చంద్రబాబుకు ఎప్పుడూ బెటర్ దేన్ ది బెస్టే కావాలి!
posted on Oct 30, 2025 @ 2:49PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నోట తన మంత్రివర్గ సహచరుల గురించి కానీ, పార్టీ కేడర్, అధికారుల గురించి పొగడ్త రావడం అత్యంత అరుదు. ఎంద కష్టపడి పని చేసినా, ఓకే ఇంకా బాగా చేయాలి అన్న మాటలే ఆయన నుంచి తరచూ వింటుంటాం. నిజమే ఆయన ప్రతి విషయంలోనూ కేడా బెటర్ దేన్ ది బెస్ట్ కావాలంటారు. అందుకే బాగా పని చేసిన వారిని ఆయన భేష్ అంటూ భుజం తట్టి అభినందించినా.. మరుక్షణంలోనే ఇంకా బాగా చేయాలన్న మాట కూడా వస్తుంది.
అటువంటి చంద్రబాబు తాజాగా అధికార యంత్రాంగాన్నీ, తన మంత్రివర్గ సహచరులను, కూటమి ఎమ్మెల్యేలను మనస్ఫూర్తిగా అభినందించారు. బ్రహ్మాండంగా పని చేశారంటూ కితాబులిచ్చేశారు. సందర్భం ఏమిటంటే మొంథా తుపాను సమయంలో నష్టాన్ని కనిష్ఠానికి తగ్గించేందుకు మొత్తం యంత్రాగం, కేబినెట్, పార్టీ ఎమ్మెల్యేలు అవిశ్రాంతంగా శ్రమించి ఫలితం సాధించారు. దీనిపై ఆయన ఫిదా అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సచివాలయ సిబ్బంది పగలు రేయి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సేవలు అందించారనీ, ఇళ్లకు కూడా వెళ్ల కుండా కార్యాలయాలలోనే ఉండి నిరంతరం పరిస్థితిని గమనిస్తూ అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారనీ చంద్రబాబు ప్రశంసించారు. అలాగే అలసత్వం వహిస్తున్నారు అంటూ నిన్నమొన్నటి దాకా చంద్రబాబు ఆగ్రహాన్నే చవి చేసిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఇప్పుడు చంద్రబాబు ప్రశంసలకు పాత్రులయ్యారు.
తుఫాను నేపథ్యంలో ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ ప్రజలు సమస్యలు ఎదుర్కోకుండా దగ్గరుండి మరీ పని చేయడాన్ని ఆయన అభినందించారు. ఎమ్మెల్యులు, మంత్రులు తుపాను ప్రభావిత ప్రాంతాలలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు చేర్చడమే కాకుండా అక్కడే ఉండి వారితో పాటు అక్కడే భోజనం చేయడం చంద్రబాబు ప్రశంసలకు పాత్రమైంది. దీంతో చంద్రబాబు తన అలవాటుకు ప్రకారం ఇంకా బాగా పని చేయాలంటూ ముక్తాయించకుండా, వారి సేవలను, శ్రమను ప్రశంసలతో ముంచెత్తారు. ఇలా కలిసికట్టుగా పని చేస్తే ప్రజలు ఎప్పటికీ మననే ఆదరిస్తారంటూ వారిని పొగడ్తలతో ముంచెత్తారు.