క్యాబినెట్ సమావేశం కోసం డిల్లీలో పంచాయితీ
posted on Jun 5, 2013 @ 2:45PM
మళ్ళీ చాలా నెలల తరువాత ఎల్లుండి మంత్రివర్గ సమావేశం జరుగబోతోంది. ప్రధానంగా శాసనసభలో విపక్షాలను ఏవిధంగా ఎదుర్కోవాలనే విషయంపై చర్చించడాని మంత్రివర్గం సమావేశమవుతోంది. కానీ, అంతకంటే ముందుగా స్వపక్షంలో విపక్షాన్ని ఏవిధంగా ఎదుర్కోవాలనే విషయం తేల్చుకోవడానికి ప్రస్తుతం డిల్లీ పెద్దల ముందు పంచాయితీ జరుగుతోంది. దానికి వారు హుందాగా ‘రాష్ట్ర రాజకీయ సమస్యలపై చర్చలు’ అనే టైటిల్ ఇచ్చుకొన్నపటికీ అది పంచాయితీ కాకుండా పోదు.
ఈ పంచాయితీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, చిరంజీవి తదితరులు పాల్గొంటున్నారు. తద్వారా ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు తగిన వ్యూహం చర్చించే మంత్రివర్గ సమావేశం రసబాస కాకుండా సజావుగా జరుపుకోవాలని వారి తాపత్రయం. ముందు ఇంట్లో గొడవలు చక్కబెట్టుకొంటే ఆ తరువాత పొరిగింటి గురించి చర్చించవచ్చునని వారి ఆలోచనతో ప్రస్తుతం డిల్లీలో పంచాయితీ నడుస్తోంది. బహుశః అధిష్టానం ఈ విషయంలో వారందరికీ తగిన మార్గదర్శక ప్రతిపాదనలు చేసి హైదరాబాదుకి సాగానంపవచ్చును. అందువల్ల, కనీసం ఈ సమావేశం సజావుగా సాగే అవకాశం ఉంది.
ఈ ముందస్తు పంచాయితీయే జరుపకపోయి ఉండిఉంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఆయనను వ్యతిరేఖించే ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, జానా రెడ్డి, రామచంద్రయ్య, బొత్స సత్యనారాయణ తదితరులు డీయల్ ను అత్యంత అవమానకరంగా బర్త్ రఫ్ చేసినందుకు ఈ సమావేశంలో ఎండగట్టేవారేమో.
ఇక, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల కాలంలోమంత్రివర్గం ఆమోదంతో పనిలేకుండా ప్రవేశ పెడుతున్న రోజుకొక కొత్త పధకం గురించి కూడా తీవ్ర అభ్యంతారాలు వ్యక్తం చేసేవారు. కానీ, ఇప్పుడు ఆయనను నిలదీయడానికి మంత్రి వర్గంలో డీయల్ లేరు గనుక ముఖ్యమంత్రికి చాల ఉపశమనమే అవుతుంది. ఒకవేళ, ఇంకా ఎవరయినా తనను నిలదీయలనుకొన్నా కూడా ప్రస్తుతం డిల్లీలో జరుగుతున్న పంచాయితీ అటువంటి వారి గొంతు నొక్కివేయబడుతాయి గనుక ఈ సారి మంత్రి వర్గ సమావేశం సజావుగా సాగే అవకాశాలున్నాయి. కానీ, టీ-కాంగ్రెస్ యంపీల విషయంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై జానారెడ్డి ఈ సమావేశంలో విమర్శించే అవకాశం ఉంది.
ఇంత అనైక్యంగా ఉన్న కాంగ్రెస్ నేతలు కలిసి, శాసనసభలో విపక్షాలను ఎలా ఎదుర్కోవాలని చర్చించుకోవడం ఎవరికయినా నవ్వు తెప్పించక మానదు.