ఎమ్మెల్యేలు, ఎంపీలపై 147 కేసులు.. సుప్రీంకోర్టుకు జాబితా.. యాక్షన్ తప్పదా?
posted on Aug 25, 2021 @ 1:48PM
హైకోర్టు అనుమతి లేకుండా ప్రజాప్రతినిధులపై కేసుల ఎత్తివేత కుదరదంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఆగ్రహించింది. ఆ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ప్రత్యేక కోర్టుల జడ్జిల పేర్లు, ఎన్ని కేసులు పరిష్కరించారు? ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయనే సమాచారం అందించాలని సుప్రీం ఆదేశించడంతో పలు రాష్ట్రాల హైకోర్టులు అలర్ట్ అయ్యాయి. తాజాగా ఆ వివరాలు సుప్రీంకోర్టుకు అందజేశాయి.
తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలపై నమోదైన కేసుల విచారణ జరుపుతున్న ప్రత్యేక న్యాయస్థానంలో 147 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. నాన్‌బెయిలబుల్ వారెంట్లు, అభియోగాల నమోదు, నిందితుల విచారణ, 313 సీఆర్‌పీసీ కింద నిందితుల విచారణ, వాదనలు, హైకోర్టు స్టేల దశలో ఈ కేసులున్నాయని తెలిపింది.
పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన 14 కేసులు ఉపసంహరించాలని తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తు చేసిందని అఫిడవిట్‌లో తెలిపింది. ప్రత్యేక న్యాయస్థానం 2020 అక్టోబరు 7 నుంచి ఈ ఏడాది ఆగస్టు 3లోపు 14 కేసులను ఉపసంహరించిందని తెలిపారు.
ప్రత్యేక కోర్టులకు నలుగురు జడ్జీలు ఉన్నారని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు అనుమతి లేకుండా ఈ న్యాయాధికారులను రిజిస్ట్రీ బదిలీ చేయదని తెలిపారు.