రోడ్డు ప్రమాదాల్లో అందరూ సేఫయ్యేలా కొత్త రూల్..
posted on Aug 4, 2021 @ 3:44PM
రోడ్డు ప్రమాదం జరిగితే ఇప్పుడెవరి ప్రాణాలకూ గ్యారెంటీ ఉండటం లేదు. కార్లలోని ఫ్రంట్ సీట్లకు పనికొచ్చేలా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్న కారణంగా డ్రైవర్ తో పాటు ఇవతలి వైపు కూర్చుండేవారికి మాత్రమే రక్షణ లభిస్తోంది. వాళ్లు మాత్రమే స్వల్ప గాయాలతో బయటపడ గలుగుతున్నారు. ఇక మిగతావారి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయి వారి బంధువులకు తీరని విషాదం మిగులుస్తున్నారు. ఎంతో మంది అనాథలుగా మారిపోతున్నారు. కుటుంబాలు వీధిన పడుతున్నాయి. రాన్రానూ ఇదో సామాజిక సమస్యగా మారిందంటే అతిశయోక్తి కాదు.
ఇటీవలే విదేశాల నుంచి వచ్చిన ఓ సాఫ్ట్ వేర్ యువతి బోనాల పండుగ కోసం వచ్చి స్నేహితులతో కలిసి పార్టీ చేసుకొని ఇంటికెళ్లే సమయంలో కారు ప్రమాదానికి గురైంది. అయితే ఆ వేగానికి కారు నాలుగు పల్టీలు కట్టిన దృశ్యం షాకింగ్ గా ఉంది. ఎయిర్ బ్యాగ్స్ కారణంగా డ్రైవర్ స్థానంలో ఉన్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడగా.. వెనుకసీట్లో కూర్చున్న ఈ యువతి కారులోంచి బయటపడి స్పాట్ లోనే చనిపోయింది. ఇకపై అలాంటి కష్టాలకు చెక్ పడబోతోంది. కేంద్ర రోడ్ రవాణా, స్పోర్ట్స్ శాఖా మంత్రి నితిన్ గడ్కరీ చొరవతో ఈ ప్రమాదాలకు చెక్ పడబోతోంది. అన్ని ఫోర్ వీలర్ వాహన కంపెనీలు ఇకపై అన్ని సీట్లకూ ఎయిర్ బ్యాగ్స్ ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఫోర్ వీలర్స్ లో వెనుక ఎంతమంది కూర్చుంటారో అందరికీ కూడా సీట్ బెల్ట్స్ తో పాటు ఎయిర్ బ్యాగ్స్ ఫిక్స్ చేయాలని గడ్కరీ కోరడంతో వివిధ కంపెనీల యాజమాన్యాలు కూడా అందుకు సుముఖత వ్యక్తం చేయడం విశేషం. ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ విచ్చుకొని శరీరం కారు బాడీకి తగలకుండా రక్షణగా ఉంటుంది. అయితే ప్రయాణికులు ఎయిర్ బ్యాగ్ వల్ల కూడా ఇంజ్యురీస్ కాకుండా సీట్ బెల్ట్స్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఇప్పటికైతే రోడ్డు ప్రమాదాల్లో ఎంతమంది చనిపోయారనే లెక్క మీద అంచనాలున్నాయి కానీ.. ఎయిర్ బ్యాగ్స్ లేకపోవడం వల్ల ఎంతమంది చనిపోయారనే విషయంలో లెక్కాపత్రం లేదు. మొత్తానికి ఈ చర్యతో వాహన ప్రమాదాల కారణంగా సంభవించే మరణాలు తగ్గుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు వాహన తయారీ సంస్థలు ఫ్లెక్సీ ఫ్యూయల్ వాడేలా ఇంజన్లు రూపొందించాలని కూడా గడ్కరీ కోరడం విశేషం. పెట్రోల్, డీజిల్ తో పాటు ఇథనాల్, గ్యాసోలిన్ వంటి ఇంధనాలు కూడా ఇంజిన్లు ఉపయోగించుకునేలా రూపొందించాలనేది ప్రభుత్వం ఉద్దేశం. దీనివల్ల పెట్రో ఉత్పత్తుల దిగుమతి కోసం ఆధారపడటం క్రమంగా తగ్గుతుంది. అయితే 2027 నాటికి ఇంజిన్లలో అలాంటి మార్పులు తేవడానికి సాధ్యమవుతుందని వాహన కంపెనీల యాజమాన్యాలు చెబుతున్నాయి.