కేసీఆర్ హాజరు సంతకం అనే లాంఛనం కోసమేనా?

Publish Date:Dec 29, 2025

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిల మధ్య రాజకీయ స్నేహం గురించి కొత్తగా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇరువురూ ఒకరి ప్రయోజనాల పరిరక్షణ కోసం మరొకరు అన్నట్లుగా నిలబడ్డారన్న సంగతి తెలిసిందే. అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.  ఈ నేపథ్యంలో  తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం (డిసెంబర్ 29) అసెంబ్లీ శీతాకాల సమావేశాల ప్రారంభం రోజున సభకు హాజరయ్యారు. ఇందుకు నేపథ్యం ఏమిటని చూస్తే.. గత కొన్ని రోజులుగా  సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇప్పటి వరకూ ఓ లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటూ కేసీఆర్ చాటడంతో ఆయన అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగింది. ఆ ప్రచారానికి అనుగుణంగానే ఆయన సోమవారం (డిసెంబర్ 29) అసెంబ్లీకి హాజరయ్యారు. అయితే ఆయన సవాల్ చేసినట్లుగా అసెంబ్లీలో ఆయన గళమెత్తలేదు. సభలో ఐదారు నిముషాల పాటు.. అదీ సంతాప తీర్మానాల ఆమోదం వరకూ మాత్రమే సభలో ఉన్నారు. ఆ తరువాత బయటకు వెళ్లిపోయారు. సభలో బీఆర్ఎస్ కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, సభా కార్యక్రమాలను అడ్డుకోవడం లాంటి చర్యలకు పాల్పడలేదు.  ప్రశ్నోత్తరాల సమయం సజావుగా సాగింది.  దీంతో కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యింది కేవలం అనర్హత వేటు పడకుండా ఉండేందుకు సభలో అటెండెన్స్ వేయించుకోవడానికేనన్న చర్చ మొదలైంది. సభకు హాజరై ఒక సంతకం చేసేసి మౌనంగా ఆయన సభ నుంచి నిష్క్రమించేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక్కడే వారు కేసీఆర్ వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ తీరుతో పోలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ కూడా ఒకే ఒక సారి అసెంబ్లీకి హాజరై రిజిస్టర్ లో సంతకం చేసి, ఆ తరువాత అసెంబ్లీ సమావేశాలకు ముఖం చాటేస్తున్నారు. అసలు అసెంబ్లీ అవసరమేమిటి? ప్రజా సమస్యలపై ప్రెస్ మీట్లలో మాట్లాడితే సరిపోదా అన్న తీరులో ఆయన వ్యవహార శైలి ఉంది. ఇక ఇప్పుడు కేసీఆర్ కూడా సరిగ్గా అలానే వ్యవహరించనున్నారా అన్న అనుమానాలు అత్యధికుల్లో వ్యక్తం అవుతున్నాయి.   మొత్తం మీద శాసన సభ సభ్యత్వాన్ని కాపాడుకోవడానికి హాజరు వేయించుకునే లాంఛనాన్ని కేసీఆర్ పూర్తి చేసి.. తాను తన రాజకీయ మిత్రుడు, వైసీపీ అధినేత జగన్ నే ఫాలో అవుతున్నానని చాటినట్లైందని అంటున్నారు.  

140 ఏళ్ల ప్రస్థానం.. కాంగ్రెస్ లో జోషెదీ.. కార్యకర్తల్లో ఉత్సాహమెక్కడ?

Publish Date:Dec 29, 2025

దేశంలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీని గ్రాండ్ ఓల్డ్ పార్టీ అని కూడా అంటారు. స్వాతంత్యోద్య‌మ కాలం నుంచీ ఉన్న ఈ పార్టీ ఈ క్రమంలో అనేక విజయాలు, అపజ యాలను చవి చూసింది. అయితే ఇప్పటి వరకూ దేశంలో అత్యధిక కాలం అధికారంలో కొనసాగిన పార్టీగా రికార్డు కూడా సృష్టించింది. అయితే గత కొన్నేళ్ల నుంచీ, అంటే దాదాపుగా  దశాబ్ద కాలం నుంచీ ఆ పార్టీ వరుస పరాజయాలతో కూనారిల్లుతోంది. కాంగ్రెస్ చరిత్రలో ఇంతటి పతనావస్థ ఆ పార్టీకి గతంలో ఎన్నడూ లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా 2014 సార్వత్రిక ఎన్నికలలో కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని ఘోర పరాజయం తరువాత నుంచి ఈ పార్టీ కోలుకోలేదనే చెప్పాలి. ఈ పరిస్థితి చాలదన్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది. కీలక రాష్ట్రాలలో కనీస స్థానాలను కైవసం చేసుకోవడంలో విఫలమౌతున్న పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడం కష్ట సాధ్యమన్న అభిప్రాయం పరిశీలకులలో వ్యక్తం అవుతున్నది. ఇవన్నీ పక్కన పెడితే.. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ తన 140వ ఆవిర్బావ దినోత్సవాన్ని ఆదివారం (డిసెంబర్ 28) జరుపుకుంది. అయితే 140 ఏళ్ల కాంగ్రెస్ లో ఆ సందర్బంగా ఎలాంటి ఉత్తేజం కానీ, జోష్ కానీ కనిపించలేదు. వరుస పరాజయాలతో నిస్తేజంగా ఉన్న పార్టీ శ్రేణులు ఈ ఉత్సవాల పట్ల ఉదాశీనంగా ఉన్నాయి. వీటన్నిటికీ మించి పార్టీలో కీలక నేతలు బీజేపీ, ఆ పార్టీ మెంటార్ గా చెప్పుకునే ఆర్ఎస్ఎస్ అనుకూల ప్రకటనలు చేస్తుండటం పార్టీ శ్రేణులను మరింత గందరగోళంలోకి నెట్టేస్తున్నది. ఈ నేపథ్యంలోనే  ఆదివారం (డిసెంబర్ 28) పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వినా మరెక్కడా వేడుకలు జరగలేదు. పార్టీ అధికారంలో ఉన్న కర్నాటక, తెలంగాణల్లో కూడా ఆ సందడి కనిపించలేదు. కనీసం ఆయా రాష్ట్రాలలోని కాంగ్రెస్ కార్యాలయాలలో కూడా ఎటువంటి కార్యక్రమాలూ జరిగిన దాఖలాలు లేవు.  ఇక  పార్టీ ఎంపీ శశిథరూర్ వంటి వారు బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని తిరగడం, అవకాశం దొరికినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించడం పార్టీ అధిష్ఠానాన్ని మరింత ఇరుకున పెడుతోంది. అలా పార్టీ ధిక్కార స్వరం వినిపిస్తున్న నాయకుల సంఖ్య రోజురోజుకూ పెరగడంతో కాంగ్రెస్ కోలకుంటుందన్న భావన నెమ్మదిగా పార్టీ శ్రేణులలోనే అడుగంటుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక పార్టీ వ్యతిరేక స్వరం వినిపిస్తున్న నాయకుల జాబితాలోకి తాజాగా కాంగ్రెస్ అగ్రనేత, మాజీ కేంద్ర మంత్రి, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ చేరడం పార్టీ పరిస్థితిని మరింత దయనీయంగా మార్చేసింది. దిగ్విజయ్ సింగ్ తాజాగా ప్రధాని మోడీపై ప్రశంసిస్తూ కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్ లను ప్రస్తుతించారు.  ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన ఓ పోస్టులో దిగ్విజయ్ సింగ్.. ప్రధాని మోడీ ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ప్రధానిగా ఎదగడానికి ఆర్ఎస్ఎస్ కు ఉన్న సంస్థాగత బలమే కారణమని పేర్కొన్నారు. అక్కడితో ఆగకుండా తన పోస్టును కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కీలక నేతలు ప్రియాంక వధేరా గాంధీ, రాహుల్ గాంధీలకు ట్యాగ్ చేశారు.  అయితే ఆ తరువాత తన వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్ సంస్థాగత బలాన్ని చెప్పడానికే కానీ, ఆ సంస్థను కానీ, మోడీని కానీ ప్రశంసించడానికి కాదనీ కాంగ్రెస్ కు కూడా ఇలాంటి బలమైన వ్యవస్థ, అధికార వికేంద్రీకరణ అవసరమని చెప్పడమే తన ఉద్దేశం వివరణ ఇచ్చారు. ఆ వివరణలో కాంగ్రెస్ సంస్థాగతంగా బలహీనపడిందనీ, అధికారం కేంద్రీకృతమై ఉందన్న సంకేతాలు ఉండటం గమనార్హం. దీంతో పార్టీలోని సీనియర్లు ఒక్కరొక్కరుగా పార్టీకి దూరమౌతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఈ గ్రాండ్ ఒల్డ్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా తయారౌతున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

మాట మార్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

Publish Date:Aug 28, 2025

  ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని వ్యాఖ్యానించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇవాళ మాట మార్చారు. 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని నేను ఎవరికీ చెప్పలేదు అన్నారు. 75 ఏళ్ల తర్వాత కూడా చురుగ్గా పనిచేసే శక్తి ఉందని ఆయన తెలిపారు.సంఘ్ ఎలా చెప్తే అలా నడుచుకుంటామని వెల్లడించారు. కేంద్రం, ఆర్‌ఎస్‌ఎస్‌ మధ్య ఎలాంటి విభేదాలు లేవని  ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ స్పష్టం చేశారు.  . రాష్ట్రీయ స్వయం సేవక్‌  సంఘ్‌ వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలు ఉండొచ్చు.. వివాదం కాదంటూ చెప్పుకొచ్చారు. దేశ ప్రయోజనాలే ఇద్దరి ప్రాధాన్యతగా పేర్కొన్న మోహన్‌ భగవత్‌..  బీజేపీ అధ్యక్షుడి ఎన్నికను ఆర్‌ఎస్‌ఎస్‌ శాసించదన్నారు. ‘మేం సలహా ఇవ్వగలం  .. తుది నిర్ణయం వారిదేని తెలిపారు.  నూతన విద్యా విధానానికి మేం మద్దతిస్తున్నాం. ఇంగ్లీష్‌ నేర్చుకోవడంలో తప్పులేదు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫున ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్ణయాలు తీసుకుంటుందని  ప్రతిపక్షాల నుండి వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలతో తమకు మంచి సమన్వయం ఉందని మోహన్ భగవత్ వెల్లడించారు.  

ఎంతో సంతోషంగా ఉన్న భార్యాభర్తల బంధాన్ని కూడా నాశనం చేసే విషయాలు ఇవి..!

Publish Date:Dec 29, 2025

భార్యాభర్తల బంధం చాలా అపురూపమైనది.  జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం అది. కానీ నేటికాలంలో ఈ బంధం పలుచబడిపోతోంది. చాలామంది పెళ్లిళ్లు ఎంత గ్రాండ్ గా చేసుకుంటున్నారో.. అంత త్వరగా విడిపోతున్నారు.  అలాగని వీటికి పెద్ద కారణాలు ఉన్నాయా అంటే అది కూడా లేదు.  పెద్ద కారణాలు, గొడవలు జరిగినప్పుడే విడిపోవడానికి దారి తీస్తుందని అనుకుంటే పొరపాటే.. పైకి కనిపించకుండానే భార్యాభర్తల బంధం పెళుసుబారుతుంది. ఎంతో సంతోషంగా ఉన్న జంట కూడా కొన్ని తప్పులు చేయడం వల్ల తమ బంధాన్ని నాశనం చేసుకుంటారు.  ఇంతకీ భార్యాభర్తల బంధాన్ని  నాశనం చేసే తప్పులు  ఏంటో తెలుసుకుంటే.. అనుమానం.. ఏ సంబంధానికైనా అనుమానం అతిపెద్ద శత్రువు.  లైఫ్ పార్ట్నర్  ఫోన్‌ను చెక్ చేయడం, పదే పదే అనుమానించినట్టు చూడటం చేస్తుంటే, వారిపై నిఘా పెడుతుంటే లేదా అనవసరమైన ప్రశ్నలు అడుగుతుంటే జాగ్రత్తగా ఉండాలి. నమ్మకం లేకుండా ప్రేమ అనే భవనం నిలబడదు. అనుమానం పెనుభూతం అనే మాట వినే ఉంటారు.  అనుమానం  అనేది ఒక సంబంధాన్ని లోపల నుండి క్షీణింపజేసే చెదపురుగుల లాంటిది. ఎగతాళి.. ఎగతాళి చేయడం చాలామందికి అదొక కామెడీ ఆటగా ఉంటుంది. కోపంతో లేదా హాస్యంగా ఎగతాళి చేయడం సర్వసాధారణంగా అనిపించవచ్చు, కానీ అది అవతలి వ్యక్తి హృదయంలో లోతైన గాయాన్ని కలిగిస్తుంది. "నీకు ఏమీ తెలియదు" లేదా "నువ్వు ఎప్పుడూ అలాగే చేస్తావు" వంటి మాటలు   భాగస్వామి మనస్సులో నెమ్మదిగా  ద్వేషాన్ని పెంచుతాయి. అంతేకాదు.. బాడీషేమింగ్ గురించి,  రూపం గురించి చేసే ఎగతాళి మరింత మానసిక గాయం చేస్తుంది. ఇవి చాలా తప్పు. పోలిక.. భార్యాభర్తలు ఎప్పుడూ తమ భాగస్వాములను ఇతరులతో పోల్చి దెప్పిపొడచకూడదు.  ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఎవరికి వారు ప్రత్యేకం.  ఇతరులతో ఏ విషయంలో పోలిక పెట్టి మాట్లాడటం చాలా తప్పు. ఇతరులతో పోల్చి మాట్లాడేటప్పుడు తమతో బంధం ఎందుకు అని భావించేవారు ఉంటారు. ఇది వ్యక్తి ఆత్మగౌరవాన్ని నాశనం చేస్తుంది. పంతం.. నేను చెప్పిందే నిజం, నేను చెప్పిందే పైనల్.. లాంటి మాటలు మాట్లాడుతుంటే మాత్రం జాగ్రత్త పడాల్సిందే. తాను కరెక్ట్ అని తన భాగస్వామి తప్పని నిరూపించడానికి ట్రై చేస్తుంటారు. వారి అహం వారిని అలా చేయిస్తుంది. కానీ ఇది బందం నాశనం కావడానికి కారణం అవుతుంది. మౌనం.. భార్యాభర్తల మధ్య గొడవ జరిగినప్పుడు మౌనంగా ఉండటం మంచిదే. కానీ భార్యాభర్తల మధ్య గౌడవ కేవలం మౌనంతో పరిష్కారం కాదు. కొందరు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి మౌనాన్ని ఆయుధంగా వాడతారు.  అలా చేయడం వల్ల అపార్టాలు మరింత పెరుగుతాయి. పాత విషయాలు.. భార్యాభర్తల మధ్య గొడవ జరిగినప్పుడు చాలామంది చేసే పని పాత విషయాలు బయటకు తీసి వాటి గురించి మాట్లాడతారు.  ఇలా జరిగిపోయిన విషయాలను బయటకు తీసి మాట్లాడుతుంటే గొడవ వల్ల బందంలో ఏర్పడిన గాయం ఎప్పటికీ మానదు.  ఎప్పటి గొడవలు అప్పుడే వదిలేయాలి. మొబైల్.. నేటి కాలంలో బంధాలలో దూరం పెరగడానికి మొబైల్ ఫోన్ లే కారణం. భార్యాభర్తలు ఇద్దరూ ఇంట్లోనే ఉన్నా, ఇద్దరూ కలిసి పక్కన పక్కన కూర్చొన్నా  ఫోన్ లో  నిమగ్నమవుతుంటారు.  దీని వల్ల ఒకరిని ఒకరు పట్టించుకోలేని పరిస్థితికి వస్తారు. ఒకరి ప్రదాన్యత ఇలా తగ్గిపోతుంది. ఇది విడిపోవడానికి కారణం అవుతుంది. స్పేస్.. భార్యాభర్తల మధ్య ప్రేమ ఎక్కువైనా కష్టమే.  ప్రేమ పేరుతో అతుక్కుపోవడం చాలా ఇబ్బందికరమైన విషయం.  24గంటలు అతుక్కుని ఉండటం,  భాగస్వామి మీద ఆంక్షలు విధించడం, స్నేహితులను, బంధువులను కలవనివ్వకపోవడం వంటివి చేస్తే అలాంటి బంధాన్ని ఎప్పుడెప్పుడు వదులుకుందామా అనుకుంటారు. ఇలాంటి బందం ఒక పక్షిని గట్టిగా చేతిలో బంధించినట్టే ఉంటుంది. సంతోషకరమైన సంబంధాన్ని బిల్డ్ చేసుకోవడం  రాకెట్ సైన్స్ కాదు. ఒకరినొకరు గౌరవించుకోవాలి, నమ్మకంగా ఉండాలి,  క్షమించడం నేర్చుకోవాలి.. పైన పేర్కొన్న  ఈ ఎనిమిది విషయాలను దృష్టిలో ఉంచుకుంటే బంధాన్ని నిలబెట్టుకోవచ్చు.                               *రూపశ్రీ.
[

Health

]

శీతాకాలంలో ఉసిరికాయతో ఈ కాంబినేషన్లు ట్రై చేయండి.. ఇమ్యూనిటీ పెరుగుతుంది..!

Publish Date:Dec 29, 2025

ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి.  అలాంటి వాటిలో ఉసిరి కాయ ప్రధానమైనది.  ఉసిరికాయను ఆయుర్వేదం అమృత ఫలం అని అంటుంది. ఉసిరికాయ రోగనిరోధక శక్తిని పెంచుతుంది,  జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది.  శీతాకాలంలో ఉసిరిని క్రమం తప్పకుండా తీసుకోవడం జలుబు, దగ్గు,  ఫ్లూ వంచివి దరిచేరవు. కేవలం సీజనల్ ఇన్పెక్షన్లు నివారించడమే కాదు.. ఫ్యాట్ బర్నర్ గా కూడా సహాయపడుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిని మెరుగుపరుస్తుంది,  రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. విటమిన్ స,  యాంటీఆక్సిడెంట్లు ఉసిరిలో పుష్కలంగా ఉంటాయి.   ధమనులలో ఫలకం పేరుకుపోకుండా ఉండటానికి , ధమనులలో ఫలకం సమస్య తగ్గించడానికి సహాయపడుతుంది.  కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను కూడా తగ్గిస్తుంది.  మొత్తం రోగనిరోధక శక్తి,  హృదయనాళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఉసిరిని పొడి రూపంలో కూడా తీసుకోవచ్చు. కానీ శీతాకాలంలో ఉసిరికాయలు సమృద్దిగా దొరుకుతాయి.  ఉసిరికాయలను కొన్ని కాంబినేషన్లలో తీసుకుంటే ఇమ్యూనిటీ మరింత పెరుగుతుంది. ఇంతకూ ఉసిరికాయతో బెస్ట్ కాంబినేషన్ ఏంటో తెలుసుకుంటే.. ఉసిరి-తేనె.. తేనె కాంబినేషన్ లో  ఉసిరి తీసుకుంటే ఉసిరిలో ఉండే విపరీతమైన పులుపు, వగరు రుచి తగ్గుతుంది. పైగా బోలెడు    ప్రయోజనాలను కూడా అందిస్తుంది.  ఉసిరి ఇమ్యూనిటీని పెంచుతుంది., మరోవైపు తేనె గొంతు సమస్యలు తగ్గిస్తుంది. గట్ ఆరోగ్యానికి సహాయపడుతుంది.   శరీరానికి శక్తిని అందిస్తుంది. తేనె-ఉసిరి కాంబినేషన్ ఇన్ఫెక్షన్లతో  పోరాడటానికి సహాయపడుతుంది, మంటను తగ్గిస్తుంది,  శ్వాసకోశ ఆరోగ్యానికి సపోర్ట్  ఇస్తుంది. ఎలా తినాలి.. టీస్పూన్ ఉసిరి పొడి లేదా తాజా ఉసిరి రసం 1 టీస్పూన్ తీసుకోవాలి.  దీన్ని సమాన పరిమాణంలో  తేనెతో ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఉసిరి-పసుపు.. ఉసిరిలో  విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.   పసుపులో  కర్కుమిన్ ఉంటుంది. ఇవి రెండు  కలిసినప్పుడు రోగనిరోధక శక్తి సూపర్ గా  పెరుగుతుంది, మంటను తగ్గిస్తుంది,  శరీరాన్ని  డిటాక్స్  చేస్తుంది. ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి, తెల్ల రక్త కణాల పనితీరును పెంచడానికి, శ్వాసకోశ ఆరోగ్యాన్ని సహాయపడతుంది ఎలా తీసుకోవాలి.. స్పూన్ ఉసిరి రసాన్ని గ్లాసు  నీటిలో వేసి అందులో కాసింత మంచి పసుపును కలిపి తాగాలి. లేదంటే ఒక ఉసిరికాయ,  ఒక  ఒక ఇంచ్ తాజా పచ్చి పసుపును మిక్సీ వేసి జ్యూస్ చేసుకుని తాగాలి. ఇందులో కాసింత కరివేపాకు కూడా వేసుకుని జ్యూస్ చేసుకోవచ్చు. అలాగే క్యారెట్ లాంటివి వేసుకోవచ్చు. ఉసిరి-అల్లం..  అల్లంను ఉసిరితో కలపి తీసుకున్నా ఇమ్యూనిటీ మెరుగవుతుంది.  అల్లం శరీరంలో వేడిని  పెంచుతుంది. ఉసిరి  రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. శరరానికి వేడిని అందించడం ద్వారా  అల్లం రక్త  ప్రసరణను పెంచుతుంది,  ఇన్ప్లమేషన్లతో పోరాడుతుంది.   ఉసిరిలో ఉండే  విటమిన్ సి,  యాంటీఆక్సిడెంట్ల కంటెంట్ శరీర సహజ రక్షణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఎలా తీసుకోవాలి.. 2 టేబుల్ స్పూన్ల తాజా ఉసిరి రసాన్ని 1/2 టీస్పూన్ తురిమిన అల్లం రసం తీసుకోవాలి. వీటిని  1/2 కప్పు నీటితో కలిపి తీసుకోవచ్చు. కొన్ని చుక్కల తేనె జోడిస్తే మరీ మంచిది. దీన్ని  ఉదయాన్నే తీసుకోవాలి. ఉసిరి-బెల్లం.. ఉసిరికాయను బెల్లంతో కలిపి తీసుకోవచ్చు.  ఇది చాలా రుచిగా ఉండటమే కాకుండా మెరుగైన ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది.  ఉసిరి-బెల్లం కలిపి మురబ్బా తయారు  చేసుకోవచ్చు.ఈ కాంబో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఐరన్  శోషణను పెంచుతుంది.  శరీరానికి  వెచ్చదనాన్ని అందిస్తుంది. ఎలా తీసుకోవాలి.. ఉసిరిని ఆవిరి పట్టి వాటిని విత్తనాలు తీసివేసి , ఆపై వాటిని బెల్లం సిరప్ లో ఉడికించి, ఉప్పు, మిరియాలు,  జీలకర్ర పొడితో కలిపి తీసుకోవాలి.  చాలా మంచి ఇమ్యునిటీ ఇస్తుంది.                             *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...