నన్ను ఓడించేందుకు కలిశారు.. నీళ్ల కోసం మాట్లాడుకోలేరా!
posted on Jul 14, 2021 @ 4:51PM
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం కొనసాగుతోంది. రెండు ప్రభుత్వాల మధ్య ఆరోపణలు కంటిన్యూ అవుతున్నాయి. తాజాగా తెలంగాణ సర్కార్ పై సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో జల వివాదంపై హాట్ కామెంట్స్ చేశారు తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కృష్ణా నీళ్లపై సమస్య వస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఎందుకు మాట్లాడటం లేదని సీఎం జగన్‌ను ప్రశ్నించారు చంద్రబాబు. ఎన్నికల ముందు తనను ఓడించేందుకు కలిసి పని చేశారు కదా అని వ్యాఖ్యానించారు. గతంలో ఇలాగే సమస్య వస్తే తాను మాట్లాడి పరిష్కరించానని చంద్రబాబు చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని ఆయన సూచించారు.
ఏపీ ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని చంద్రబాబు ఆరోపించారు. చెత్తపై కూడా పన్ను వేసిన చెత్త ప్రభుత్వం ఇదన్నారు. ఢిల్లీ మెడలు వంచుతానని ఢిల్లీ ముందు మెడలు వంచుతున్నారని టీడీపీ అధినేత విమర్శించారు. రైతుల వద్ద పంటలు కొంటూ నెలల కొద్దీ డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. రైతులు తిరగపడితే జగన్ సర్కార్ పారిపోతుందన్నారు. అమ్మిన పంటకు డబ్బులు ఇవ్వమంటే అక్రమ కేసులు పెట్టటమేంటని చంద్రబాబు ప్రశ్నించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని కొంత కాలం మాత్రమే పాలించగలరని... రైతులు తిరగబడితే తట్టుకోలేరని హెచ్చరించారు. పోలీసులు కూడా హుందాగా పని చేయాలని చంద్రబాబు అన్నారు. ఆయనను నమ్ముకున్నోళ్లంతా జైలుకు వెళ్లారని జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆయన కోసం తప్పులు చేస్తే మీ పరిస్థితి కూడా అగమ్యగోచరంగా తయారవుతుందని అన్నారు.కరోనా తీవ్రతలోనూ మద్యం దుకాణాలు తెరిచి చదువు చెప్పే టీచర్లను కాపలాగా పెట్టడం దుర్మార్గమని చంద్రబాబు మండిపడ్డారు.
కరోనా కాలంలో చనిపోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను చంద్రబాబు పరామర్శించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నడకుదిటి నర్సింహారావు కుటుంబసభ్యులను కలుసుకుని ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కరోనా నియంత్రణలో జగన్ సర్కార్ విఫలమైందన్న ఆయన.. టీడీపీ అధికారంలో ఉండి ఉంటే కరోనాని కట్టడి చేసేవాళ్లమన్నారు. ప్రభుత్వ అసమర్థత వల్ల కుటుంబాలకు కుటుంబాలు తుడుచు పెట్టుకుపోయాయి.టీడీపీ హయాంలో ఎన్నో సంక్షోభాలు వచ్చినా, వాటిని సవాలుగా తీసుకుని పని చేశామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. కరోనాని కట్టడి చేయడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని విమర్శించారు. టీడీపీ అధికారంలో ఉంటే కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేవాళ్లమని చెప్పారు.