అప్పుల్లో కేంద్రం అరాచకత్వం.. కాగ్ నివేదికలో తేటతెల్లం
posted on Dec 28, 2022 @ 10:14AM
తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరయా అన్నారు యోగి వేమన.. ఆయన మాటలను తు.చ. తప్పకుండా పాటిస్తోంది కేంద్రంలోని మోడీ సర్కార్. రాష్ట్రాల అప్పులపై విమర్శలు గుప్పిస్తూ.. తాను మత్రం విచ్చల విడిగా అప్పులు చేసేస్తోంది. ఎదుటి వారికి చెప్పేందుకు మాత్రమే నీతులు అన్న తీరులో వ్యవహరిస్తోంది. గత కొంత కాలంగా కేంద్రం రాష్ట్రాల అప్పులపై కేంద్రం తీవ్రంగా పరిగణిస్తూ.. పరిమితి మించి అప్పులు చేయకుండా నియంత్రిస్తోంది. అదే సమయంలో తాను మాత్రం యథేచ్ఛగా ఎలాంటి నియంత్రణా లేకుండా అప్పులతో పబ్బం గడిపేసుకుంటోంది. అయితే కేంద్రం నిర్వాకాన్ని కాగ్ బట్టబయలు చేసింది. రాష్ట్రాల అప్పులపై ఒంటి కాలిపై లేస్తూ విమర్శలు గుప్పిస్తున్న కేంద్రం తాను మాత్రం పరిమితులంటూ లేకుండా ఎడా పెడా అప్పులు చేసేస్తోంది. దేశాన్ని అప్పుల కుప్పగా మార్చేసింది.
ఎఫ్‌ఆర్‌బీఎం మేరకు కేంద్రం దేశ జీడీపీలో 40 శాతం వరకు అప్పులు చేసుకొనే వెసులుబాటు ఉంది. అయితే 2022 ఆర్థిక సంవత్సరం మోదీ సర్కారు ఏకంగా ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని మించి 54 శాతం అప్పులు చేసింది. 2015-16లో జీడీపీలో కేంద్రం అప్పులు 5.5 శాతం ఉండగా, 2019-20 నాటికి 52.30 శాతానికి, 2022-23 నాటికి 54 శాతానికి పెరిగిపోయాయి. కేంద్రానికి ఏడాది కాలంలో సమకూరుతున్న మొత్తం ఆదాయంలో 2019-20లో వడ్డీలకు 34 శాతం చెల్లించింది. 2022-23 నాటికి అది 37 శాతానికి పెరిగిపోయింది.
అప్పులు, వాటికి చెల్లించే వడ్డీలు పెరిగినా.. అది జీడీపీ పెరుగుదలకంటే ఎక్కువ ఉండకూడదన్నది నిబంధన. అయితే, 2019-20 ఆర్థిక సంవత్సరం నాటికే జీడీపీ పెరుగుదల రేటును వడ్డీల పెరుగుదల రేటు దాటిపోయిందని కాగ్ వెల్లడించింది. 2019-20 సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు కన్నా అప్పుల వృద్ధి రేటు రెట్టింపు ఉన్నది. 2019-20లో జీడీపీ వృద్ధిరేటు 6.22%. అప్పుల్లో మాత్రం ఏకంగా 12.62 శాతం వృద్ధి కనిపించింది.
2015-2020 మధ్య మోదీ ప్రభుత్వం ఏటా సగటున 7 లక్షల కోట్ల అప్పు చేసినట్టు కాగ్ నివేదిక తేల్చింది. 2015-16లో కేంద్ర ప్రభుత్వ అప్పులు రూ.69.55 లక్షల కోట్లు ఉండగా 2019-20 నాటికి ఇవి 105 లక్షల కోట్లకు చేరింది. మోడీ ప్రభుత్వం ఐదేండ్లలోనే రూ.35 లక్షల కోట్ల అప్పులు చేసింది. 2018-19లో ద్రవ్యలోటు రూ.1.88 లక్షల కోట్లు ఉండగా ఏడాది వ్యవధిలోనే అది దాదాపు రెట్టింపయ్యి రూ.3.75 లక్షల కోట్లకు పెరిగింది.
2014-15 నాటికి దేశ నికర అప్పు రూ.62 లక్షల కోట్లు ఉండగా, 2021-22 బడ్జెట్ నాటికి అది రూ.కోటి 35 లక్షల కోట్లకు చేరింది. అంటే ఏడేళ్లలో 117శాతం పెరిగింది. ప్రస్తుత భారత ప్రభుత్వం అప్పు రూ. 155 లక్షల కోట్లు. ఇది జీడీపీలో అరవై శాతం. అంటే రాష్ట్రాలు రుణ పరిమితిని మించి అప్పులు చేస్తున్నాయంటూ విమర్శలు గుప్పిస్తూ వాటిని ఆంక్షల చట్రాల్లో బిగించేసి అప్పు పుట్టకుండా చేస్తున్న కేంద్రం తాను మాత్రం నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించి మరీ అప్పులు చేసేస్తోంది.
గత నాలుగున్నరేళ్లలో దేశ రుణ భారం దాదాపు 50 శాతం పెరిగింది. అపరిమితంగా అప్పులు చేసి కొన్ని రాష్ట్రాలు దివాలా దిశగా వెళ్తున్నాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తూ ఆగం ఆగం చేస్తోంది కానీ.. రాష్ట్రాలఅప్పులను నియంత్రించాల్సిందీ కేంద్రమే. ఆ కేంద్రమే రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని రాష్ట్రాలు నిబంధనలకు తిలోదకాలిచ్చేసినా పట్టించుకోవడం లేదు.. కొన్ని రాష్ట్రాల విషయంలో మాత్రం కళ్లేలు బిగిస్తోంది. ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట పరిధిలోనే అప్పులు ఉండాలి. కొన్ని రాష్ట్రాలు కేంద్రం చెబుతున్నట్లుగా పరిమితికి మించి అప్పులు చేస్తున్నాయి. కానీ కేంద్రం కూడా అదే దారిలో వెళ్తున్నప్పుడు ఇక చెప్పేదేముంటుంది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యెడా పెడా యథేచ్ఛగా అప్పులు చేస్తూ.. రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను పాతాళానికి దిగజార్చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వాల విధానాల కారణంగా దేశంలో ప్రతి వ్యక్తి తలపైనా ఉన్న అప్పు అక్షరాలా కోటి రూపాయల పై మాటే.
రాష్ట్రాల స్థూల జాతీయోత్పత్తిలో మొత్తం అప్పుల శాతం కూడా కొన్ని రాష్ట్రాల్లో 50 శాతం దాటిందని, ఇది రాష్ట్రాల అభివృద్ధిని దెబ్బతీస్తుందని కేంద్రం ఆందోళన చెందుతోంది. ఇదే ఆందోళన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు సాక్షిగా వెల్లడించారు. అయితే కేంద్రం చెస్తున్న అప్పుల ప్రస్తావనను మాత్రం తీసుకురాలేదు. కాగ్ కేంద్ర ప్రభుత్వ అప్పులను కూడా వేలెత్తి చూపిన విషయాన్ని దాచేసే ప్రయత్నం చేసింది. ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి ఎక్కడో ఓ చోట నుంచి ఏదో విధంగా అప్పులు తెచ్చి వారికి పందేరం చేసి మళ్లీ ఎన్నికలలో విజయం కోసం ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసి, ప్రజల జీవన ప్రమాణాలనుకానీ దిగజార్చేసి పబ్బం గడుపుకుందామన్న ఉద్దేశమే కానీ, బాధ్యతగా వ్యవహరించి దేశ ప్రగతి, పురోగతిపై దృష్టి సారించాలన్న భావన కేంద్ర ప్రభుత్వంలో కనిపించడం లేదు.