తాడేపల్లి ప్యాలస్ ను ముట్టడిస్తాం జాగ్రత్త.. జగన్ కు గోరంట్ల హెచ్చరిక
posted on Nov 7, 2022 8:42AM
జగన్ పాలనలో ఇకపై ఓ ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు నష్టం జరిగినా తాడేపల్లి ప్యాలెస్ ను ముట్టడిస్తాం తస్మాత్ జాగ్రత్త అంటూ తెలుగుదేశం సీనియర్ నాయకుడు, రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.
తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి సంఘీ భావంగా తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నుంచి 125 కార్లలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు నర్సీపట్నానికి ర్యాలీగా తరలి వచ్చారు. ఈ సందర్బంగా వారు అయ్యన్న పాత్రుడికి సంఘీ భావం తెలిపారు. ఇతర జిల్లాల నుంచి వందల మంది వచ్చి మద్దతుగా నిలవడం తనకు కొండంత ధైర్యాన్నిచ్చిందన్న అయ్యన్నపాత్రుడు ఈ సందర్బంగా వ్యాఖ్యానించారు.
కాగా ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడారు. ఆయన జగన్ పై నిప్పులు చెరిగారు. విపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర అంటూ మూడేళ్లు తిరిగిన నిన్ను ఏనాడైనా అడ్డగించామా అంటూ జగన్ ను నిలదీశారు.
అయినా సీఐడీ పోలీసులు పగలంతా ఏం చేస్తుంటారు.. అరెస్టులు అర్దరాత్రి దాటిన తరువాతే ఎందుకు చేస్తారు అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. అచ్చెన్నాయుడిపై ఏదో ఒక సాకుతో కేసులు పెడుతూనే ఉన్నారని విమర్శించారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారంటూ అయ్యన్న కుమారుడు విజయ్ ఇంటికి వెళ్లి ఆయన కుమార్తెను వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.