ఎంత వారుగానీ.. కాంత దాసులే.. బిల్.. జిల్ జిల్ జిగేట్స్
posted on May 18, 2021 @ 3:31PM
ప్రపంచ కుబేరుడు. చూట్టానికి సింపుల్‌గా.. స్మార్ట్‌గా ఉంటారు. అమాయకంగా, నవ్వుతూ కనిపిస్తారు. హుందాగా, దర్పంగా వెలిగిపోతారు. మైక్రోసాఫ్ట్ అధినేతగా బిల్ గేట్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ పాపులారిటీ. మిలిండాతో విడాకుల వ్యవహారంతో గేట్స్.. పాపులారిటీ ఒక్కసారిగా మసకబారింది. వాళ్లు అందుకే విడిపోతున్నారంటూ.. పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా, వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన ఓ స్టోరీతో బిల్ గేట్స్ యవ్వారం మరింత రసకందాయంలో పడింది. ఆయనా.. ఆ టైపేనంటూ.. ఎంత వారుగానీ కాంత దాసులే అంటూ వాల్‌స్ట్రీట్ జర్నల్ ఓ పాత ఎఫైర్‌ను కొత్త బ్రేకింగ్ న్యూస్‌గా మార్చివేసింది.
20 ఏళ్ల క్రితం కంపెనీ మహిళా ఉద్యోగితో బిల్‌గేట్స్ నెరిపిన అక్రమ సంబంధం తాజాగా చర్చనీయాం శమైంది. రెండేళ్ల క్రితమే కంపెనీ దృష్టికొచ్చిన ఈ వ్యవహారంపై దర్యాప్తు కూడా జరిగినట్లు తెలుస్తోంది. దర్యాప్తు పూర్తికాకముందే మైక్రోసాఫ్ట్ బోర్డు నుంచి బిల్‌గేట్స్ తప్పుకున్నారంటూ వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించింది.
2019 ద్వితీయార్ధంలో మైక్రోసాఫ్ట్ బోర్డుకు ఓ లేఖ అందింది. బిల్‌గేట్స్ కొన్నేళ్ల పాటు తనతో శారీరక సంబంధం నెరిపారంటూ మైక్రోసాఫ్ట్ మహిళా ఇంజనీరు ఒకరు ఆ లేఖలో ఆరోపణలు చేశారు. దాంతో కంపెనీ బోర్డు ఓ న్యాయవాద సంస్థ ద్వారా స్వతంత్ర దర్యాప్తు జరిపించింది. రాసలీలల ఆరోపణల నేపథ్యంలో బిల్‌గేట్స్ బోర్డులో కొనసాగడం తగదని కొందరు డైరెక్టర్లు భావించారు. అయితే దర్యాప్తు పూర్తి చేసి, తుది నిర్ణయం తీసుకునే లోపే గేట్స్ బోర్డు నుంచి తప్పుకున్నారనేది ఆ స్టోరీ సారాంశం.
వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనంపై మైక్రోసాఫ్ట్ సైతం స్పందించింది. ఇరవై ఏళ్ల నాటి ఆ వ్యవహారం సామరస్యపూర్వకంగానే పరిష్కారమైందని తెలిపింది. బోర్డు నుంచి వైదొలగడానికి దానితో ఎలాంటి సంబంధం లేదని మైక్రోసాఫ్ట్ ప్రతినిధి చెప్పారు. దర్యాప్తులో ఏం తేలిందన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. దాతృత్వ కార్యక్రమాల కోసం మరింత సమయం వెచ్చించేందుకు మైక్రోసాఫ్ట్ బోర్డు నుంచి వైదొలుగుతున్నట్లు 2020 మార్చిలో బిల్‌గేట్స్ ప్రకటించారు.
తమ 27 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు బిల్‌గేట్స్, మిలిండా ఈ మధ్యనే ప్రకటించారు. ఇప్పటికే విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి నుంచి బిల్ గేట్స్ జీవితంపై పలురకాల కథనాలు.. పలు కోణాలు.. వెలుగు చూస్తున్నాయి.