లెక్కలడుగుతుంటే వెక్కిళ్లు.. జీవీఎల్ ఎంట్రీతో చిక్కులేనా?
posted on Jul 14, 2021 @ 4:42PM
ఎక్కాలు సరిగా రాకపోతే ఈడు జీవితంలో పైకి రాడురా అని సరదాగా పెద్దలనేవాళ్లు. ఇప్పుడు లెక్కలు సరిగా రాకపోతే జీవితం సంగతి తర్వాత.. ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తారనే కామెంట్లు వినపడుతున్నాయి. పయ్యావుల కేశవ్ రాంగోపాల్ వర్మ సీత గురించి మాట్లాడితే.. బుగ్గనగారు వచ్చి బాపూ గారి సీత గురించి చెప్పి వెళ్లిపోయాడనే సెటైర్లు వినిపిస్తున్నాయి. లెక్కలు లేవు సోదరా.. ఆ లెక్కలు చెప్పు సోదరా అని అడితే... నువ్వు అడిగే లెక్కలేమీ లేవు ఇక్కడ అంటూ కొత్త లెక్కలేవో చెప్పి వెళ్లిపోయాడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. పైగా ఆయన సహజ ధోరణికి విరుద్దంగా చాలా కోపంగా, అసహనంగా ప్రెస్ మీట్ లో కనపడ్డారాయన. నువ్వేం చెప్పకపోతే ఎలా అని జగన్ క్లాసు పీకితేనే ప్రెస్ మీట్ పెట్టినట్లు తెలుస్తోంది. అసలు సంగతి తెలుసు కనక.. ఏం చెప్పాలనేదే బుగ్గన ఆవేదన అని కొందరు అనుకుంటున్నారు.
ఇదంతా అక్కా బావ కథే అనుకుంటుంటే..అక్కా బావ ఓ వ్యాంప్ అన్నట్లు కథ మళ్లీ మారిపోయింది. బిజెపి ఎంపీ మిస్టర్ జీవీఎల్ నరసింహారావుగారు ఎంట్రీ ఇచ్చేశారు. టీడీపీ కూడా ఇదే పని చేసింది. అప్పుడు నేను పీడీ అకౌంట్ల గురించి మాట్లాడితే కాదన్నారు.. ఇప్పుడు అదే తప్పు వైసీపీ చేసింది అంటూ వైసీపీ టీడీపీ ఒకటే అనిపించేలా బాస్ స్పీచ్ ఇచ్చేస్తున్నాడు. ఈ ముక్క వైసీపీకి తెలియదా...ఇంతకు ముందు జరిగిందేంటో వారికి తెలియదా..తెలిస్తే ఇన్నాళ్లు ఊరుకునేవాళ్లా..దానిపైనా ఓ సీఐడీ విచారణ చేయకపోతిరా అనే కామెంట్లు కూడా వస్తున్నాయి. అసలు బిజెపి ఎంపీ జీవీఎల్ కు ఆదేశాలు ఢిల్లీ నుంచి వచ్చాయా తాడేపల్లి నుంచి వచ్చాయా అనే అనుమానాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.
అసలేంటి పీడీ అకౌంట్లు? జనానికి అర్ధం కాని సమస్యగా మారాయీ పీడీ అకౌంట్లు. పీడీ అకౌంట్ అంటే పర్సనల్ డిపాజిట్. ఇవి ఆయా డిపార్ట్ మెంట్ల హెడ్స్ పేరుతో ఓపెన్ చేస్తారు. ఇదెలా జరుగుతుందంటే.. సపోజ్ హెల్త్ డిపార్ట్ మెంట్ హెడ్ గా ఒక ఐఎఎస్ రాజుగారు ఉన్నారనుకోండి. ఆయన పేరుతో ఒక పీడీ ఓపెన్ చేస్తారు. ఆయన తన డిపార్ట్ మెంట్ ఖర్చుల కోసం 10 లక్షలు కావాలనుకుంటే ఒక క్రెడిట్ లెటర్ ఇచ్చి..తన పీడీ అకౌంట్లోకి పది లక్షలు వేయించుకుంటారు. 10 లక్షలు ఖర్చుపెడతారు.. ఈ 10 లక్షలకు లెక్కలు సమర్పిస్తారు. లెక్కలు ఓకె అయ్యాక..ఖర్చులు ఖర్చుల్లోకి..ఆ అమౌంట్ మళ్లీ రాజుగారు తిరిగిచ్చేసినట్లు చూపిస్తారు. అంటే పది లక్షలు పీడీ అకౌంట్ కి వెళ్లినట్లు.. మళ్లీ తిరిగొచ్చినట్లు చూపిస్తారు.
అయితే తెలుగుదేశం హయాంలో ఇలాంటి పీడీ అకౌంట్లు మెయిన్ టెయిన్ చేసినప్పుడు.. ఆర్ధిక సంవత్సరం చివరిలో అంటే ఫిబ్రవరి, మార్చిల్లో తీసుకున్న అమౌంట్లకు లెక్కలు ఇంకా అదికారులు సమర్పించని సమయంలో.. జీవీఎల్ వాటిని పాయింట్ అవుట్ చేశారు..వాటికి తర్వాత లెక్కలు సమర్పించబడ్డాయి...బ్యాలెన్స్ చేసేశారు.ఇక్కడ వైసీపీ హయాంలో జరిగింది ఏంటంటే తీసుకున్న అమౌంట్లకు లెక్కలు రెండేళ్లయినా ఇంకా సమర్పించలేదు.అంటే 41 వేలకోట్లు పీడీ అకౌంట్స్ ద్వారా వెళ్లాయి..కాని వాటికి లెక్కలేంటనేది ఇంకా రాలేదు. అవి ఏంటనేది తెలియడం లేదనే కాగ్ చెప్పింది. పయ్యావుల కేశవ్ అందుకే డబ్బులు పోయాయనటంలేదు.. లెక్కలు లేవనే అంటున్నాం అని క్లారిటీగా చెప్పారు.
సరే.. వైసీపీ కూడా లెక్కలు చెప్పేయొచ్చు కదా..ఏంటీ ప్రాబ్లెమ్ అనుకోవచ్చు. వారు పెట్టిన ఖర్చులు రూల్స్ ప్రకారం ఉంటే..వారింతకాలం ఆగాల్సిన అవసరం లేదు. అవి రూల్స్ ప్రకారం కాకుండా.. తమ ప్రాధాన్యతల ప్రకారం ఖర్చులు పెట్టేసుకున్నారు కాబట్టి.. అవి లెక్కలిస్తే.. మళ్లీ అదే కాగ్ తప్పుబడుతుంది..అందుకే దాటవేస్తున్నారనేదే టీడీపీ చెబుతున్న వాదన. ఇప్పుడు పయ్యావుల కేశవ్ అయితే కొత్త పాయింట్ లేవనెత్తారు 25 వేల కోట్ల గ్యారంటీలు దేనికి ఇచ్చింది ప్రభుత్వం? ఏ బ్యాంకుకిచ్చింది? ఎంత రుణం తీసుకున్నారనే లెక్కలు లాగుతున్నారు. అలా అలా చివరికి వైసీపీ ప్రభుత్వం లోగుట్టు మాత్రం పయ్యావులకు ఎరుకే అయ్యేట్లు ఉంది. దీంతో జగన్ దీనిని ఎలా డీల్ చేయాలనేదానిపై తీవ్ర చర్చ చేస్తున్నట్లు తెలుస్తోంది.