ప్రతిపక్షాలకు చంద్రబాబు కౌంటర్
posted on Aug 15, 2015 @ 11:48AM
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ అటు పార్టీ నేతలనుండి.. ఇటు సామాన్య ప్రజల వరకూ ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. అయితే ఏపీకి ప్రత్యేక హోదా సంగతేమోకాని ఈ విషయాన్ని అడ్డుపెట్టుకొని చంద్రబాబును ఇరుకున పడేద్దామని చూస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీ ప్రతిపక్షాలైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సీపీఐ పార్టీలు ఇదే అదనుగా చంద్రబాబుపై విమర్శల బాణాలు సంధిస్తూ వచ్చారు. అసలు ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా ఎప్పుడు విమర్శలు చేద్దామా అని చూసే జగన్ అయితే ఏకంగా ఢిల్లీలోనే ధర్నా చేపట్టాడు. అయితే ఇప్పుడు వీళ్లందరికి చంద్రబాబు కౌంటర్ ఇచ్చారా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఎందుకంటే మోదీ ప్రత్యేక హోదా పై తనకు ఫోన్ చేశారని ఆగష్ట్ 15 తరువాత ఈ విషయం పై భేటీ అయి చర్చిద్దామని చెప్పినట్టు తెలిపారు. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ చంద్రబాబు భేటీ అయ్యేంత వరకూ ప్రతిపక్షనేతలు ఆగాల్సిందే.
మరోవైపు బీజేపీ మిత్రపక్షమైనప్పటికీ ప్రత్యేకహోదా విషయంపై ఎట్టిపరిస్థితిలోనూ రాజీ పడే ప్రసక్తి లేదని ఈ విషయంలో కూడా చంద్రబాబు వ్యూహాత్మకంగానే వ్యవహరించారని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత ప్రధానిదేనని, విభజన సమస్యలను పరిష్కరించి ఇరుగుపొరుగు రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి అవసరమైన సాయమంతా కేంద్రం చేయాల్సిందేనని ఆయన స్పష్టంగా చెప్పారు. అంతేకాదు ప్రత్యేక హోదా ఒక్కటే చాలదని.. ఏపీకి కావాలసిన అన్ని ప్రయోజనాలు పొందేలా చూసుకోవాలని అని అన్నారు.
దీంతో ప్రస్తుతానికి ప్రతిపక్షాల నేతల నోటికి తాళం పడినట్టయింది. మళ్లీ వాళ్లు ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబుపై విమర్శలు చేయాలంటే మోడీ చంద్రబాబు భేటీ వరకూ ఆగాల్సిందే. అయితే చంద్రబాబు అప్పటికీ ఈ విషయంపై ఒక స్పష్టత తీసుకువస్తారని రాజకీయ నేతలు అనుకుంటున్నారు.