వైసీపీ పాపాలలో బీజేపీకీ భాగం?!
posted on Jun 17, 2023 @ 11:34AM
జగన్ పాలన అంతా అవినీతి,అరాచకం,అప్పులేనంటూ ఇప్పుడు మన్నూ మిన్నూ ఏకం చేస్తూ విమర్శలు గుప్పించిన బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలు.. అందుకు ఈ నాలుగేళ్లూ అండగా, దండగా నిలిచినందుకు మాత్రం ఇసుమంతైనా విచారం కానీ, పశ్చాత్తాపం కానీ వ్యక్తం చేయలేదు. కేంద్ర పథకాలపై జగన్ తన బొమ్మ వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపణలు గుప్పించిన ఆ నేతలు ఇంత కాలం ఎందుకు నోరు మెదపలేదన్న జనం ప్రశ్నకు సమాధానం చెప్పేందుందుకు ఎందుకు సిద్ధంగా లేరు.
పేదల కోసం ఇచ్చిన బియ్యాన్ని అమ్ముకుంటున్నారని, విశాఖపట్నాన్నిభూ రాబందుల కేంద్రంగా మార్చారని తీవ్ర స్థాయిలో జగన్ సర్కార్ ను దుయ్యబట్టిన ఆయ నాయకద్వయం.. అందుకు అన్ని విధాలుగా సహకరించినా.. తాము మాత్రం నిజాయితీపరులమని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ తొమ్మిదేళ్లలో రూ.5 లక్షల కోట్లకి పైగా రాష్ట్రానికి ఇచ్చామనీ, ఆ డబ్బంతా ఏమైందనీ ఇంత కాలం ప్రశ్నించకుండా ఇప్పుడు నిలదీయడంలోని ఆంతర్యమేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం ఇచ్చిన డబ్బుకు సరిపడా అభివృద్ధి కనిపించడం లేదని చెబుతున్న అమిత్ షా.. అభివృద్ధి కనిపించడం లేదని ఇప్పుడే తెలిసిందా? ముందే తెలిస్తే.. ఎందుకు జగన్ సర్కర్ ను నిలదీయలేదని అంటున్నారు.
మైనింగ్, భూ మాఫియా, గంజాయి స్మగ్లింగ్ ఇలా అన్నిటిలోనూ వైసీపీ నాయకులే ఉన్నారంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా జగన్ పరిపాలనపై ఇప్పుడు నిప్పులు చెరుగుతున్నారు. కానీ ఒక మాజీ మంత్రి, మాజీ సీఎం కు స్వయానా సోదరుడు, ముఖ్యమంత్రి జగన్ కు సొంత బాబాయ్ వివేకా హత్య జరిగి నాలుగేళ్లయినా పురోగతి కనిపించకపోవడాన్ని ఎందుకు నిలదీయలేదంటున్నారు. గొడ్డలి పోటును గుండెపోటుగా చిత్రీకరించి, వివేకా శరీరంపై గాయాలకు కుట్లువేసి బ్యాండేజీలు వేసినా, అందుకు పాల్పడిన వారిని, పోనీ ఆక్రతువునంతా దగ్గరుండి చేయించిన వారినీ కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ కనిపెట్టలేకపోవడం వెనుక ఉన్న హస్తం ఎవరిదన్న విషయంపైనా కేంద్ర హోంమంత్రి అయిన అమిత్ షా ఎందుకు మౌనంగా ఉన్నారని ఏపీ జనం నిలదీస్తున్నారు. ఇక అన్నిటికంటే స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ చేసి ఏపీ రాజధానిగా ప్రకటించిన అమరావతిని నిర్వీర్యం చేసేందుకు ఈ నాలుగేళ్లుగా జరిగిన అన్ని ప్రయత్నాలనూ ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోవడం వెనుక ఉన్న కారణాలేమిటని ప్రశ్నిస్తున్నారు.
జగన్ రెడ్డి పాలనలో ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మారిందని ధ్వజమెత్తిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఇప్పుడే ఆ విషయం గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జగన్ రెడ్డి పాలన దౌర్భాగ్యంగా ఉందని కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు గుర్తించడం సంతోషమే కానీ, ఇంత కాలం ఏపీలో జగన్ అరాచక పాలనను అన్ని విధాలుగా సమర్ధిస్తూ, ఆర్థిక అరాచకత్వాన్ని మరింత ప్రోత్సహించే విధంగా నిబంధనలను తుంగలో తొక్కి మరి అప్పులిచ్చి ఏపీని అధ్వాన స్థితికి తేవడంలో కేంద్రంలోని మోడీ సర్కార్ పాత్ర ఎంత ఉందో పరిశీలకులు సోదాహరణంగా చేస్తున్న విశ్లేషణలకు షా, నడ్డా ద్వయం సమాధానం చెప్పాలని ఏపీ జనం కోరుతున్నారు.
నాలుగేళ్లుగా పరస్పర ప్రయోజనాల పరిరక్షణ కోసం అంటకాగిన వైసీపీ, బీజేపీలు ఇప్పుడు ఎన్నికల ముందు ప్రజలను మరో సారి మోసం చేయడానికి తెరతీసిన కొత్త డ్రామాగా అమిత్ షా, నడ్డాల విమర్శలను పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత నాలుగేళ్లుగా జగన్ రెడ్డి దుష్టపాలనకు వెన్నుదన్నుగా నిలిచి, ఆర్ధిక అరాచకానికి అండగా నిలుస్తూ జగన్ సర్కార్ ఎప్పుడు అడిగితే అప్పుడు అప్పులు తెచ్చుకునేందుకు అనుమతులు ఇచ్చిన కేంద్రం, ఇప్పుడు విమర్శల దాడికి దిగడం వెనుక రాజకీయ ప్రయోజనాభిలాషను పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
జగన్ పాలన అంతా అవినీతి, అక్రమాలు, కుంభకోణాల మయం అంటూ గగ్గోలు పెట్టిన అమిత్ షాకు (ఆయన కేంద్ర హోంమంత్రి) జగన్ పై వున్న 16 చార్జి షీట్ల పై విచారణ నిలిచిపోయిందన్న సంగతి తెలియదా. ఆయన కోర్టుకు హాజరు కాకుండా సాధించుకున్న వెసులుబాటు వెనుక ఎవరు ఉన్నదో ప్రజలకు అర్ధం కాదనుకుంటున్నారా అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.