మళ్లీ మొదలైన కాల్ మనీ... గుంటూరులో వేధింపులు తట్టుకోలేక పెట్రోల్ పోసుకున్న యువకుడు
posted on Dec 16, 2019 @ 9:53AM
గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసు స్టేషన్ వద్ద వెంకటేష్ అనే యువకుడు హంగామా సృష్టిస్తూ కాల్ మనీ వివాదం తెర పైకి తీసుకువచ్చాడు. తనను గోపాలం సాంబశివరావు అనే వడ్డీ వ్యాపారి అధిక వడ్డీ పేరుతో వేధిస్తున్నాడని ఆరోపించాడు. అప్పు ఇచ్చే సమయంలో మూడు రూపాయల వడ్డీ అని చెప్పి చెల్లించే సమయంలో అధిక వడ్డీ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపించాడు. అధిక వడ్డీ వేధింపుల పై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు కూడా వడ్డీ వ్యాపారికి వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
తాడేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద వంటి పై పెట్రోల్ పోసుకున్నాడు. వెంకటేష్ చేసిన హడావిడితో పోలీసులు అలెర్ట్ అయ్యారు. వెంటనే అతడిని స్టేషన్ లోకి తీసుకెళ్లారు. ఫిర్యాదును స్వీకరించారు.అప్పు ఎగ్గొట్టేందుకే వెంకటేష్ డ్రామా ఆడుతున్నాడని అప్పు ఇచ్చిన సాంబశివరావు చెబుతున్నారు. కొంత మంది సలహాలతోనే స్టేషన్ వద్ద పెట్రోల్ తో హంగామా చేశాడంటున్నాడు. వెంకటేష్ పై గతంలో పలు ఫిర్యాదులు ఉన్నాయి అన్నాడు.బాగా అప్పుల్లో మునిగిపోవడం వల్ల అందరూ బెదిరించటం వల్ల ఇలా చేస్తే తప్పించకోవచ్చు అని ఇలా చేస్తున్నాడని,గతంలో కూడా అతని పై తాడేపల్లి పీఎస్ లో కేసులు ఉన్నాయని అప్పు ఇచ్చిన వ్యక్తి తెలియజేశాడు.సాక్షాత్తు ముఖ్య మంత్రి నివాసానికి సమీపంలో ఘటన జరగడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. పోలీసు ల పనితీరు పై విమర్శలు కూడా చేస్తున్నారు.ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు కేసు పై అసలు నిజాలు దర్యాప్తు చేస్తున్నారు.