు” అని తీర్మానించుకున్నారు.  బీడుపడ్డట్టుగా అయింది అయోధ్య.  శ్రీరాముని తిరిగి అయోధ్యకు రప్పించి రాజ్యాన్ని అప్పగించాలనుకున్న తన ప్రయత్నాలు వ్యర్థమయ్యాక, పాదుకలు తీసుకుని అయోధ్యకు చేరాడు భరతుడు. కానీ రాముని తప్ప ఏ ఒక్కరినీ ప్రభువుగా అంగీకరించలేని అయోధ్య, శ్మశానసదృశంగా గోచరించడంతో, భరతుడు అయోధ్యను వీడి నందిగ్రామంలో పాదుకాపట్టాభిషేకం చేశాడు. అక్కడినుంచే అయోధ్యను పాలించాడు. తిరిగి రాముడు వచ్చాకే అయోధ్యకు కళ వచ్చింది. రాముని పాలనలో అయోధ్య ధర్మరాజ్యం మాత్రమే కాక, 'రామ ప్రేమ రాజ్య'మయ్యింది. రామభక్తి సామ్రాజ్యమయ్యింది.  వ్రేపల్లే వాసుల కృష్ణ ప్రేమకు, అయోధ్యవాసుల రామప్రేమ ఏ మాత్రం తీసిపోదు.   రామపాలనలో జనులంతా రామమయులయ్యారు. “రామ భూతం జగద భూత్"... అంటాడు వాల్మీకి. అయోధ్య ప్రజలకు “అంతా రామమయ”మయింది. వారి మాటల్లో తొంభై తొమ్మిది శాతం రామనామమే. రాముని కబుర్లే. "నిరంతరం రాము దర్శిస్తూ, ప్రజల్లో హింసాప్రవృత్తి నశించింది” అనే అద్భుతమైన మాటను పలికాడు వాల్మీకి.రామచరిత్ర, వ్యక్తిత్వం నిత్యస్మరణగా కలిగిన వారి హృదయంలో హింసా భావనలు, వ్యతిరేక ధోరణులు నశిస్తాయని ఆ ఆదికవి ఉద్దేశం. ఈ ప్రగాఢ ప్రేమబంధం ఫలితంగానే అవతార పరి సమాప్తివేళ, వారందరినీ తనతో పాటుగా పరంధామంలో ప్రవేశింపజేశాడని రామాయణం, ఇతర పురాణాలు పేర్కొన్నాయి.  'అయోధ్య' అంటేనే 'ఇతరులు (శత్రువులు) దెబ్బ తీయలేనిచోటు' అని అర్థం. సాకేతం- అంటే 'జ్ఞానస్థలం' అని ప్రధానార్థం. శ్రీరామచంద్రమూర్తి ఏ హృదయంలో ఉంటాడో వారి జీవితమే రామభక్తి సామ్రాజ్యం.  ఆ మానసంలో దుర్గుణాలనే అంతశ్శత్రువులు ప్రవేశించ లేవు. కనుక అదే 'అయోధ్య'. అది జ్ఞానమయస్థానం కనుక అదే 'సాకేతం'.   అందుకే రామభక్తులు 'రాముని వారము మాకేమి విచారము' (రామదాసు) అని ధీమాగా పలుకుతారు. 'తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు' అని నిర్భయంగా కీర్తిస్తారు. 

బ్రహ్మానందం!

ఏ మానవుడికైనా ఆనందంగా జీవించడమే.  అలా భావించడం లక్ష్యం. అయితే అందుకోసం మానవుడు బాహ్యప్రపంచంలో వస్తువులలో దేహేంద్రియాలలో వెతుకుతున్నాడు. తాత్కాలిక సుఖాలు, సంపదలతోనే అనందం ఉందన్న భ్రాంతిలో బతికేస్తున్నాడు. అవే శాశ్వతం అనుకుంటున్నాడు.  అసలు సమస్య మానవుడిలోనే ఉంది.  శాశ్వతమైన  ఆనందం అనేది ఎక్కడో లేదు. ఆనందం సహజంగా లభించాలంటే  నిత్యము, శాశ్వతము, చైతన్యవంతము, సత్యము, సహజమైన ప్రతి జీవిలోనూ ఉంది.  దాని గుర్తించి అందుకు అనుగుణంగా జీవించడమే నిజమైన ఆనందం.  ఉన్నది ఒక్కటే, అదే స్వరూప ఆనందం! అదే సచ్చిదానందం!  అదే బ్రహ్మానందం! అదే శాశ్వతమైన ఆనందం. మనస్సు అంతర్ముఖం అయినప్పుడే దాన్ని గ్రహించగలం, అందుకోగలం. మనిషి శుద్దత్వంతో జన్మిస్తాడు. సహజ సిద్దంగానే చైతన్య స్వరూపుడు. అజ్ఞానంతో (మాయ ప్రభావం వల్ల) తన స్వస్వరూపాన్ని గ్రహించలేక జీవిస్తున్నాడు! కానీ  పుట్టుకతోనే చిత్తశుద్ధి ఉంటే ప్రతి జీవుడు ముక్తుడే.  పరమాత్మ పరిపూర్ణ జ్ఞానం కలవాడు.  జీవుడు పరిమిత జ్ఞానం కలవాడు.  అంటే జడమైన భాగం శరీర రూపంలో ఉంది. పరమాత్మలోని చైతన్యం  జీవాత్మగా ఉంది. ఈ రెండింటి యొక్క మిశ్రమ స్వరూపమే జీవుడు!   పరిమిత జ్ఞానాన్ని పరిపూర్ణ జ్ఞానంగా మార్చుకోవాలి! బహిర్ముఖంగా ఉన్న మనస్సుతో శాశ్వతమైన ఆనందం కోసం అంతర్ముఖంగా అన్వేషణ చేయాలి. ఎప్పుడైతే మనస్సు అంతర్ముఖం అవుతుంతో, అప్పుడు మానవుడు తనకు  తెలీనీ  ఎన్నో రహస్యాలను గ్రహించగలడు. సూక్ష్మంలోనే  మోక్షం ఉంది  ఒక్కసారిగా  మనస్సుని  అంతర్ముఖం  చేయాలంటే  చాలా కష్టం.  దానికి కఠోర  సాధన  చేయాలి.  చైతన్యవంతమైన జ్ఞానంతో బుద్ధి ద్వారా మనస్సుని అదుపులోకి తెచ్చుకోవచ్చు!      మనస్సును జయించడం జ్ఞానంతోనే సాధ్యము! చంచలమైన మనస్సుని అధీనంలోకి తెచ్చుకోవడానికి ధ్యానం ఒక్కటే మార్గం.  జ్ఞానంతో కూడిన వైరాగ్యంతో నిరంతర  అభ్యాసం ద్వారా మనస్సును స్వాధీనం చేసుకోవచ్చు! మనస్సును ఇంద్రియాలతో జోడించకపోతే, చిత్తవృత్తి నిరోధం కలిగి ఆలోచనలు క్రమేపీ తగ్గి ఆలోచనా రహిత స్థితికి చేరతాడు.  అదే తన స్వస్థితి, ఆత్మస్వరూపము!  అదే బ్రహ్మానందం.