కాంగ్రెస్ ఓటమిని ఖరారు చేసిన బొత్స
posted on Dec 28, 2013 @ 10:05AM
పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ నిన్నగాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ “ఏ ఏ జిల్లాల నుండి ఎంత మంది కాంగ్రెస్ నేతలు పార్టీని వీడనున్నారో నావద్ద లిస్టు ఉంది. అధికారం లేనిదే బ్రతకలేమని భావించేవారే పార్టీని వీడుతున్నారు. కానీ ప్రజాసేవకు పదవులతో నిమ్మితం లేదని భావించేవారు మాత్రం ఎన్నటికీ కాంగ్రెస్ పార్టీని వీడబోరు. దాదాపు 25మంది శాసనసభ్యులు ఇద్దరు మంత్రులు పార్టీని వీడుతారని మావద్ద స్పష్టమయిన సమాచారం ఉంది."
"ఒకేసారి ఇంతమంది పార్టీని వీడటం కొంచెం కష్టమనిపించినప్పటికీ, అటువంటి స్వార్ధపరులు బయటకి వెళ్ళిపోవడమే పార్టీకి మేలని నేను భావిస్తున్నాను. కానీ, ఒక్క విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ రోజు పార్టీని వీడి బయటకి వెళ్ళిపోతున్నవారిలో ఏ ఒక్కరూ కూడా మళ్ళీ ఎన్నికయ్యి శాసనసభ లో అడుగుపెట్టే అవకాశం లేదు. ఎందుకంటే ప్రజలు కూడా అటువంటి వారికి తగిన గుణపాటం చెప్పేందుకు సిద్దంగా ఉన్నారు,” అని అన్నారు.
అధికారం లేనిదే బ్రతకలేమని భావిస్తునవారే తమ పార్టీని వీడుతున్నారని చెప్పడంతోనే ఆయన తమ పార్టీ పరిస్థితి ఏమిటో చెప్పకనే చెప్పారు. నీళ్లున్నచోటకే కప్పలు, బెల్లం మీదనే ఈగలు ఎలాగా వాలుతాయో, అధికారం ఉన్న చోటికే రాజకీయ నాయకులు కూడా తరలి వెళ్ళిపోతారు. అదే మాటను బొత్స ఇప్పుడు చెప్పారు.తమ పార్టీ గెలుస్తుందని బొత్స చెప్పుకొంటున్నపటికీ, తమ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదనే గట్టి నమ్మకంతోనే తమ నేతలు పార్టీని వీడుతున్నట్లు అంగీకరించారు. ఒకవేళ నిజంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని భావిస్తే వారు వేరే పార్టీలోకి మారేవారు కాదు కదా? అని బొత్స చెప్పకనే చెప్పారు.
అయితే పీసీసీ అధ్యక్ష హోదాలో ఉన్న బొత్స పనిగట్టుకొని మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఈవిషయం టాంటాం చేసుకొని స్వయంగా పార్టీ పరువు ఎందుకు తీస్తున్నారో ఆయనకే తెలియాలి. కానీ బయటకి పోయేవారి సంఖ్యను సగానికి కుదించి కొంతలో కొంత పార్టీకి ఊరటనిచ్చారు. అయితే ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వారందరూ నిజాయితీపరులు, పదవీ కాంక్ష లేనివారని చెప్పుకోవడం ఈ ఏటి గొప్ప జోక్ అని ఒప్పుకోక తప్పదు. అలాగే బయటకి పోయినవారు దుష్టులు, దుర్మార్గులు, స్వార్ధ రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చేవారని ఆయన సర్టిఫై చేయడాన్నిఎవరూ తప్పు పట్టకపోవచ్చును. గానీ, రేపు ఎన్నికల తరువాత మళ్ళీ వారందరూ తిరిగి కాంగ్రెస్ గూటికే చేరుతునప్పుడు ఆయన ఇప్పుడు జారీ చేసిన సర్టిఫికెట్స్ అలాగే ఉంటాయా లేక రద్దయిపోతాయో కూడా కొంచెం స్పష్టం చేస్తే బాగుంటుందేమో. ఏమయినప్పటికీ మీడియా సమావేశం పెట్టి మరీ కాంగ్రెస్ పార్టీ ఓటమిని పీసీసీ అధ్యక్షుడే ఖరారు చేయడం కాంగ్రెస్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవలసిందే.