బిహార్ మీద కేంద్రం వరాల జల్లు!
posted on Jul 23, 2024 @ 12:42PM
కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్‌కి చెందిన తెలుగుదేశం పార్టీ, బిహార్‌కి చెందిన జేడీయు మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం మనుగడలో వుండటానికి ఈ రెండు పార్టీలు కీలకంగా వున్నాయి. ఈ నేపథ్యంలో బిహార్ మీద కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో వరాల జల్లు కురిపించారు. బిహార్‌లో జాతీయ రహదారులకు 20 వేల కోట్లు కేటాయించారు. బహుపాక్షిక అభివృద్ధి ఏజెన్సీల నిధుల ద్వారా బిహార్‌కి ప్రత్యేక ఆర్థిక సాయం అందించనున్నారు. వరదల కారణంగా ప్రతి యేటా నష్టపోతున్న బిహార్‌కి ఊరట కలిగించే విధంగా వరద నివారణ, సాగు కార్యక్రమాలకు 11 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. బిహార్‌లో వరదలకు కారణం అవుతున్న పై రాష్ట్రాలు అస్సాం, హిమాచల్ ప్రదేశ్‌లకు కూడా వరద నివారణకు ప్రత్యేక నిధులు కేటాయించారు. బిహార్‌లో ఆధ్యాత్మిక టూరిజాన్ని పెంచడానికి చర్యలు తీసుకోనున్నారు. కాశీ తరహాలో బుద్ధ గయని అభివృద్ధి చేయనున్నారు. బిహార్‌లోని రాజ్‌గిరి జైన ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి సమగ్ర ప్రణాళికకు రూపకల్పన చేయనున్నారు. టూరిజం కేంద్రంగా నలంద విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేయనున్నారు.