చంద్రబాబు.. పవన్ బేటీ.. ఏపీలో రాజకీయ వేడి
posted on Oct 19, 2022 @ 10:18AM
ఒక్క సమావేశం.. ఒకే ఒక్క సమావేశం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలను వేడెక్కించింది. ఔను రాజకీయ ముఖచిత్రం మారిపోతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రకటించిన స్వల్ప వ్యవధిలోనే దాదాపు అలాంటి చిత్రమే ఆవిష్కృతమైంది. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు విజయవాడ నోవాటెల్ లో బస చేసిన పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు.
ఇద్దరూ కలిసి సంయుక్తంగా విలేకరులతో మాట్లాడారు. ఆ తరువాత దాదాపు గంట సేపు ఇరువురూ ముఖాముఖీ భేటీ అయ్యారు. ఇప్పటికే జనసేన, బీజేపీ మిత్రపక్షాలు.. ఇరు పార్టీల మధ్యా పొత్తు ఉంది. అయినా ఈ మూడేళ్లలో ఇరు పార్టీలూ కలిసి పని చేసిన సందర్భాలు పెద్దగా లేవు. కలిసి పోరాటాలు చేసిన సందర్భమూ లేదు. చివరాఖరికి విశాఖపట్నంలో జనవాణి కార్యక్రమం జరిగే అవకాశం లేకుండా అడ్డంకులు సృష్టించిన సందర్భంలోనూ.. పవన్ కు మద్దతుగా బీజేపీ ముందుకు రావడంలో జాప్యం చేసింది. ముందుగా తెలుగుదేశం సంఘీభావం ప్రకటించింది. ఆ తరువాతే బీజేపీ పవన్ కల్యాణ్ కు సంఘీభావం ప్రకటిస్తూ ముందుకు వచ్చింది. సరే ఆ సంగతి పక్కన పెడితే విజయవాడ నోవాటెల్ హోటల్ లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ బేటీ రాష్ట్ర రాజకీయాలలో పొత్తలపై చర్చను మళ్లీ తెరమీదకు తీసుకు వచ్చింది. వీరి భేటీకి ముందు మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో కార్యకర్తలతో సమావేశంలో బీజేపీ విషయంలో తన అసంతృప్తి ఇసుమంతైనా దాచుకోకుండా వ్యక్తం చేశారు.
ఆ తరువాత చంద్రబాబుతో భేటీ కావడంతో ఇరు పార్టీల మధ్య వచ్చే ఎన్నికల నాటికి పొత్తు పొడిచే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన పొత్త ఖాయమనీ, బీజేపీ కలుస్తుందా లేదా అన్నది ఆ పార్టీ తేల్చుకోవలసిన అంశమని అంటున్నారు. అన్నిటికీ మించి గంట సేపు ముఖాముఖీ భేటీలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య చర్చకు వచ్చిన అంశాలేమిటి? పొత్తుల ప్రస్తావన వారి మధ్య వచ్చిందా అన్న విషయంపై రాజకీయ వర్గాలలో తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. పొత్తు ఊహాగానాలకు బలం చేకూర్చే విధంగా వైసీపీ నుంచి ఒంటరి పోరుకు దమ్ముందా? అంటూ ఆవుకథలాంటి విమర్శలు వెల్లువెత్తాయి. కాగా నోవాటెల్ లో చంద్రబాబు పవన్ బేటీ సమయంలో ఓ పది నిముషాల పాటు మాత్రమే నాగబాబు, నాదెండ్ల మనోహర్ ఉన్నారు.
ఆ తరువాత దాదాపు గంట సేపు బాబు, పవన్ కల్యాణ్ ముఖాముఖీ ముచ్చటించుకున్నాయి. కాగా విశ్వసనీయ వర్గాల సమాచారం మేరరు విశాఖలో ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరుపై పవన్ కల్యాణ్ చంద్రబాబుకు వివరించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉమ్మడి వేదిక ఏర్పాటు ఆవశ్యకతపై, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అన్ని పార్టీలనూ ఏకతాటిపైకి తీసుకురావాలని ఒక నిర్ణయానికి వచ్చారు. వామపక్షాలు, బీజేపీలను ఓకే వేదికపైకి తీసుకురావడం ఒకింత కష్టమైనా, రాష్ట్రంలో అరాచక పాలనను ఎదిరించేందుకు అందరినీ కలుపుకుపోవాలని ఇరువురు నాయకులూ అభిప్రాయపడ్డారు.
ఇక వీరి బేటీలో ముందస్తు ఎన్నికల ప్రస్తావన కూడా వచ్చిందని అంటున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం పోరాటాలు చేస్తూనే మరో వైపు ఎన్నికలకూ సిద్ధం కావాల్సిన అవసరం ఉందని ఇరువురూ కూడా తమ సంభాషణలో అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.