మహా నరకాలు మన మహానగరాలు!
posted on Sep 8, 2022 7:47AM
దేశంలో మహా గొప్పగా చెప్పుకునే నగరాల పరిస్థితి పేరుగొప్ప ఊరుదిబ్బ అన్న చందంగా మారింది. భారీ వర్షం పడితే నగరాలు నదులను తలపిస్తున్నాయి. చెన్నై, ముంబై, హైదరాబాద్, బెంగళూరు.. ఇలా ఏ నగరం తీసుకున్నా.. వాన పడితే వరదే అన్నట్లుగా ఉన్నాయి. తాజాగా భారీ వర్షాలకు బెంగళూరు నగరం నీట మునిగింది. దారులన్నీ గోదారులే అయ్యాయి. ఐటీ హబ్ గా చెప్పుకుంటున్న నగరం చిగురుటాకులా వణికిపోయింది. ఇండియన్ సిలికాన్ వ్యాలీగా ఘనంగా చెప్పుకునే నగరంలో నీటి ముప్పు నుంచి జనాలను కాపాడేందుకు ప్రజలను ట్రాక్టర్లు, జేసీబీల్లో తరలించాల్సిన పరిస్థితి వచ్చింది. విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్ జీ, బ్రిటానియా సీఈవో వరుణ్ బెర్రీ, బైజూ రవీంద్రన్, బిగ్ బాస్కెట్ కో ఫౌండర్ అభినయ్ చౌదరి లాంటి వారి నివాసాలకూ వరద ముప్పు తప్పలేదు. బెంగళూరుకు తాజా వరదల కారణంగా దాదాపు వేయి కోట్ల రూపాయల ఆస్త నష్టం సంభవించిందన్నది ప్రభుత్వ అంచనా. భౌగోళికంగా ఎత్తైన ప్రాంతంలో ఉన్న బెంగళూరును వరదలు ముంచెత్తాయంటే అది ప్రకృతి వైపరీత్యమని చేతులు దులిపేసుకునే అవకాశం లేదు.
అడ్డగోలు ఆక్రమణలు, చెరువుల్లో భవనాలు, కాలువలను ఆక్రమించి మరీ నిర్మాణాలు.. రియల్టర్ల ప్రలోభాలకు లొంగి ఇష్టారీతిగా అనుమతులిచ్చుసిన అధికారుల కాసుల కక్కుర్తి, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ సిస్టం. వీటి కారణంగానే బెంగళూరు భారీ వర్షాలకు నీట మునిగింది. అందమైన నగరం మన బెంగళూరు అంటూ మురిసి పోతున్నామే కానీ.. నగర నిర్మాణంలో ప్రణాళికా లోపాల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. బెంగళూరు ఐటీ హబ్ గా మారడంతో గత రెండు దశాబ్దాలలో నగరం భారీగా విస్తరించింది. జనాభా అంతకంతకూ పెరిగింది. అయితే మూడు దశాబ్దాల కిందట బెంగళూరులో 226 కిలోమీటర్లు ఉన్న డ్రైనేజీ సిస్టం 2017 నాటికి 110 కిలోమీటర్లకు తగ్గిపోయిందంటేనే ఎంత ప్రణాళికా రహితంగా, ఎంత అస్తవ్యస్తంగా అధికారుల తీరు ఉందో అర్ధం చేసుకోవచ్చు.నాలాల ఆక్రమణ ఏ స్థాయిలో జరిగిందో అవగతం చేసుకోవచ్చు.
ఈ కారణంగానే భారీ వర్షం పడితే నీరు బయటకు వెళ్లే మార్గం లేక కాలనీలకు కాలనీలు చెరువులైపోయాయి. దారులు గోదారులైపోయాయి. రెండేళ్ల కిందట హైదరాబాద్ లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ రహదారులపై మోటారు వాహనాలు కాదు పడవలు తిరిగాయి. ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను పడవలలో తరలించాల్సిన పరిస్థితి వచ్చింది.
రెండేళ్ల కిందట సంగతి ఎందుకు హైదరాబాద్ ను విశ్వనగరం అంటూ మురిసిపోతున్నామే కానీ.. వర్షం కురిస్తే ఇదే నగరం విశ్వనరకంలా మారిపోతుంది. ఆకాసం మబ్బు పట్టిందంటే హైదరాబాద్ నగర వాసులు వణికిపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇంటికి చేరితే చాలురా బాబూ అనుకుంటున్నారు. చినుకు పడితే చాలు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం. ప్రధాన రహదారులపై మోకాలి లోతు నీరు. ఇదీ మన విశ్వనగరం హైదరాబాద్ పరిస్థితి.
ఇప్పటికైనా ఆక్రమణల తొలగింపుపై చిత్తశుద్ధితో శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బెంగళూరైనా, హైదరాబాదైనా ప్రణాళికా రహితంగా నగరాల విస్తరణకు అనుమతులు ఇచ్చేసుకుంటూ పోతే ఆయా నగరాలలో జనజీవనం నరకప్రాయంగా మారుతుందనడానికి ఇప్పుడు బెంగళూరులో పరిస్థితి, రెండేళ్ల కిందట హైదరాబాద్ పరిస్థితే ప్రత్యక్ష తార్కానం.