సీబీఐ విచారణట.. వింటున్నారా రాహుల్?.. కేటీఆర్
posted on Sep 1, 2025 @ 2:57PM
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు రాజకీయ వేడిని రగిలించింది. కాళేశ్వరం ప్రాజెక్టు లో అక్రమాలు, అవకతవకలు అవినీతి జరిగిందని తొలి నుంచీ ఆరోపిస్తున్న కాంగ్రెస్, ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం (ఆగస్టు 31) అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. కాగా ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రాణాలను ఫణంగా పెట్టి 14 ఏళ్ల నిర్విరామ పోరాటంతో తెలంగాణను సాధించిన కేసీఆర్ ను శిక్షిస్తారా? అంటూ మాజీ మంత్రి హరీష్ రావు మండిపడుతుంటే... కేసీఆర్ తనయుడు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రాహుల్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. గతంలో రాహుల్ గాంధీ సీబీఐపై చేసిన విమర్శలను గుర్తు చేస్తూ.. ఏపీలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు అంటోంది.. దీనిపై మీ స్పందనేంటి అంటూ ప్రశ్నించారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ వేదికగా.. మిస్టర్ రాహుల్ గాంధీ, తెలంగాణలో మీ సీఎం కాళేశ్వరం అంశాన్ని సీబీఐకి అప్పగించాలని నిర్ణయించారు. ఆ విషయం మీకు తెలుసా? అంటూ ప్రశ్నించారు. తంలో సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందనీ, అవి ప్రతిపక్షాలను నాశనం చేసే సెల్స్ గా మారిపోయాయని రాహుల్ విమర్శించిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు.
ఆప్పట్లో రాహుల్ ఈ మేరకు చేసిన ట్వీట్ ల స్క్రీన్ షాట్లను కూడా తన పోస్టుకు జోడించారు. ఒకప్పుడు బీజేపీ చేతిలో కీలుబొమ్మలని విమర్శించిన దర్యాప్తు సంస్థలకే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విచారణను ఎలా అప్పగిస్తుందని కేటీఆర్ నిలదీశారు. తమపై ఎన్ని కుట్రలు పన్నినా తగ్గేదే లేదని పేర్కొన్నా ఆయన రాజకీయంగా, న్యాయపరంగా పోరాడతామన్నారు. న్యాయవ్యవస్థపైనా, ప్రజలపైనా తమకు పూర్తి విశ్వాసముందన్న కేటీఆర్ స కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.