కుటుంబం అంతా దొంగలేనట...
posted on Dec 14, 2019 @ 5:51PM
ఓ కుటుంబంలోని సభ్యులందరూ దొంగలే. ఒంటరిగా ప్రయాణం చేసే మహిళలే వాళ్ల టార్గెట్ గా ఎంచుకుంటున్నారు. కొంతకాలంగా గ్రేటర్ హైదరాబాద్ వాసులకు కంటి మీద కునుకు లేకుండా దొంగతనాలు చేస్తున్న గాయత్రి గ్యాంగ్ ఎట్టకేలకు చిక్కింది. చోర్ ఫ్యామిలీ ని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నగదుతో పాటు బంగారు ఆభరణాలు సెల్ ఫోన్లు సీజ్ చేశారు. బెంగళూరుకు చెందిన ఎస్ రాజు కుటుంబ సభ్యులంతా ఒక ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడ్డారు. రాజు ఇద్దరు భార్యలు గాయత్రి, కోకిల ఈ ముఠాలో సభ్యులు. ఇద్దరు అక్కచెల్లెళ్లు. వీరికి తోడు రాజు చెల్లెలు అనిత ఆమె స్నేహితురాలు జ్యోతి అందరూ దొంగలే. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధి లోని ఒంటరి మహిళా ప్రయాణికులను ఈ గ్యాంగ్ టార్గెట్ గా చేసుకుంది. త్రీ స్టార్ హోటళ్లలో నివాసముంటూ రద్దీ ప్రదేశాల్లో ఉన్న మహిళను ఫాలో అవుతూ వారి దృష్టి మరల్చి దొంగతనాల చేసింది గ్యాంగ్. ఏడాది జూన్ 29న 69 ఏళ్ల జయలక్ష్మి సికింద్రాబాదు నుంచి మెహదిపట్నం వెళుతున్న సమయంలో ఈ ముఠా వెంబడించింది. ఆమె బ్యాగ్ లోని విలువైన వస్తువులను కాజేసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు గాయత్రి గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 3 కమిషనరేట్ల పరిధిలో ఈ గ్యాంగ్ 13 చోరీలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. గాయత్రి గ్యాంగ్ లోని మహిళలు.. చిన్నారులు, ఒంటరి మహిళల వద్దకు వెళ్లి ఏ మాత్రం అనుమానం రాకుండా బ్యాగ్ లోని వస్తువులు కాజేసేవారు. ఒక్క జూన్ నెలలోనే ఈ తరహా చోరీలు 3 నమోదు కావడంతో అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులు పక్కా నిఘా పెట్టారు. ఓ కుటుంబంలోని సభ్యులంతా దొంగలే కావడంతో మహారాష్ట్ర,కర్ణాటకలో ఈ తరహా దొంగతనాలు ఏమైనా జరిగాయా అన్న కోణంలో ఆరా తీస్తూ దర్యాప్తు చేస్తున్నారు.