ఏ1, ఏ2ల బెయిల్ రద్దుపై ఒకేసారి తీర్పు.. సెప్టెంబర్ 15న జడ్జిమెంట్ డే..
posted on Aug 25, 2021 @ 1:48PM
జంటగా అక్రమ ఆస్తులు పోగేశారు. జంటగా జైలుకెళ్లారు. జంటగా బెయిల్‌పై బయటకు వచ్చారు. జంటగా అధికారం అనుభవిస్తున్నారు. మొదటి నుంచీ అన్ని విషయాల్లోనూ జంటగా ఉన్న ఏ1 జగన్‌రెడ్డి, ఏ2 విజయసాయిరెడ్డిలపై ఎంపీ రఘురామ సింగిల్‌గా అటాక్ చేశారు. వారిద్దరి బెయిల్ రద్దు చేయాలంటూ వేరువేరుగా సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆ ఇద్దరి బెయిల్ రద్దు తీర్పును ఒకేసారి వెల్లడిస్తామంటూ సీబీఐ కోర్టు నిర్ణయించడం ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్ 15న జగన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దుపై తుది తీర్పు వెల్లడిస్తామని సీబీఐ కోర్టు ప్రకటించింది. దీంతో.. దొందు దొందులిద్దరి బెయిల్ ఒకేసారి రద్దు అవుతుందా? ఆ ఇద్దరూ మళ్లీ జంటగా జైలుకు వెళ్తారా? అంటూ ప్రచారం జరుగుతోంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై సీబీఐ కోర్టు తీర్పును వచ్చే నెల 15కి వాయిదా వేసింది. తెలుగు రాష్ట్రాల్లో జగన్‌కు జైలా.. బెయిలా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. దీంతో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆ ఉత్కంఠ మరింత కంటిన్యూ అయ్యేలా కోర్టు నిర్ణయం వచ్చింది. అదే కోర్టులో ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దుపై కూడా విచారణ జరిగింది. ఆ వాదనలు పూర్తవడంతో.. ఇటు జగన్, అటు విజయసాయి.. ఇద్దరి బెయిల్ రద్దుపై జడ్జిమెంట్‌ను ఒకేసారి వచ్చే నెల 15న వెల్లడిస్తామని సీబీఐ కోర్టు తెలిపింది.
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలుచేసిన ఈ పిటిషన్‌పై జూలై ఆఖరులో వాదనలు ముగిశాయి. తీర్పును అప్పటినుంచి కోర్టు రిజర్వు చేసింది. ముఖ్యమంత్రిగా తనకుండే అధికారాలను ఉపయోగించి.. జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని రఘురామ ఏప్రిల్ మొదటి వారంలో దాఖలు చేసిన పిటిషన్‌లో ఆరోపించారు. సీఎం హోదాలో జగన్ వివిధ కారణాలు చెబుతూ, కోర్టుకు హాజరు కాకుండా డుమ్మా కొడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. విజయసాయిరెడ్డిపైనా ఇలాంటి ఆరోపణలే చేస్తూ రఘురామ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ రెండు కేసులు ఒకేలా ఉండటంతో.. సీఎం జగన్మోహన్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు తీర్పులను ఒకేసారి వెల్లడిస్తామంటూ సీబీఐ కోర్టు విచారణను సెప్టెంబర్ 15కు వాయిదా వేసింది.