ఎన్డీయే కన్వీనర్ చంద్రబాబు?.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం ఖాయం!
posted on Jun 5, 2024 @ 12:08PM
టిడీపీ అధినేత చంద్రబాబు హస్తినకు బయలు దేరారు. ఎన్డీయే సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. పనిలో పనిగా ఈ పర్యటనలో భాగంగా ఆయన ఈ నెల 9న జరగనున్న తన ప్రమాణ స్వీకారానికి మోడీ, షా తదితర పెద్దలను ఆహ్వానించే అవకాశం ఉంది. ఫలితాల సరళి తెలిసిన క్షణ నుంచీ ఆయన పాలనపై దృష్టి సారించారు. ఫలితాల వెల్లడి ఒక వైపు సాగుతుండగానే ఆయన మంగళవారం (జూన్ 4) సాయంత్రం చంద్రబాబు పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఇరువురి మధ్యా దాదాపు రెండు గంటలకు పైగా చర్చ జరిగింది.
చంద్రబాబు ఎన్డీయే సమావేశానికి వెళ్లడం కూటమి భాగస్వామ్య పార్టీ అధినేతగా సహజమే అయినా, కేంద్రంలో బీజేపీ సొంతంగా పార్టీ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కు దూరంగా మిగిలిపోయింది. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన బీజేపీ అగ్రనాయకత్వం ఎన్డీయే కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టాలంటూ చంద్రబాబును కోరింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎనలేని ప్రాధా న్యత సంతరించుకుంది.
ఎన్డీయే కూటమిలో బీజేపీ తరువాత ఎక్కువ మంది ఎంపీలు ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం మాత్రమే. అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆయనకు అనివార్యంగా ప్రాధాన్యత ఇవ్వక తప్పదు. జాతీయ రాజకీయాలలో ఇప్పుడు చంద్రబాబు మాట తిరుగులేని విధంగా చెల్లుబాటు అయ్యే పరిస్థితులు ఉన్నాయి.
అందుకే ఇప్పుడు అందరూ మోడీ మూడో సారి ఏర్పటు చేస్తున్న ప్రభుత్వం వాజ్ పేయి హయాంలోని సంకీర్ణ ప్రభుత్వంలా చంద్రబాబు సెంట్రిక్ గా నడుస్తుందని అంటున్నారు. బీజేపీ అజెండా కాదు, సెక్యులర్ అజెండాయే మోడీ అనుసరించకతప్పని పరిస్థితి ఉందని చెబుతున్నారు. అదే విధంగా ఏపీకి కేంద్రం నుంచి పూర్తి సహాయసహకారాలు అందుతాయన్న ఆశాభావం సర్వత్రా వ్యక్తం అవుతోంది.