అమరావతి ప్రాంతంలో చంద్రబాబు పర్యటన ఎప్పుడంటే?
posted on Jun 19, 2024 @ 4:31PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జగన్ హయాంలో సర్వ విధాలా భ్రష్టుపట్టిపోయింది. రాజధాని లేని రాష్ట్రంగా అవహేళనలు ఎదుర్కొంది. అభివృద్ధి అడుగంటి పోయింది. అరచకం రాజ్యమేలింది. జగన్ ప్రభుత్వ పతనం తరువాత అన్ని విధాలుగా వెనుకబడిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధి బాట పట్టించి, అదే సమయంలో ప్రజా సంక్షేమానికీ ప్రథమ ప్రాధాన్యత ఇచ్చే గురుతర బాధ్యత ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన చంద్రబాబుపై పడింది.
ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు నుంచే అంటే ఎన్నికల ఫలితాలు వెలువడిన క్షణం నుంచే పని మొదలు పెట్టేశారు. అవినీతి అధికారులను తప్పించడం దగ్గర నుంచి ఏయే రంగాల్లో ఏయే పనులు జరగాలన్నదానిపై ఒక స్పష్టమైన విజన్ తో ముందుకు కదులుతున్నారు. ఈ క్రమంలో ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తన ప్రాధాన్యతలు ఏమిటన్నది విస్పష్టంగా చాటుతున్నారు. ప్రధానంగా పోలవరం, అమరావతి నిర్మాణాలపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. సీఎంగా తన తొలి అధికారిక పర్యటన పోలవరం నుంచే మొదలు పెట్టారు. ఇక ఆ తరువాత అమరావతి నిర్మాణం. సీఎంగా ఆయన రెండో పర్యటన అమరావతి ప్రాంతంలోనే చేయనున్నారు. గురువారం (జూన్ 20) చంద్రబాబు అమరావతి ప్రాంతంలో పర్యటించనున్నారు.
నాడు జగన్ ప్రభుత్వం తన విధ్వంస పాలన ఆరంభించిన చోట నుంచే చంద్రబాబు తన పర్యటన మొదలు పెడుతున్నారు. ఉండవల్లిలోని ప్రజా వేదిక కూల్చివేతలో జగన్ తన విధ్వంస పాలనకు శ్రీకాం చుట్టారు. ఇప్పుడు ఆ ప్రజావేదిక శిధిలాల పరిశీలనతోనే జగన్ తన పర్యటన ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి ఆయన అమరావతి ప్రాంతాలలోని నిర్మాణాల పరిశీలనకు బయలుదేరుతారు. జగన్ నిర్వాకం కారణంగా అమరావతి విధ్వంసం ఏ స్లాయిలో ఉందో పరిశీలిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఉద్దండరాయుని పాలెంలో 2015 అక్టోబర్ 22న రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రదేశాన్ని పరిశీలిస్తారు. అక్కడ నుంచి సీడీయాక్సిస్ రోడ్, ఆలిండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను పరిశీలిస్తారు. ఇకానిక్ నిర్మానాల కోసం కేటాయించి పనులు ప్రారంభించిన ప్రదేశాలను చంద్రబాబు పరిశీలించనున్నారు.
ఐదేళ్ల జగన్ పాలనలో రాజధాని పనులను నిలిపివేసి, నిర్మాణం పూర్తైన, నిర్మాణంలో ఉన్న భవనాలను పాడుబెట్టేసిన సంగతి తెలిసిందే. దాదాపు 80శాతం పూర్తైన భవనాలను సైతం జగన్ సర్కార్ అలాగే వదిలేసింది. గతంలో విపక్ష నేతగా చంద్రబాబు అమరావతి పర్యటనను జగన్ సర్కార్ అడ్డుకుంది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆ ప్రాంతంలో పర్యటించి జగన్ విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందో పరిశీలించనున్నారు.