కారుని ముంచుతున్న కాళేశ్వరం.. ఆంధ్రా రాగం అందుకున్న గులాబి దళం
posted on Sep 1, 2025 @ 5:33PM
లైఫ్ జాకెట్ గా పనికొస్తుందనేనా?
కాళేశ్వరం ప్రాజెక్టుపై పిసి ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణ అసెంబ్లీ సుదీర్ఘంగా చర్చించి ఆ ప్రాజెక్టులో అవకతవకలు, అక్రమాలు, అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఈ నిర్ణయం బీఆర్ఎస్ శిబిరంలో ఆందోళనకు కారణమైంది. దీనిని బీజేపీ అవకాశంగా తీసుకుని తమ పుట్టి ముంచుతుందన్న ఆందోళన బీఆర్ఎస్ లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కాళేశ్వరంపై సీబీఐ విచారణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపట్టా ల్సిందిగా పార్టీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి మరీ పిలుపునిచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహించాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసివేసి నదీ జలాలను ఆంధ్రప్రదేశ్‌కు మళ్లించడానికి కాంగ్రెస్, బిజెపి కుట్రగా ఆ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై రేవంత్ సర్కార్ సీబీఐ విచారణ నిర్ణయాన్ని అభివర్ణించారు. ఈ కుట్ర ను తీవ్రంగా ప్రతిఘటించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికీ, ఆంధ్రప్రదేశ్ కు సంబంధం ఏముంది? కేటీఆర్ మాటలు, వ్యాఖ్యలు, ఆందోళనలకు పిలుపునివ్వడం ఇవన్నీ ఆయనలో, బీఆర్ఎస్ లో ఆందోళనకు, నిరాశకు తార్కానంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
బీఆర్ఎస్ ఇబ్బందుల్లో పడిన ప్రతి సారీ ఆ పార్టీకి తెలంగాణ వాదం గుర్తుకువస్తుంటుంది. ఆంధ్రప్రదేశ్ పై విద్వేషం తన్నుకొస్తుంటుంది. మరీ ముఖ్యంగా గత ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత అయిన దానికీ కాని దానికీ ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం బీఆర్ఎస్ నాయకత్వానికి ఒక అలవాటుగా మారిపోయింది. ఆంధ్ర సెంటిమెంట్‌ను రెచ్చగొట్టడం ద్వారా తెలంగాణ ప్రజలకు చేరువ కావచ్చునన్నది వారి యోచనగా కనిపిస్తోంది.