తస్మాత్ జాగ్రత్త జగన్!
posted on Oct 23, 2022 6:30AM
ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర అంటే తన కుర్చీకిందకు నీళ్లు వచ్చినట్లు భయపడుతున్నారు. కారణం ఎమిటి? విపక్ష నేతగా ఈ జగనే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర పొడవునా అప్పటి ముఖ్యమంత్రిపై విమర్శల వర్షమే కురిపించారు. అయినా ఎక్కడా ఆయన పాదయాత్రకు అవాంతరాలు, అడ్డంకులూ లేవు. ఆ పాదయాత్రలో శాంతి భద్రతల సమస్య సృష్టించేందకు శతథా ప్రయత్నించారు. అయినా అప్పుడు పోలీసులు సంయమనమే పాటించారు. అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని గౌరవించింది. పాదయాత్ర సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంది.
ఇప్పడు జగన్ అధికారంలో ఉన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. కానీ రాష్ట్రంలో ఎవరికీ స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేదు. విపక్ష నేత తన సొంత నియోజక వర్గంలో పర్యటించాలన్నా బోలెడన్ని ఆంక్షలు.. అడుగడుగునా దాడుల యత్నాలు. తమకు ఇష్టం లేని మాట వినపడకూడదు, ఇష్టం లేని వారు రాష్ట్రంలో ఉండకూడదు. తాను వద్దనుకుంటే వద్దు అంతే. నరసాపురం ఎంపీకి తన సొంత నియోజవకర్గానికి వచ్చే అవకాశం లేదు. ఇక అమరావతి రైతులు తమ పోరాటానికి ప్రజా మద్దతు కూడగట్టుకునేందుకు పాదయాత్ర చేస్తుంటే అడుగడుగునా ఆంక్షలు, దాడులు. చివరికి న్యాయస్థానాల ఆదేశాలనూ లెక్క చేసే పరిస్థితి లేదు. ఇదీ ప్రస్తుతం జగన్ పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్న తీరు.
ఇంతకూ ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం భూములిచ్చిన రైతులు కోరుతున్నదేమిటి? తాము ఏ లక్ష్యం కోసమైతే భూములు ఇచ్చామో ఆ లక్ష్యానికి పూర్తి భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తున్నారు. తాము రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఇచ్చిన భూములను ఎండగట్టి.. తాము గత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని తుంగలో తొక్కి మూడు రాజధానులంటున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని కోరుతున్నారు. ఇందుకు విపక్ష నేతగా జగన్ కూడా అంగీకరించి, అమరావతే రాజధాని అని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ మాట తప్పద్దు, మడమ తిప్పద్దు అని కోరుతున్నారు.
అందుకోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. న్యాయపోరాటం చేస్తున్నారు. గతంలో తమ పోరాటం విజయవంతం కావాలని న్యాయస్థానం టు దేవస్థానం అంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి తిరుమల వరకూ పాదయాత్ర నిర్వహించారు. ఆ యాత్రను అప్పట్లో అడ్డుకోవడానికి జగన్ సర్కార్ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ప్రజాదరణతో ఆ యాత్ర దిగ్విజయంగా సాగింది. సరే కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సీఆర్‌డీఏ చట్టం ప్రకారమే నడుచుకోవాలని తేల్చి చెప్పింది. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని తేల్చి చెప్పింది. లేని అధికారాలతో చట్టాన్ని రద్దు చేయలేరని కూడా తీర్పు ఇచ్చింది. అధికారం లేనప్పుడు సీఆర్‌డీఏ చట్టం రద్దు కూడా కుదరదని తేల్చి చెప్పింది ధర్మాసనం. ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాల్సిందేనని, రైతులకు మూడు నెలల్లో అన్ని సౌకర్యాలతో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలని ఆదేశించింది.
అభివృద్ది పనులపై ఎప్పటికప్పుడు తమకు నివేదిక సమర్పించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. రాజధాని కోసం తప్ప భూములను ఇతర అవసరాలకు ఉపయోగించకూడదని స్పష్టంగా చెప్పింది. ఇతర అవసరాలకు రాజధాని భూములను తనఖా పెట్టడానికి వీల్లేదని చెప్పింది హైకోర్టు. ఏ ఒక్క కార్యాలయాన్ని కూడా అమరావతి నుంచి తరలించడానికి వీల్లేదంది. అంతకు ముందే జగన్ సర్కార్ తాను అసెంబ్లీలో ఆమోదింప చేసుకున్న మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంది. అయినా తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లంటూ మూడు రాజధానుల పల్లవే ఎత్తుకుంది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంను ఆశ్రయించింది. అదలా ఉంచితే.. అమరావతే ఏపీకి ఏకైక రాజధాని డిమాండ్ తో రైతులు ఈ సారి అమరావతి టు అరసవల్లి మహా పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్ర విజయవంతమైతే రాష్ట్రం మొత్తం సీఎం జగన్ మూడు రాజధానుల విధానాన్ని వ్యతిరేకిస్తున్నదన్నది ప్రస్ఫుటంగా తేలిపోతుంది. ఇప్పటికే న్యాయస్థానం టు దేవస్థానం మహా పాదయాత్ర జన నీరాజనం మధ్య విజయవంతం అయ్యింది. అదే విధంగా ఆ తరువాత ఇక ప్రభుత్వానికి ఈ అంశంపై ఏ మాట్లాడినా చెల్లుబాటు కాదన్న విషయం అర్ధమైపోయింది. అందుకే అమరావతి టు అరసవల్లి మహాపాదయాత్రకు కూడా కోస్తాంధ్ర జిల్లాల్లో జనం బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో ఈ యాత్ర విశాఖ చేరకుండా నిలువరించాలన్న వెర్రి ప్రయత్నంతో ప్రభుత్వమే స్వయంగా శాంతి భద్రతల సమస్య సృష్టించైనా నిలువరించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే విశాఖకు పాదయాత్ర చేరువ అవుతున్న కొద్దీ పోలీసులు, వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నాయి.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరిట దేశ వ్యాప్తంగా చేపట్టిన పాదయాత్రకు ఎక్కడా ఎటువంటి ఆటంకాలూ లేకుండా సజావుగా సాగుతోంది. ఆ యాత్రలో ఇంత మందే పాల్గొనాలన్న ఎటువంటి ఆంక్షలూ లేవు. రాహుల్ పాదయాత్ర ఏపీలోకి ప్రవేశించి కూడా శాంతియుతంగా కొనసాగుతోంది. అలాగే జగన్ కు స్వయానా సోదరి, వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు. ఆమె తన పాదయాత్ర పొడవునా తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
అయినా అక్కడి ప్రభుత్వం నుంచి ఆమె పాదయాత్రకు ఎటువంటి అవాంతరాలూ ఎదురు కావడం లేదు. మరి ఏపీలో ఒక్క రైతుల మహా పాదయాత్రకే ఈ పరిమితులు, ఆంక్షలు ఎందుకు? ఎందుకంటే.. రైతుల మహా పాదయాత్రకు విశాఖ ప్రజ కూడా మంగళారతులు పడుతోందని తేలిపోతే.. ప్రభుత్వ మనుగడే ప్రశ్నార్థకమౌతుంది కనుక. అందుకే న్యాయస్థానం కన్నెర్ర చేసినా, జనం తిరగబడుతున్నా పట్టించుకోవడం లేదు. అయితే ఇదే నిర్బంధ కాండ, ఇదే అరాచకత్వం ఎంతో కాలం సాగదని చరిత్ర చెప్పిన సత్యం ఇటీవలే శ్రీలంక పాలకులకు పలాయనం చిత్తగించాల్సిన పరిస్థితి ప్రత్యక్ష ఉదాహరణ. తస్మాత్ జాగ్రత్త జగన్.