జీఎంఆర్ పై జగన్ సర్కారుకు ఎందుకంత ప్రేమ? భోగాపురం, కాకినాడ ప్రాజెక్టులపై నోరు విప్పరెందుకు?
posted on Oct 28, 2019 @ 11:25AM
కులం చూడం... మతం చూడం... పార్టీలు అసలే చూడమంటోన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి... ప్రాజెక్టుల కాంట్రాక్టులు, కంపెనీల విషయంలో పక్షపాతం చూపెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో కంపెనీ విషయంలో ఒక్కో విధంగా వ్యవహరిస్తున్నట్లు ప్రభుత్వ నిర్ణయాలను బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా ఒక సామాజిక వర్గానికి చెందిన కంపెనీలపై జగన్ సర్కారు తీవ్ర పక్షపాత వైఖరి అవలంభిస్తోందని అంటున్నారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నవయుగ కంపెనీకి కాంగ్రెస్ అండ్ టీడీపీ హయాంలో కేటాయించిన ప్రాజెక్టులను భూములను వివిధ కారణాలు చూపెడుతూ రద్దుచేసిన జగన్ ప్రభుత్వం... అలాంటి కారణాలే మిగతా కంపెనీలకు కేటాయించిన ప్రాజెక్టుల్లో స్పష్టంగా కనిపిస్తున్నా వాటిని మాత్రం కొనసాగించడంపై విమర్శలు వస్తున్నాయి.
నవయుగ కంపెనీకి కాంగ్రెస్ హయాంలో సెజ్ కోసం వేలాది ఎకరాల భూములు కేటాయించారు. అయితే అందులో ఎలాంటి పురోగి లేకపోవడంతో... జగన్ సర్కారు ఆ భూ కేటాయింపులను రద్దు చేసింది. అయితే, ఇదే తరహాలో కాకినాడలో ప్రత్యేక ఆర్ధిక మండలి కోసం జీఎంఆర్ కంపెనీకి కూడా వేలాది ఎకరాల భూములు కేటాయించారు. అంతేకాదు రాయితీలు, పలు మినహాయింపులు ఇచ్చారు. అయితే, ఏ కారణాలతో నవయుగ కంపెనీ భూ కేటాయింపులు రద్దు చేశారో... సేమ్ టు సేమ్ అలాంటి రీజన్సే కాకినాడ సెజ్ లోనూ కనిపిస్తున్నా... జీఎంఆర్ భూకేటాయింపులపై మాత్రం జగన్ సర్కారు నోరు విప్పడం లేదు. పైగా టీడీపీ హయాంలో మొదలుపెట్టిన భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రాజెక్టును జీఎంఆర్ తోనే కొనసాగిస్తామంటూ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ప్రకటించడం సంచలనంగా మారింది. ఎందుకంటే, వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా భోగాపురం ఎయిర్ పోర్ట్ పై చేయని ఆరోపణ లేదు.
జగన్మోహన్ రెడ్డే స్వయంగా ఎన్నోసార్లు తీవ్ర విమర్శలు చేశారు. జీఎంఆర్ కు అనుకూలంగా చంద్రబాబు రీటెండర్లు పిలిచారంటూ ఆరోపించారు. అలాగే, భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం కారుచౌకగా 2వేల 703 ఎకరాలను అప్పగించారు. భూములతోపాటు రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించారు. అయితే, అవినీతి అక్రమాలను అస్సలు సహించేది లేదని, ప్రజాధనం ఆదా చేయడమే తన లక్ష్యమంటూ చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి... భోగాపురం ఎయిర్ పోర్ట్ విషయంలోనూ, అలాగే కాకినాడ సెజ్ విషయంలోనూ ఎందుకు జీఎంఆర్ కు అనుకూలంగా యూటర్న్ తీసుకున్నారంటూ విమర్శలు చెలరేగుతున్నాయి. ప్రతి దానికీ రివర్స్ టెండరింగ్ అంటోన్న జగన్ కు భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రాజెక్టు కనిపించడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు.