బడాయి బాబూ.. ఏంటీ డాబు?
posted on Sep 9, 2025 @ 10:53AM
రీసెంట్ గా చంద్రబాబు పదే పదే చెబుతున్న పీపీపీ విధానం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. మరీ ముఖ్యంగా మెడికల్ కాలేజీల వ్యవహారంలో ప్రైవేటు భాగస్వామ్యం మీద భారీ ఎత్తున చర్చ నడుస్తోంది. అయినా ప్రభుత్వం కాలేజీ కట్టాల్సిందంతా కట్టి ప్రైవేటు పరం చేయడమేంటన్నదొక చర్చ. గతంలో ప్రస్తుతం ఆరోగ్య శ్రీ మాత్రం ప్రైవేటు కార్పొరేటు ఆస్పత్రులను ఎంకరేజ్ చేయడం కాదా? అన్నది బాబు ప్రభుత్వ వాదన. అంతా ప్రభుత్వమే నడిపిస్తే తడిసి మోపెడవుతుంది కాబట్టి ఇదే కరెక్ట్ అన్నది వీరి కామెంట్. ఇదెలా ఉన్నా.. ఇలా ప్రతిదీ ప్రైవేటు పరం చేయడం వల్ల చివరికి ప్రభుత్వం కన్నా ప్రైవేటే మిగలదా? అన్న మాట ఎక్కువగా వినిపిస్తోంది.
ఇక పీ4. దీనిపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్. ఇదైతే ఆయన అనుకూల మీడియా కూడా విరుచుకుపడేంత విమర్శనాత్మకంగా మారింది. పీ4 ద్వారా పేదరిక నిర్మూలన సాధ్యమేనా? అసలు జీరో పావర్టీ అంటూ ఒకటి ఉంటుందా? ఒక వేళ ఉంటే ఆ సమాజం ఎలా ఉండబోతోంది? ఇప్పటికే అలివి కాని హామీలిచ్చారన్న మాట ఉండనే ఉంది. పీ 4 ద్వారా బాబు పేదరికం నిర్మూలిస్తున్నారా? లేక ఇందులోకి వచ్చే బడాబాబుల జేబులు తడిపేలా మరేదైనా పథక రచన చేశారా? అన్నది కూడా చర్చనీయాంశమే. ఎవరు సంపన్నులు కావడానికి ఈ పేదరిక నిర్మూలనా పథకం? అర్ధం కావడం లేదంటారు కొందరు. ఇప్పటికే వైసీపీ ఈ దిశగా తన విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టినట్టు కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. స్త్రీ శక్తి పథకం. ఇదైతే.. కూటమి ప్రభుత్వాన్ని భారీ ఎత్తున ఇరుకున పడేస్తోంది. మొన్న విజయనగరంలో ఆటో డ్రైవర్లు ర్యాలీ తీస్తే.. నిన్న పిఠాపురంలో ఆటో డ్రైవర్లు యాచన చేస్తూ ఈ పథకం పట్ల తమ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఫ్రీ బస్సు అవసరమా? ఫ్రీ వైద్యం విద్య అవసరమా? తేల్చుకోవాలంటూ.. ప్రభుత్వంపై ఇప్పటికే విరుచుకుపడుతున్నారు కొందరు. వికలాంగులకు కూడా ఫించన్లు తొలగిస్తున్నారంటూ మరొక గొడవ. ఇంత పెద్ద ఎత్తున ఫించన్లు అమలు చేయడం ఎందుకు? వాటిని ఇవ్వలేక పోవడం ఎందుకన్నది ఒక వాదన. ఇదిలా ఉంటే నెల నెలా బాబు ఫించన్ల పేరిట చేస్తున్న హైడ్రామా.. ఆయన పబ్లిసిటీ మోజు ఎక్కువైందన్న కామెంట్ వినవస్తోంది. ఇప్పటికే గత గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన తొక్కిసలాటలో 29 మంది మరణించడానికి కారణం.. ఆయన పబ్లిసిటీ కోసం పెట్టుకున్న షూటింగ్ కారణంగా భక్తులను ఘాట్ లోకి స్నానానికి అనుమతించకుండా నిలువరించడమేనన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడీ ప్రచార మోజు అంత అవసరమా అన్ని విమర్శలు వినిపిస్తున్నాయి.
సూపర్ సిక్స్- సూపర్ హిట్ అంటూ చేస్తున్న హంగామా సైతం విమర్శలకు దారి తీస్తోంది. పథకాలు ఇచ్చామంటే ఇచ్చాశామన్నది ముఖ్యం కాదు. దాన్నెంత సవ్యంగా అందరికీ అందేలా ఇస్తున్నామన్నది ముఖ్యం. ఇలా విజయోత్సవ సభలు నిర్వహించడం కార్యక్రమాలు రూపొందించి జనం సొమ్ము తగలేయడం సరి కాదన్న వాదన వినిపిస్తోంది. గతంలో వైసీపీ కూడా ఇంటింటికీ వంటి అతి కార్యక్రమాల ద్వారా.. పొందిన లాభం కంటే నష్టమే ఎక్కువ. చంద్రబాబు ఈ ధోరణి మానుకోవాలన్నది జనం మాటగా వినిపిస్తోంది. అతి సర్వత్రా వర్జయేత్ కాబట్టి ఇలాంటి కార్యక్రమాలను తగ్గించుకోవడమే మేలని అంటున్నారు. మంచి ప్రభుత్వం అంటూ చేసే ప్రచారాలు సైతం చేటు తెచ్చేవే తప్ప.. వాటి ద్వారా ఎలాంటి లాభం లేదన్న విషయం చంద్రబాబు గుర్తించాలని కూడా సలహా ఇస్తున్నారు.
యూరియాతో మొదలు పెట్టి రైతులకు గిట్టుబాటు ధర వంటి ఎన్నో సమస్యలుండగా బాబు డాబు కొద్దీ చేస్తోన్న ఈ ప్రచార పటాటోపం చేటు తెచ్చేదిగానే అభివర్ణిస్తున్నారు చాలా మంది. ఏటా డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి జగన్ చేసిన సంక్షేమాభివృద్ధికి దక్కిన ఫలితం 11 సీట్లు. డబుల్ ఖర్చు చేసి చంద్రబాబు చేయాలని చూస్తున్న ఈ సంక్షేమ సరళి ఎలాంటి ఫలితాలిస్తాయో అన్న ప్రశ్న- కూటమి గెలవక ముందు నుంచే ఉంది. ఒక పక్క వైసీపీ ఆ పార్టీ సోషల్ మీడియా వింగులు మొదలు పెట్టిన ఫేక్ న్యూస్ దాని కట్టడికి తల బొప్పి కట్టేస్తోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ఒక ట్రబుల్ షూటర్ గా తయారు చేయడంలో లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఆయన ఎక్కే హెలికాప్టర్, దిగే ఫ్లైటు ఖర్చులు తడిసి మోపెడు అవుతోంది. ఆపై ఆయన సినిమాల కోసం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం కూడా చేటు తెచ్చేలా తెలుస్తోంది. ఈ దిశగా ఇప్పటికే కేసు నమోదయ్యింది. ఇక నియోజకవర్గానికి 500 మందిని ఎంపిక చేసి పది లక్షలిస్తామని ఆయన ప్రచార సమయంలో చేసిన ప్రకటన గురించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గతంలో వాలంటీర్ల వల్ల 30 వేల మంది అమ్మాయిలు తప్పి పోయారన్నది నిరూపించలేక చేతులెత్తేస్తున్నారు పవన్. ఆపై సుగాలీ ప్రీతి వ్యవహారం ఉండనే ఉంది. ఇలా కూటమి ప్రభుత్వ నిర్వహణ తలాపాపం తిలా పిడికెడుగా కనిపిస్తోందని అంటున్నారు. వీటన్నిటినీ సరిదిద్దుకోవల్సిన బాబు.. వీటన్నిటినీ పక్కన పెట్టి తన ప్రచార పటాటోపం కోసం చేస్తున్న ఈ పాలన సరైనదేనా? అన్న ప్రశ్న వినిపిస్తోంది.