చంద్రబాబు, కేసీఆర్.. ఈసారైనా మాట్లాడుకుంటారా?
posted on Oct 23, 2015 @ 3:55PM
ఎప్పుడూ గిల్లి కజ్జాలాడుకునే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లు ఏదో ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం పుణ్యమా అని కలిశారు. అయితే ఈ కార్యక్రమం ఆద్యాంతం చంద్రబాబు, కేసీఆర్ లు ఎక్కువ మాట్లాడుకోవడానికి అవకాశం కలగలేదు. ఏదో ఒకటీ రెండు సందర్భాల్లో..మోడీకి స్వాగతం పలికే నేపథ్యంలో వెనుక ఉన్నకేసీఆర్ ను చంద్రబాబు ముందుకు లాగడం.. అర్చకులు ఇచ్చే ఆశీర్వాచనాల్లో చంద్రబాబు కేసీఆర్ వైపు చూపించడం లాంటి సందర్భాల్లో తప్ప పెద్దగా మాట్లాడుకున్న దాఖలాలు లేవు. ఇక శంకుస్థాపన కార్యక్రమం అనంతరం ఎవరి దారి వారిది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రులు మళ్లీ ఎప్పుడు కలుస్తారో.. మళ్లీ వారిద్దరిని ఒకే వేదికపై ఎప్పుడూ చూస్తామో అని అనుకుంటున్న నేపథ్యంలో ఈ ఇద్దరు చంద్రులు మళ్లీ కలిసే సమయం కొద్ది గంటల్లోనే ఉందని తెలుస్తోంది. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ప్రతి సంవత్సరం దసరా పండుగ రోజు సందర్బంగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ఆయన రాజకీయ నేతలందరినీ పిలుస్తారు. ఈసారీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు..ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా ఈ కార్యక్రమానికి పిలవడం జరిగింది. దీంతో మరోసారి ఇద్దరూ కలవనున్నారు. మరి ఈసారైనా ఇద్దరూ మాట్లాడుకుంటారో లేదో చూడాలి.