ఇది కరోనా పాజిటివా? వివేకా గారి కేసులో సీబీఐ పాజిటివా?
posted on Jul 22, 2020 @ 10:02AM
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.
విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవడంపై టీడీపీ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికగా స్పందించారు.
"విజయసాయిరెడ్డి గారు మీకు నిజంగానే కరోన సంక్రమిస్తే మీరు వైరస్ ని జయించి..రావాలి. టెస్టులు,వైద్యం మన రాష్ట్రం లోనే చేయించుకోండి. మన రాష్ట్ర ప్రజలకి మనోధైర్యం ఇచ్చినట్లు ఉంటుంది.. విజయోస్తు.. సుఖీభవ..!" అంటూ నిన్న రాత్రి విజయసాయి రెడ్డికి కరోనా అని వార్తలు వచ్చిన సమయంలో బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు.
ఇక, బుద్దా వెంకన్న స్పందిస్తూ.. "రాజకీయంగా ట్విట్టర్ ప్రత్యర్థులమే తప్ప వ్యక్తిగతంగా మా మధ్య ఎటువంటి గట్టు తగాదా లేదు. ఎంపీ విజయసాయిరెడ్డి గారు కనికరం లేని కరోనా బారిన పడటం బాధాకరం. ఆయన కరోనా నుండి త్వరగా కోలుకుని ట్విట్టర్ లో యాక్టివ్ అవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను." అని ట్వీట్ చేశారు.
అయితే, ఈఎస్ఐ స్కాం ఆరోపణలతో అరెస్టైన టీడీపీ నేత అచ్చెన్నాయుడు అనారోగ్యం కారణంగా ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోర్టుని కోరినప్పుడు.. గుండ్రాయిలా ఉన్న అచ్చెన్న కి కార్పొరేట్ వైద్యం ఎందుకు అంటూ అవమానించిన విజయసాయిరెడ్డి.. ఇప్పుడు పొరుగు రాష్ట్రంలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చేరడాన్ని బుద్దా వెంకన్న తప్పుబట్టారు. అంతేకాదు, ప్రస్తుతం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ప్రారంభమైన నేపథ్యంలో.. ఆయన హైదరాబాద్ వెళ్ళడంపై అనుమానం వ్యక్తం చేశారు.
"అదేంటి హైదరాబాద్ పారిపోయారా? కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారా విజయసాయిరెడ్డి గారు. ఓహో అల్లుడు పాలన మీద నమ్మకం లేదా? గుండ్రాయిలా ఉన్న అచ్చెన్న కి కార్పొరేట్ వైద్యం ఎందుకు ఈఎస్ఐ ఉండగా అని ఒక బిసి నాయకుడి ని అవమానిస్తూ మీ రాక్షస మనస్తత్వం బయటపెట్టారు. మరి మీరు విశాఖ లో కేజీహెచ్ ట్రీట్మెంట్ తీసుకోకుండా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లడం ఏంటి? అన్నట్టు ఇది కరోనా పాజిటివా? వివేకా గారి కేసులో సీబీఐ పాజిటివా? ఆయన హత్యకు గురైనప్పుడు మీరు సంభ్రమాశ్చర్యాలకు గురైయ్యారు గుర్తుందా?" అంటూ బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు.