దేశానికి మరో గండం! యువతపైనే భారం..
posted on Jun 8, 2021 @ 4:12PM
కొవిడ్ తో దేశం వణికిపోయింది. ఫస్ట్ వేవ్ లో గడ్డు పరిస్థితులు ఎదురవగా.. సెకండ్ వేవ్ లో దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో లక్షలాది మంది హాస్పిటల్ పాలయ్యారు. ఆక్సిజన్ అందక వేలాది మంది పిట్టల్లా రాలిపోయారు. దేశంలో సెకండ్ వేవ్ క్రమంగా తగ్గు ముఖం పట్టింది. అంతలోనే బ్లాక్ , ఎల్లో, వైట్ ఫంగస్ లు వెలుగుచూశాయి. ప్రస్తుతం ఫంగస్ కేసులు కాస్త తగ్గాయి. హమ్మయ్య అని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలోనే దేశానికి మరో గండం పొంచి ఉంది. ఆ గండం నుంచి వీలైనంత త్వరగా గట్టెక్కకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
రక్తం వల్ల విలువైన ప్రాణాలు కాపాడుతాయి. అలాంటి ప్రాణాధారమైన రక్త నిలువలు దేశంలో అడుగంటాయి. ఎక్కడికి వెళ్లినా నో స్టాక్.. నో బ్లడ్ అన్న బోర్డులే కనిపిస్తున్నాయి. రక్తం అవసరం ఉన్న రోగుల బంధువులు కాళ్లరిగేలా బ్లడ్ బ్యాంక్‌ల చుట్టూ తిరుగుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మరీ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు అన్ని చోట్ల నిల్వలు అడుగంటాయి. ప్రధానంగా రక్తం నిల్వ చేసే రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకుల్లోనే నో స్టాక్.. నో బ్లడ్ అన్నే సమాధానం వస్తోంది. కొన్ని బ్లడ్ బ్యాంక్ మొత్తంలో ఒక్క యూనిట్ లేని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్స్ ఆంధ్రప్రదేశ్‌లో 18 ఉండగా.. వాటిల్లో కేవలం 4 వందల యూనిట్లు మాత్రమే నిల్వ ఉంది. కృష్ణా జిల్లాలోని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో ఈ వారం కేవలం ఒకే ఒక్క యూనిట్ రక్తం అందుబాటులో ఉంది. అనంతపురంలోనూ రెండే యూనిట్లు ఉన్నాయి. ఇలా అన్ని జిల్లాల్లో సింగిల్ డిజిట్ నిల్వలు మాత్రమే ఉన్నాయి.
తెలంగాణలోనూ రక్తం నిల్వలు నిండుకున్నాయి. ప్రస్తుతం రెడ్‌క్రాస్ దగ్గర 3వందల యూనిట్లు మాత్రమే నిల్వలున్నాయి. కరోనాకు ముందు ప్రతి నెలా ఏపీలో 5 వేల, తెలంగాణలో 3వేల యూనిట్ల రక్తసేకరణ జరిగేది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు పూర్తిగా మారి పోయాయి. కరోనా భయం, లాక్‌డౌన్‌తో దాతలు ఎవరూ ముందుకు రావడం లేదు.కొవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతుండడంతో.. ఆ ప్రభావం తీవ్రంగా చూపుతోంది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతమైన నేపథ్యంలో మూడు నెలలుగా రక్త దాన శిబిరాలు పూర్తిగా నిలిచి పోయాయి. సినీహీరోల బర్త్‌డేల సమయంలో కూడా ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో రక్త దానం చేసేవారు. ఇప్పడు అలాంటి పరిస్థితి కూడా కనిపించడం లేదు.వ్యాక్సిన్ వేసుకున్నాక 8 వారాల పాటు రక్తం ఇవ్వకూడదన్న మార్గదర్శకాలు ఉన్న నేపథ్యంలో రక్తం సేకరణ కష్టంగా మారింది.
బ్లడ్ కొరత ప్రభావం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులపై తీవ్రంగా చూపుతోంది. ఒక్కో సమయంలో విలువైన ప్రాణాలు కూడా పోతున్నాయి. రక్తం అందుబాటులో లేకపోవడంతో తలసేమియా పేషెంట్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. గర్బిణీలు, ఆక్సిడెంట్స్‌లో గాయాల పాలైన వారు రక్తం కోసం ఎదురు చూస్తున్నారు. రక్తం అవసరం మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి ముందుగా ప్లాన్ చేసుకున్న ఆపరేషన్లకు, రెండు ప్రమాదాల సమయంలో, మూడవది తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు. ఆపరేషన్లు, క్షతగాత్రులకు కొంత సమయం ఉంటుంది, ఓల్డ్ రక్తం కూడా ఇవ్వొచ్చు. కానీ.. తలసేమియా రోగులకు మాత్రం రక్తం సేకరించిన ఐదు రోజుల లోపే ఫ్రెష్ బ్లడ్ ఎక్కించాలి. ఇలా ప్రతి 20 రోజులకు ఒక సారి రక్తం అవసరం ఉంటుంది. ఇలాంటిది ఇప్పుడు ఈ రోగులకు బ్లడ్ కొరత ప్రాణ సంకటంగా మారింది.
రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది ఎంత ప్రయత్నం చేసినా రక్త దానం చేసే వారు ఎక్కడా కనిపించడం లేదంటున్నారు. తమ దగ్గర ఉన్న కాంటాక్ట్ నెంబర్లకు ఫోన్లు చేసినా సరైన స్పందన రావడం లేదని రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు అంటున్నారు. రక్తం కొరతను చక్క దిద్దేందుకు ఈ నెల 17న 75 క్యాంపుల్లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. వ్యాక్సిన్ తర్వాత ఇవ్వడం కుదరదంటున్న నిపుణులు.. వ్యాక్సిన్‌కు ముందే రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలని పిలుపునిస్తున్నారు. సోషల్ డిస్టెన్స్ ఉండేలా ఏర్పాట్లు చేశామని రక్తం ఇవ్వడానికి యూత్ ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు. రక్త దానం చేసేవారు ఎవరైనా ఉంటే.. తమ టోల్ ఫ్రీ నెంబర్‌కి ఫోన్ చేస్తే తామే వస్తామంటున్నారు.