లండన్‌లో చంద్రబాబు దంపతులకు ఘన స్వాగతం
posted on Nov 2, 2025 @ 3:01PM
సీఎం చంద్రబాబు దంపతులు లండన్ చేరుకున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ వెళ్లిన చంద్రబాబు దంపతులకు విమానాశ్రయంలో తెలుగు కుటుంబాలు ఆత్మీయ స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా అక్కడి తెలుగువారితో ముఖ్యమంత్రి ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా నారా భువనేశ్వరి రెండు ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పురస్కారాలను అందుకోనున్నారు. లండన్‌కు చెందిన ప్రఖ్యాత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐఓడీ) సంస్థ ఈ అవార్డులను ప్రకటించింది.
సామాజిక సేవా రంగంలో నారా భువనేశ్వరి అందిస్తున్న విశేష కృషికి గుర్తింపుగా 'డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్' అవార్డును ఆమెకు ప్రదానం చేయనున్నారు. అదేవిధంగా, కార్పొరేట్ పాలనలో అత్యుత్తమ ప్రమాణాలను పాటించినందుకు గాను హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు 'గోల్డెన్ పీకాక్' అవార్డు లభించింది. హెరిటేజ్ ఫుడ్స్ అధినేతగా ఈ పురస్కారాన్ని కూడా నారా భువనేశ్వరి అందుకోనున్నారు. ఎల్లుండి జరగనున్న కార్యక్రమంలో ఆమె ఈ రెండు అవార్డులను అందుకోనున్నారు.